సూర్యాపేట, మే 26 (నమస్తే తెలంగాణ) : పేదరికంలో ఉన్న వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడంతో ఉన్న 60,70 గజాల స్థలంలోని చిన్నపాటి రేకుల షెడ్డు, గుడిసెలను కూల్చి ఇంటి నిర్మాణం ప్రారంభించారు. అలాంటి వారి ఇండ్లను అకస్మాత్తుగా రద్దు చేయడంతో ఆయా కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. కారణం ఏమిటా అని ఆరా తీస్తే రద్దయిన కుటుంబాలకు గజం స్థలం లేదు.. నెలనెలా నిర్ధష్టమైన ఆదాయం లేదు.. కూలీనాలి చేసి సంపాదించిన డబ్బుకు తోడు 90 శాతం రుణాలు తీసుకొని ట్రాక్టర్లు, కారు లాంటి వాహనాలు కొనుగోలు చేసి జీవనం గడుపుతుండటమే. వాహనాలు ఉన్నాయని ప్రభుత్వం వారికి మంజూరైన ఇండ్లను రద్దు చేయడంతో జిల్లా వ్యాప్తంగా దాదాపు 25కు పైగా కుటుంబాలు వీధిపాలవుతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కోట్లాది రూపాయలు వెచ్చించి నిరుపేదలు గౌరవంగా జీవించేలా డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి జిల్లాలోని వేలాది మందికి పంపిణీ చేసింది.
2023 అసెంబ్లీ ఎన్నికల నాటికి ఇంకా కొద్ది పెండింగ్ పనులు పూర్తి చేసి పంపిణీకి సిద్ధం చేసిన వేలాది ఇండ్లను అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గాలికి వదిలేసింది. పట్టణాలు, పల్లెల్లో డబుల్ బెడ్రూం ఇండ్లు దర్శనమిస్తుండగా కనీసం పెండింగ్ పనులు పూర్తి చేసి లబ్ధిదారులకు పంపిణీ చేయకపోవడంతో పాటు చాలా చోట్ల బీఆర్ఎస్ హయాంలో లబ్ధిదారులను ఎంపిక చేసిన వందలాది ఇండ్ల పనులు ఎన్నికలు రావడంతో నిలిచిపోయాయి. రెండున్నరేండ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం లబ్ధిదారులకు వీటిని అప్పగించ లేదు. ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని నమ్మబలికి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఒక్కటీ ఇవ్వ లేదు. విడతలవారీగా ఇస్తామని నమ్మబలికి ఇప్పటి వరకు తొలి విడత హామీ ఇచ్చిన ఇండ్లనే ఇవ్వలేదు. ఇది నిర్లక్ష్యమో లేక అవగాహనా రాహిత్యమో కానీ నిబంధనలను రూపొందించడంలో సరైన పద్ధతి లేకపోవడంతో ఇందిరమ్మ ఇండ్ల పేరుతో మంజూరు చేసిన చాలా మంది నిరుపేదలు నిరాశ్రయులవుతున్నారు.
జిల్లాలో తొలి విడతలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన దాదాపు 25 కుటుంబాలు నేడు వీధిపాలయ్యాయి. దాదాపు పది నెలల క్రితం అర్హులుగా గుర్తించి వారికి జిల్లా కలెక్టర్ నుంచి ఇంటి మంజూరు పత్రం అందజేశారు. ఆయా కుటుంబాలన్నీ కూలీనాలి చేసుకుంటూ జీవనం సాగిస్తూ చిన్నచిన్న పూరి గుడిసెల్లో నివాసం ఉంటున్నారు. ఇల్లు వచ్చిందని ప్రభుత్వం ఇచ్చే రూ.5 లక్షలతో తమకు ఉన్న చిన్నపాటి స్థలంలో ఇల్లు నిర్మించుకోవచ్చని ఆశపడిన లబ్ధిదారుల ఆశలు అడియాసలయ్యాయి. 25 మంది లబ్ధిదారులు తమ పూరి గుడిసెలు, పెంకుటిండ్లను, రేకుల షెడ్లను కూల్చి కొత్త ఇంటి నిర్మాణం కోసం ఫౌండేషన్ వేశారు. ఇంతలోనే ‘మీకు మంజూరైన ఇండ్లు రద్దయ్యాయని’ పిడుగులాంటి వార్త వచ్చింది. ఎందుకని ప్రశ్నిస్తే.. మీకు ట్రాక్టర్లు, కార్ల లాంటి వాహనాలు ఉన్నాయని అధికారులు చెప్పారు. వాస్తవానికి తమకు ఊర్లో గజం భూమి కూడా లేదని, కొంత కాలంగా కష్టపడి పని చేసి సంపాదించిన కొద్దిపాటి సొమ్ము చెల్లించి రుణాలతో వాహనాలు కొనుగోలు చేసి అద్దెకు నడిపిస్తూ జీవనం సాగిస్తున్నామని అధికారుల వద్ద మొరపెట్టుకున్నారు. 10 శాతం డబ్బు చెల్లించి 90 శాతం రుణాలతో వాహనాలు తీసుకొని వాటితో జీవిస్తున్నామని చెప్పినా అధికారుల మనసు కరగడం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు. తమ ఆర్థిక పరిస్థితిపై విచారణ చేస్తే ఇందిరమ్మ ఇండ్లు తప్పకుండా ఇస్తారని, దయచేసి తమకు రద్దయిన ఇండ్లను మళ్లీ ఇవ్వాలంటూ ప్రతి సోమవారం కలెక్టర్కు వినతిపత్రం ఇస్తూనే ఉన్నారు.
మాకు ఎనిమిది నెలల క్రితం ఇందిరమ్మ ఇల్లు మంజూరైందని కలెక్టర్ నుంచి ఉత్తర్వులు అందాయి. వెంటనే చిన్నపాటి ఇంటిని కూల్చి పక్కనే తాత్కాలికంగా గుడారం వేసుకొని నిర్మాణం ప్రారంభించాం. కొద్ది రోజులకే మా ఇల్లు రద్దయిందని అధికారులు చెప్పడంతో అవాక్కయ్యాం. గుడారంలోనే ఉంటున్నాం. ఎందుకు రద్దు చేశారని ప్రశ్నిస్తే మీకు ట్రాక్టర్ ఉందన్నారు. మా ఆయన డ్రైవర్గా పని చేసేవాడు. కొంత అప్పు చేసి ట్రాక్టర్ కొనుగోలు చేసి అద్దెకు నడుపుతున్నాం. ఆ వచ్చే ఆదాయం వడ్డీలకే సరిపోతోంది. మాకు ఆస్తిపాస్తులేమీ లేవు. దయచేసి మా ఆర్థిక పరిస్థితి చూసి ఇల్లు మంజూరు చేయాలి.