చందంపేట (దేవరకొండ), జూన్ 24 : మేలు జాతి పశు సంపద వృద్ధే లక్ష్యంగా పశు సంవర్ధక శాఖ సిబ్బంది పని చేయాలని నల్లగొండ జిల్లా పశు సంవర్ధక శాఖ జిల్లా అధికారి రమేశ్ అన్నారు. మంగళవారం దేవరకొండ పట్టణంలోని పశు వైద్య కార్యాలయంలో పలు మండలాలకు సంబంధించిన పశు వైద్య కేంద్రం రికార్డులను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత ప్రజలకు జీవనాధారం ఉపాధి కల్పించడమే కాకుండా, ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి పాడి పరిశ్రమ దోహదం చేస్తుందన్నారు.
కృత్రిమ గర్భధారణ ద్వారా మేలు జాతి పశువుల వృద్ధికి రైతాంగానికి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. క్షీర విప్లవంలో రైతులను భాగస్వామ్యులను చేయాలని సూచించారు. గొర్రెలు, మేకల్లో నాచు రోగం నివారణకు పి.పి.ఆర్. టీకాల కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సూపరింటెండెంట్ ఎండి.రఫీ, రేణుక, పశు వైద్యాధికారులు జి.నాగయ్య, శ్రీజ, గుమ్మడవెల్లి శ్రీనివాస్, అనిత, కవిత పాల్గొన్నారు.