రీజనల్ రింగ్ రోడ్డుపై సర్కారు ముందుకే వెళ్తున్నది. భువనగిరి ఆర్డీఓ పరిధిలో త్రీజీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎన్హెచ్ఏఐ బహిరంగ ప్రకటన రిలీజ్ చేసింది. ఈ మేరకు ఈ నెల 27నుంచి 30 వరకు భువనగిరి ఆర్డీఓ కార్యాలయంలో భూ నిర్వాసితులతో సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ ఏడాది అక్టోబర్‌లోనే త్రీజీ విడుదల చేయగా, పెండింగ్ భూములపై మరో త్రీజీ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మరోవైపు భూములు ఇచ్చేది లేదని రైతులు స్పష్టం చేస్తున్నారు.
– యాదాద్రి భువనగిరి, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ)
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా భారత్ మాల పరియోజన కింద రీజనల్ రింగ్ రోడ్డు(ఆర్ఆర్ఆర్) నిర్మించనున్నాయి. ప్రస్తుతం ఉన్న అలైన్మెంట్ ప్రకారం ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం మొత్తం సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లోని 19 మండలాల పరిధిలోని 113 గ్రామాల మీదుగా వెళ్తున్నది. ప్రాజెక్టును ఉత్తర, దక్షిణ భాగాలుగా విభజించారు. ఉత్తర భాగంలో యాదాద్రి భువనగిరి జిల్లా మీదుగా 59.33 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మించనున్నారు. దీని పరిధిలో తుర్కపల్లి, యాదగిరిగుట్ట, భువనగిరి, వలిగొండ, చౌటుప్పల్ మండలాలు ఉన్నాయి. సుమారు 2వేల ఎకరాల భూమిని సేకరించనున్నారు. భువనగిరి పరిధిలోని భూములు విషయంలో గతంలో కొంత కాలంపాటు హైకోర్టు స్టే ఉండడంతో భూ సేకరణ ప్రక్రియకు బ్రేక్ పడింది. ఆ తర్వాత హైకోర్టు స్టేను ఎత్తేయడంతో భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేశారు.
ట్రిపుల్ ఆర్‌లో భాగంగా భువనగిరి మండలంలోని గౌస్‌నగర్, కేసారం, యెర్రంబల్లి, తుక్కాపూర్, పెంచికల్‌పహాడ్, రాయగిరి గ్రామాల్లో భూమిని తీసుకోనున్నారు. గతంలో త్రీడీ నోటిఫికేషన్ జారీ చేశారు. మొత్తం 96హెక్టార్లు సేకరించనున్నారు. ఇందులో భాగంగా అక్టోబర్ 22న 70 హెక్టార్లకు త్రీజీ నోటిఫికేషన్ విడుదల చేశారు. అప్పుడు ఆయా గ్రామాల వారీగా ఆర్డీఓ కార్యాలయంలో సమావేశాలు ఏర్పాటు చేశారు. కానీ ఎక్కువ శాతం మంది రైతులు బహిష్కరించారు. తాజాగా మిగిలిన 26 హెక్టార్లకు త్రీజీ నోటిఫికేషన్ జారీ చేశారు.
ట్రిపుల్ ఆర్కు భూములు ఇచ్చేదే లేదని, అలైన్ మెంట్ మార్చాలని నిర్వాసితులు చెబుతున్నారు. ప్రధానంగా రాయగిరి రైతులు రణం చేస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాంత రైతులు పలు సందర్భాల్లో తమ భూములను కోల్పోవాల్సి వచ్చింది. వైటీడీఏ విస్తరణ, హైటెన్షన్ వైర్లు, జాతీయ రహదారి నిర్మాణం సమయంలో భూములను వదులుకున్నారు. దాంతో ఇక్కడి రైతులు పెద్దఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. ఇటీవల ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కూడా కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. జిల్లాలో ఎప్పటికప్పుడు ధర్నాలు నిర్వహిస్తూనే ఉన్నారు. అలైన్ మెంట్ మారుస్తామని అనేక సందర్భాల్లో హామీ ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పట్టించుకోకపోవడంపై భూనిర్వాసితులు మండిపడుతున్నారు.
భువనగిరి మండలంలోని ఆరు గ్రామాల మీదుగా ట్రిపుల్ ఆర్ వెళ్తున్నది. ఆయా చోట్ల 118.188 కిలోమీటర్ల నుంచి 133.178 కిలోమీటర్ల వరకు రహదారి నిర్మించనున్నారు. త్రీజీ నోటిఫికేషన్ విడుదల నేపథ్యంలో ఆయా గ్రామాల నిర్వాసితులతో ఆర్డీఓ సమావేశాలు నిర్వహించనున్నారు. కోల్పోతున్న వ్యవసాయ భూమి లేదా ఖాళీ ప్లాట్ విస్తీర్ణం వివరాలను నిర్వాసితులు అధికారులకు అందించాలి. అదే విధంగా వాటిలోని ఇండ్లు, బాయి, బోరు, చెట్లు, ఇతర నిర్మాణాలకు సంబంధించిన వివరాలను కూడా సమర్పించాలి. వాటికి సంబంధించిన పత్రాలు, యజమాని ఆధార్, పాన్ కార్డు, బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్ కాపీలను జత చేయాలి. అయితే ఈ నెల 27 నుంచి 30 వరకు భువనగిరి ఆర్డీఓ కార్యాలయంలో సమావేశాలు ఉండనున్నాయి.
27న ఉదయం 11గంటలకు గౌస్‌నగర్, మధ్యాహ్నం 2గంటలకు కేసారం, 28న ఉదయం 11గంటలకు ఎర్రంబెల్లి, మధ్యాహ్నం తుక్కాపూర్, 30న ఉదయం పెంచికల్‌పహాడ్, మధ్యాహ్నం రాయగిరి నిర్వాసితులతో మీటింగ్ ఉండనుంది. కాగా, ఈసారి కూడా సమావేశాలకు నిర్వాసితులు హాజరయ్యే అవకాశాలు కనిపించడం లేదు.