
మిర్యాలగూడ టౌన్, జనవరి 1 : కరోనాను కట్టడి చేసేందుకు టీకా ఒక్కటే పరిష్కారం. దాంతో అందరికీ వ్యాక్సిన్ అందించే కార్యక్రమాన్ని వైద్యారోగ్యశాఖ ముమ్మరం చేసింది. మిర్యాలగూడ క్లస్టర్ పరిధిలో ఆరోగ్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి టీకాలు వేస్తున్నారు. ఇప్పటి వరకు మొదటి డోస్ వ్యాక్సినేషన్ కార్యక్రమం 100శాతం పూర్తికాగా.. రెండో డోస్ 50శాతం పూర్తయ్యింది.
టీకా తీసుకోని వారికోసం సర్వే
కరోనాను కట్టడి చేసేందుకు టీకాలు వేస్తున్న వైద్య సిబ్బంది.. ఇప్పటి వరకు ఒక్క డోస్ కూడా వేసుకోని వారి వివరాలు సేకరిస్తున్నారు. వ్యాక్సిన్‌పై వారికున్న అపోహలు తొలగించడంతో పాటు కరోనాను కట్టడి చేయాల్సిన విషయమై అవగాహన కల్పించి టీకా వేస్తున్నారు. ఆరోగ్యశాఖ అందించిన జాబితా ప్రకారం ఇంటింటికీ వెళ్లి టీకా వేస్తున్నారు. అర్హులైన వారు ఎక్కడుంటే అక్కడికి వెళ్లి మరీ వ్యాక్సిన్ ఇస్తున్నారు. వివరాలను వెంటనే సంబంధిత యాప్‌లో అప్లోడ్ చేస్తున్నారు.
మొదటి డోస్ పూర్తి
ఈ ఏడాది డిసెంబర్ 31 నాటికి మొదటి దశ కరోనా వ్యాక్సినేషన్ 100 శాతం పూర్తి చేయాలని ప్రభుత్వ ఆదేశాల మేరకు వైద్యశాఖ అధికారులు, సిబ్బంది నిరంతనం పని చేశారు. శనివారం నాటికి మొదటి డోస్ వందశాతం పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. మిర్యాలగూడ డివిజన్లో జనాభా 5.44 లక్షలు ఉండగా.. వ్యాక్సినేషన్‌కు అర్హత గలవారు 410,020మంది ఉన్నారు. మొదటి డోస్ వ్యాక్సిన్ పూర్తిచేసినట్లు వైద్యాధికారులు తెలిపారు. రెండో డోస్‌ను 1,98000 మందికి ఇవ్వగా.. ఇంకా 212,020 మందికి వేయాల్సి ఉందని పేర్కొన్నారు. మరో నెల రోజుల్లో అందరికీ అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
అవగాహన కల్పిస్తున్నాం
కొవిడ్ వైరస్ వ్యాప్తి పై ప్రజలకు అవగాహన కల్పించి టీకాలు వేసుకునేలా ప్రోత్సహిస్తున్నాం. వైద్య సిబ్బంది వార్డుల్లో ఇంటింటికీ వెళ్లి టీకాలు తీసుకోని వారి వివరాలు సేకరిస్తున్నారు. ఉదయం 7 నుంచి 9 గంటల వరకూ సర్వే చేసి తర్వాత టీకాలు వేస్తున్నారు. ఎవరైనా కొవిడ్ బారిన పడితే వారికి మందులు అందించడంతో పాటు తీసుకో వాల్సిన జాగ్రత్తలు చెబుతున్నాం.
-ప్రత్యూష, మెడికల్ ఆఫీసర్, బంగారుగడ్డ పీహెచ్సీ, మిర్యాలగూడ
నిరంతరం పర్యవేక్షిస్తున్నాం
కరోనా వ్యాక్సినేషన్లో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు వైద్యశాఖ అధికారులు, సిబ్బంది కృషి చేస్తున్నారు. ప్రతి ఇంటికీ వెళ్లి టీకాలు వేసుకోని వారి వివరాలు సేకరిస్తున్నారు. వారికి అవగాహన కల్పించి మరీ టీకా వేస్తున్నారు. పట్టణంతో పాటు రూరల్ ప్రాంతాల్లో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేస్తున్నాం. నేను కూడా ప్రతిరోజూ పర్యవేక్షణ చేస్తున్నాను.
-కేస రవికుమార్, డిప్యూటీ డీఎంహెచ్ఓ