యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): యాదాద్రి భువనగిరి జిల్లాలో సోమవారం మద్యం దుకాణాల డ్రా ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. దుకాణాల లైసెన్సు ల జారీ కోసం భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని రాయగిరిలోని ఓ ఫంక్షన్ హాలులో కలెక్టర్ హనుమంత రావు సమక్షంలో లాటరీ తీశారు. ఒకో దరఖాస్తుకు సంబంధించిన వారిని లోనికి ఆహ్వానిస్తూ, వారి సమక్షంలో కలెక్టర్ డ్రా తీసి మద్యం దుకాణాల కేటాయింపును ఖరారు చేశారు.
డ్రా కోసం వినియోగించిన టోకెన్లు అందరికీ చూపుతూ, పారదర్శకంగా డ్రా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో దరఖాస్తుదారులు హాజరుకావడంతో ఎంట్రీ పాస్ ఉన్న వారినే లోనికి అనుమతించారు. కాగా జిల్లాలో 82 వైన్స్ ఉండగా, 2776 దరఖాస్తులతో రూ.83.28 కోట్ల ఆదాయం సమకూరిన విష యం తెలిసిందే. ఓ లికర్ గ్రూప్ ఏకంగా 263 దరఖాస్తులు దాఖలు చేయగా..కేవలం మూడు దుకాణాలు మాత్రమే దకినట్లు సమాచారం. ఆలేరులో ని ఓ గ్రూపు సభ్యులు 62 దరఖాస్తులతో అదృష్టం పరీక్షించుకోగా కేవలం రెండు దుకాణాలు మాత్రమే దక్కినట్టు సమాచారం. తిరుమలగిరి గ్రూపు నుంచి 54 అప్లికేషన్లు వేయగా నాలుగు దుకాణాలు మాత్ర మే దక్కాయి. భువనగిరి గ్రూపు నుంచి 51 దరఖాస్తులు వేయగా ఒకటి మాత్రమే దకింది. అనేక చోట్ల కొత్త వారినే వైన్స్ వరించినట్టు తెలిసింది.