రామగిరి, డిసెంబర్ 26 : దేశంలో సామ్రాజ్యవాదం, భూస్వామ్య పెట్టుబడిదారులకు వ్యతిరేకoగా, దేశానికి సంపూర్ణ స్వాతంత్రం కోసం భారత కమ్యూనిస్టు పార్టీ చేసిన పోరాటాలు చరిత్రాత్మకమైనవని సిపిఐ నల్లగొండ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. సిపిఐ 101వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయం మగ్దూమ్ భవన్లో ఎర్రజెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిపిఐ వందేండ్ల ముగింపు బహిరంగ సభ ఖమ్మం జిల్లాలో జనవరి 18వ తేదీన లక్షలాది మందితో జరుగుతుందని, ఈ సభకు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. దేశంలో ఎలాంటి పోరాట చరిత్ర లేని బిజెపి నేడు కేంద్రంలో అధికారంలో ఉండి ప్రజాస్వామ్యాన్ని కుని చేస్తూ పౌర హక్కులను కాలరాస్తూ దేశంలో అశాంతిని ప్రేరేపిస్తుందని దుయ్యబట్టారు. మావోయిస్టులు శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నప్పటికీ అడవుల్లో క్రూర మృగాలకంటే హీనంగా ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులను చంపడం దారుణం అన్నారు.
దేశంలో పెరిగిపోతున్న నిరుద్యోగ, ఆర్థిక అసమానత్వాలను నిర్మూలన చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం మతం పేరుతో విద్వేషాలను సృష్టిస్తుందని విమర్శించారు. గ్రామీణ ప్రాంతంలో కరువు విలయ తాండవం చేస్తుంటే వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పించాలని లక్ష్యంతో ఆనాడు యూపీఏ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొస్తే దాన్ని నిర్వీర్యం చేయడం కోసం మహాత్మగాంధీ పేరు మార్చడం జరిగిందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి లోడంగి శ్రవణ్ కుమార్, జిల్లా కార్యవర్గ సభ్యులు పబ్బు వీరాస్వామి, బొల్గురి నర్సింహా, పట్టణ కార్యదర్శి కర్ర సైదిరెడ్డి, శాంతి సంఘo జిల్లా కార్యదర్శి జిల్లా యాదయ్య, పట్టణ సహాయ కార్యదర్శి వి.లెనిన్, నాయకులు ముండ్ల ముత్యాలు, మదర్, యూసుఫ్, ఐతరాజు శంకర్, దోటి పండరి, అక్కలయ్య, విజయ, పార్వతి, గౌస్ పాల్గొన్నారు.