పంట చేతికి వచ్చిన సమయాన అన్నదాతపై ప్రకృతి కన్నెర్ర చేసినా ప్రభుత్వం బాధ్యతగా అండగా నిలుస్తున్నది. కొద్దిరోజులుగా చెడగొట్టు వానలు చేనుపై ఉన్న పంటలకు నష్టం కలిగించడంతో పాటు అమ్మకానికి సిద్ధంగా ఉన్న ధాన్యాన్ని తడుపుతున్నాయి. ఈ నేపథ్యంలో పంట నష్టం వాటిల్లిన రైతులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎకరానికి 10 వేల రూపాయల పరిహారం ప్రకటించి ఊరటనిచ్చారు. మరోవైపు కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం విషయంలోనూ అభయహస్తం అందించారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందని ప్రకటించడంతో బాధిత రైతుల్లో సంతోషం వ్యక్తమవుతున్నది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 15వేల బస్తాల వరకు ధాన్యం తడిసినట్లు అంచనా. ఇక ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే 4.50లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు జరగ్గా, రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలువడం విశేషం.
– నల్లగొండ ప్రతినిధి, మే 3(నమస్తే తెలంగాణ)
నల్లగొండ ప్రతినిధి, మే 3(నమస్తే తెలంగాణ) : వ్యవసాయానికి పెద్దపీట వేస్తూ రైతులకు అన్ని వేళల్లో అండగా నిలుస్తున్న కేసీఆర్ సర్కార్ మరోసారి ఆపన్న హాస్తాన్ని అందించింది. యాసంగి సీజన్లో చెడగొట్టు వానల ప్రభావం ప్రతీ ఏటా సర్వసాధారణమే అయినా ఈసారి తీవ్రత ఎక్కువగా ఉంది. దీంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. వరి చేలపై ఉన్న పంట నష్టంతో పాటు పండ్ల తోటలకు కూడా తీవ్ర నష్టం వాటిల్లుతుంది. అయితే దీనిపై నష్టం అంచనాలు రూపొందిస్తూ ఆదుకునేందుకు ప్రభుత్వం కార్యచరణ సిద్ధం చేస్తోంది. ఇక ఇదే సమయంలో ధాన్యం సేకరణ జరుగుతుండడంతో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం కూడా కొంత మేరకు వర్ష ప్రభావానికి గురవుతోంది. ధాన్యం తడవడంతో కొనుగోళ్లకు ఇబ్బంది అవుతోంది. దీంతో రైతుల్లో ఆందోళన నెలకొనగా పరిస్థితిని అర్థం చేసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ రంగంలోకి దిగారు. తడిసిన ధాన్యాన్ని సైతం పూర్తిగా కొనుగోలు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. దీని వల్ల ఇప్పటివరకు ఉమ్మడి జిల్లాలో వర్షాలతో తడిసిన 15 వేల బస్తాల ధాన్యానికి ప్రయోజనం జరుగనుంది. అయితే తడిసిన ధాన్యం విషయంలోనూ అధికార యంత్రాంగాలు సానుకూలంగానే స్పందిస్తూ కొనుగోళ్లు కొనసాగిస్తున్నాయి.
ముఖ్యంగా నల్లగొండ జిల్లాలో 9 వేల బస్తాల ధాన్యం తడిసిందని అంచనా వేసిన అధికారులు ముందే అప్రమత్తమయ్యారు. సాధారణంగా తడిసిన ధాన్యాన్ని మిల్లింగ్ చేస్తే నూకలు వచ్చి నిర్ణీత పరిమాణంలో నాణ్యమైన రా రైస్ సాధ్యం కాదు. దీంతో బాయిల్డ్ రైస్ అయితే రైస్ మిల్లర్లకు కూడా ఇబ్బంది ఉండదు. తడిసిన ధాన్యం దిగుమతి విషయంలో రైస్ మిల్లర్లు అభ్యంతరాల నేపథ్యంలో జిల్లా అధికారులు రాష్ట్ర పౌర సరఫరాల శాఖను సంప్రదించారు. నల్లగొండ జిల్లాకు ప్రత్యేకంగా 25 వేల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ సీఎంఆర్కు అనుమతిని పొందారు. దీంతో తడిసిన ధాన్యం కొనుగోళ్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా సాగిపోతుంది. ఇక సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లోనూ అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో కొనుగోళ్లల్లో నిమగ్నమైంది. అకాల వర్షాలతో ధాన్యం తడిసినా సరే తేమ శాతం విషయంలోనూ పలు మినహాయింపులతో కొనుగోళ్లు జరుపుతూ రైతులకు అండగా నిలుస్తున్నారు. ప్రకృ తి ప్రకోపించిన సమయంలో ప్రభుత్వ పరంగా రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తుండడం విశేషం.
