చండూరు,డిసెంబర్ 28: మావోయిస్టు పార్టీ కీలక నేత, కేంద్ర కమిటీ సభ్యుడు, ఒడిషా రాష్ట్ర కమిటీ కార్యదర్శి పాక హన్మంతు అంత్యక్రియలు ఆదివారం ఆయన స్వగ్రామమైన పుల్లెంలలో ముగిశాయి. ఈనెల 25న ఒడిశాలోని కందమాల్ జిల్లా గుమ్మా అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలకు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో పాక హన్మంతు అలియాస్ గణేశ్ (69) మృతి చెందిన విషయం విదితమే.
స్వస్థలంలో ముగిసిన అంత్యక్రియలు
హన్మంతు స్వస్థలమైన చండూరు మండలం పుల్లెంల గ్రామానికి ఆదివారం మధ్యాహ్నం భౌతిక కాయం చేరుకుంది. ఈ సందర్భంగా గాయకులు ఉద్యమ గీతాలు ఆలపిస్తుండగా,కళాకారుల డప్పు చప్పుళ్ల మధ్య ఆయన మృతదేహం స్వగ్రామానికి చేరుకుంది. హనుమంతు మృతదేహాన్ని చూసేందుకు చుట్టు పక్క గ్రామాల నుంచి జనం తండోపతండాలుగా తరలివచ్చారు. దశాబ్దాల పాటు స్వగ్రామం విడిచి దండకారణ్యంలో ఉండటంతో హన్మంతును చూసేందుకు వచ్చిన జనంతో పుల్లెంల జన సంద్రమైంది.
మృత దేహాన్ని ఆయన ఇంటి వద్ద రెండు గంటల పాటు ఉంచిన అనంతరం పోలీసు పహారా మధ్య గ్రామంలోని వీధుల గుండా అంతిమ యాత్ర కొనసాగింది. ఆయన అంతిమ యాత్రలో భారీ సంఖ్యలో కార్మిక, కర్షక, ప్రజా సంఘాల నాయకులు, పలు రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. అంతిమ యాత్రలో బూటకపు ఎన్కౌంటర్లను నిరసిస్తూ గాయకులు పాటలు పాడారు. అంతిమ యాత్ర మూడు గంటల పాటు సాగిన అనంతరం మహాప్రస్థానంలో దహన సంస్కారాలు నిర్వహించారు.
జనం గుండెల్లో నిలిచిన హన్మంతు
పాక హన్మంతు మృత దేహానికి పూలవేసి నివాళులర్పించిన మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ పాక హన్మంతు నల్లగొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుకునే రోజుల్లో తనకు జూనియర్ అని, తాను పీడీఎస్‌యూలో, హన్మంతు ఆర్ఎస్యూ విద్యార్థి సంఘంలో పనిచేశామని గుర్తుచేసుకున్నారు. పీడిత ప్రజల కోసం ఆయన తన తుదిశ్వాస వరకు పోరాడారని కొనియడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో చేస్తున్న చర్యలను కూసుకుంట్ల ఖండించారు. పేదల సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్న మావోయిస్టులను జన జీవన స్రవంతిలో కలిసేలా చూడాలే తప్ప ఇలా ఎన్కౌంటర్ల పేరుతో చంపడం సబబు కాదని అన్నారు.
కార్యక్రమంలో కల్లుగీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్‌గౌడ్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, తెలంగాణ ఉద్యమకారులు చెరుకు సుధాకర్‌గౌడ్, మాజీ ఎమెల్మల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కంచర్ల కృష్ణారెడ్డి, పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం లక్ష్మీనర్సింగరావు, ప్రధాన కార్యదర్శి నారాయణ రావు, తెలంగాణ జన సమితి ప్రధాన కార్యదర్శి పల్లె వినయ్‌కుమార్ గౌడ్, డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత, తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు అంబటి నాగయ్య, అమరుల సంఘం నాయకులు సంధ్య, సుశీల,వనజ, శాంతక్క, మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు నల్ల రవి, మాజీ మావోయిస్టులు బాబన్న,
భవనం శ్రీనివాస్‌రెడ్డి, దాడి శ్రీనివాస్‌రెడ్డి, కావలి యాదగిరి, పిట్టల శంకర్, కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు గుర్రం వెంకట్‌రెడ్డి, సీపీఎం నాయకులు ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, నారి ఐలయ్య, మునగాల నారాయణరావు, పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు బలుగురు కిరణ్‌కుమార్,ఉస్మానియా విశ్వ విద్యాలయం విద్యార్థి సంఘం నాయకుడు రెహ్మాన్, సీపీఐ, ఎంఎల్ నాయకురాలు అనురాధ, సీపీఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి స్టాలిన్, మేడ్చల్ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్, పూర్వ విద్యావంతుల వేదిక అధ్యక్షుడు భరద్వాజ, గాయకులు వేముల పుష్ప, సుక్క రామనర్సయ్య, బంధుమిత్రుల సంఘం అధ్యక్షురాలు అంజమ్మ, లంక పాపిరెడ్డి, రాజారాం యాదవ్, మండలంలోని వివిధ పార్టీల నాయకులు బొమ్మరబోయిన వెంకన్న, నలపరాజు సతీష్, నలపరాజు రామలింగయ్య, జెర్రిపోతుల ధనంజయ పాల్గొన్నారు.