సూర్యాపేట, మే 13 (నమస్తే తెలంగాణ) : పాఠశాలల్లో వేసవి క్రీడా శిక్షణా శిబిరాలను అట్టహాసంగా ప్రారంభించిన అధికారులు క్రీడలకు సంబంధించిన మెటీరియల్ సరఫరాలో విఫలమయ్యారు. ఏప్రిల్ 28న జిల్లావ్యాప్తంగా సుమారు 35 పాఠశాలల్లో వేసవి శిక్షణా శిబిరాలు ప్రారంభించారు. ఆయా పాఠశాలల్లో విద్యార్థులకు కబడ్డీ, వాలీబాల్, బాస్కెట్ బాల్, త్రోబాల్ తదితర క్రీడల్లో శిక్షణ ఇస్తారు. పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో క్రీడలు ప్రారంభించిన రోజునే క్రీడా సామగ్రిని అందించేవారు.
కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెం డేండ్లుగా ప్రారంభించిన నెల రోజులైనా మెటీరియల్ సరఫరా చేయడం లేదు. పైగా నాడు ప్రతి క్యాంపునకు కావాల్సిన మెటీరియల్‌ను ఎక్కడికక్కడ నేరుగా నగదు ఇచ్చి కొనుగోలు చేయగా రెండేండ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం పర్సంటేజీల కోసం మొత్తం మెటీరియల్ ఒకేచోట నుంచి హోల్‌సేల్‌గా కొనుగోలు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
పర్సంటేజీల కారణంగా గతేడాది నాణ్యతలేని క్రీడా సామగ్రి వచ్చిందని, దీంతో చాలా మంది క్యాంపు ఇన్చార్జిలు స్టోర్స్వద్దనే వాటిని పడేసి వెళ్లినట్లు సమాచారం. పాఠశాలలకు వేసవి సెలవులు వచ్చిన తరువాత విద్యార్థులు టీవీలు, సెల్ఫోన్లతో పాటు ఇతర అలవాట్లకు లోను కాకుండా ఉండటంతోపాటు వారిలోని ప్రతిభను వెలికి తీసేందుకు ప్రభు త్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోంది. అందులో భాగంగా సెలవుల్లో యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో సూర్యాపేట జిల్లాలో ఈ సంవత్సరం దాదాపు 35 పాఠశాలల్లో క్రీడా శిబిరాలు ప్రారంభించినా నేటి వరకూ ఎటువంటి క్రీడలు జరగలేదు.
ఈ విషయమై ఆరా తీస్తే ఇప్పటి వరకు క్రీడా సామగ్రిని అందించకపోవడమేనని తెలిసింది. గతేడాది ప్రభుత్వం సరఫరా చేసిన క్రీడా సామగ్రి నాణ్యంగా లేకపోవడంతో కొద్ది మంది ఇన్చార్జిలు గోదాం వద్దే వాటిని వదిలేసి వెళ్లగా, వాటిని తీసుకెళ్లిన వారికి క్యాంపు పూర్తయ్యే నాటికే అవి పనికిరాకుండా పోయాయని ఓ క్యాంపు ఇన్చార్జి పేర్కొన్నారు. క్యాంపును ప్రారంభించిన నాటి నుంచి విద్యార్థులు, క్యాంపు ఇన్చా ర్జిలు వచ్చి వెళ్తున్నారు. కొంతమంది ఇన్చార్జిలు మాత్రం ఎవరినో ఒకరిని ఆశ్రయించి, నిధులు సమకూర్చి క్యాంపుల వద్ద తాగునీరు, బ్యానర్లు ఏర్పాటు చేయడంతోపాటు ఒకటో రెండో ఆటలను ఆడిస్తున్నారు.
మిగతా చోట్ల ఇన్చా ర్జిలు, విద్యార్థులు వచ్చి వెళ్తున్నారు. ఈ ఏడాదికి సం బంధించి ఇప్పటి వరకు మెటీరియల్ రాలేదు. ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పం దించి క్రీడా సామగ్రిని అందించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై డిస్ట్రిక్ట్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్ వెంకట్‌రెడ్డిని వివరణ కోరగా వేసవి క్రీడా శిబిరాల కోసం కావాల్సిన మెటీరియల్ కోసం ఇండెంట్ పెట్టామని త్వరలో వస్తాయని చెప్పారు. కానీ అవి వచ్చే వరకు పాఠ శాలలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.