కేతేపల్లి, జనవరి 25 : సీఎం కేసీఆర్ పాలనలోనే అన్ని వర్గాలు అభివృద్ధి చెందుతున్నారని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. మండలంలోని భీమారం గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, నూతనంగా నిర్మించిన ఎస్సీ కమ్యూనిటీ హాల్‌ను బుధవారం రాత్రి ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. సమైక్య పాలనలో ఏ గ్రామంలో కూడా సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ఇతర మౌలిక వసతులు ఉండేవి కావన్నారు.
స్వరాష్ట్రంలో అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, మిషన్ భగీరథ తాగునీరు, వైకుంఠధామాలు, డంపింగ్ యార్డుల నిర్మాణంతో గ్రామాల రూపురేఖలు మారిపోయాయన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు. నిరుపేదల బాధలు చూసి రూ.200, రూ.500 ఉన్న పింఛన్‌ను రూ.2,016, రూ.3,016కు పెంచిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో రూ.600 మించి పింఛన్ లేదని విమర్శించారు. రైతులకు ఉచిత విద్యుత్, సాగునీరు, రైతుబంధు, రైతుబీమా పథకాలతో దేశంలోనే సీఎం కేసీఆర్ ఆదర్శంగా నిలిచారన్నారు.
మైనార్టీల సంక్షేమానికి కృషి : ఎమ్మెల్యే
ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ.. అన్ని మతాలకు ప్రాధాన్యమిస్తూ అభివృద్ధి ఫలాలు అందించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. తెలంగాణలో క్రైస్తవులను అన్ని విధాలుగా ఆదుకున్నట్లు తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టారని చెప్పారు. కులాలు, మతాలతో రాజకీయం చేస్తున్న పార్టీలను తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. గ్రామ సర్పంచ్ బడుగుల శ్రీనివాస్‌యాదవ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో తాసీల్దార్ వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ రమేశ్దీన్దయాళ్, మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల ప్రదీప్‌రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మారం వెంకట్‌రెడ్డి, చిముట వెంకన్నయాదవ్, గ్రామ ఉప సర్పంచ్ జి.స్వప్న, నాయకులు కె.ముత్తయ్య, జి.నాగరాజుగౌడ్, జి.వెంకటయ్య, కె.కృష్ణయాదవ్, సయ్యద్ ఫరీద్, పి.విష్ణు పాల్గొన్నారు.