ఉమ్మడి జిల్లాలో 4.50 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోళ్లు
ఉమ్మడి జిల్లాలో బుధవారం నాటికి సుమారు 4.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేశారు. 55 వేల మంది రైతుల నుంచి రూ.850 కోట్ల విలువైన ధాన్యాన్ని ఇప్పటివరకు సేకరించినట్లు అధికారులు వెల్లడించారు. ఇక రాష్ట్రంలోనే ముందుగా కొనుగోళ్లు ప్రారంభించిన నల్లగొండ జిల్లా అదే ఒరవడిని కొనసాగిస్తూ అగ్రస్థానంలో నిలుస్తోంది. నల్లగొండ జిల్లాలో ఏడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేసిన అధికారులు ఇప్పటివరకు 2.81 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోళ్లు చేశారు. 346 కొనుగోలు కేంద్రాల ద్వారా 35 వేల మంది రైతుల నుంచి ఇప్పటివరకు ధాన్యాన్ని కొనుగోలు చేశారు. రూ.565 కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేసి రూ.400 కోట్ల చెల్లింపులు కూడా పూర్తి చేయడం విశేషం. ఇక సూర్యాపేట జిల్లాలో మంగళవారం నాటికి 294 కేంద్రాల ద్వారా 15,007 మంది రైతుల నుంచి 224.72 కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేశారు. 1.09 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోళ్లు పూర్తయ్యాయి.
ఇక యాదాద్రి జిల్లాలో ఆలస్యంగా ధాన్యం దిగుబడులు మొదలవగా మంగళవారం నాటికి 319 కేంద్రాల ద్వారా కొనుగోళ్లు జరుగుతున్నాయి. మొత్తం 2,767 మంది రైతుల నుంచి రూ.50 కోట్ల విలువైన 25 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. వర్షాల నేపథ్యంలో కొనుగోళ్లు మరింత వేగవంతంగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ నెల మూడో వారానికి దాదాపు కొనుగోళ్లు పూర్తయ్యేలా కార్యచరణతో ముందుకు సాగుతున్నారు. జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, పౌరసరఫరాల శాఖ అధికారులు నిత్యం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పర్యవేక్షిస్తున్నారు.
తడిసిన ధాన్యాన్ని కొంటున్నాం
ధాన్యం కొనుగోళ్లల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. అకాల వర్షాలతో ధాన్యం తడిసినా కొనుగోళ్లు ఆపడం లేదు. సీఎం కేసీఆర్ ఆదేశాల ప్రకారం తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోళ్లు చేస్తున్నాం. రైతులు ఇబ్బందులు పడొద్దనేది ప్రభుత్వ ఉద్దేశ్యం. తడిసిన ధాన్యం విషయంలో ప్రత్యేకంగా 25 వేల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ కోటా జిల్లాకు మంజూరైంది. దీంతో తడిసిన ధాన్యం విషయంలో మిల్లర్లకు ఇబ్బంది లేదు. ఇప్పటికే రాష్ట్రంలోనే నల్లగొండ కొనుగోళ్లలో టాప్లో ఉంది. చివరి గింజ కొనుగోలు చేసే వరకు ఇలానే ముందుకు సాగుతాం.
– భాస్కర్రావు, అదనపు కలెక్టర్, నల్లగొండ