సూర్యాపేట, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ) : ‘ఏడాది కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం అన్నింటా విఫలమైంది. రాష్ట్రంలో ఏడు వేల కోట్ల రూపాయల ఆదాయం తగ్గిందని ప్రతిపక్షమో, ఆర్థిక నిపుణులో, మేధావులో కాకుండా స్వయాన కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలే అంగీకరించారు’ అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ సర్కారు ఏడాది పాలనపై నమస్తే తెలంగాణతో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రుల జేబులు నిండుతుండగా ప్రజల జేబులకు చిల్లు పడుతున్నదన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నా ఏడాది కాలంలో ఒక్కటంటే ఒక్కటైనా చేశామని చెప్పుకోగలరా అని ప్రశ్నించారు. పదేండ్ల బీఆర్ఎస్ హయాంలో చేసిన పనులు కండ్ల ముందే నాశనం అవుతుండడం చూసి కాంగ్రెస్ పార్టీ దరిద్రాన్ని ఎందుకు తెచ్చుకున్నామా ప్రజలు మదన పడుతున్నారని తెలిపారు.
‘రాష్ట్రంలో అన్ని పరిస్థితులు సాధారణంగా ఉన్నాయి. వర్షాలు సమృద్ధిగా పడ్డాయి. ప్రాజెక్టు కూలిందని ప్రచారం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వమే కాళేశ్వరం మోటార్లను ఆన్ చేసి నీటిని తరలించింది. రైతులు పంటలు బాగా పండించారు. అయినా రాష్ట్ర ఆదాయం తగ్గడానికి కారణం ఏంటటి? కేవలం ప్రభుత్వం నడపడంలో లోపమే’నని అని జగదీశ్‌రెడ్డి అన్నారు. ఆరు నెలల క్రితం బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటికీ ఇప్పటికే దాదాపు ఏడువేల కోట్ల రూపాయల ఆదాయం తగ్గిందని కాంగ్రెస్ ప్రతినిధులు చెప్పడంతో పాలన చేతగాక రాష్ట్రం తిరోగమనంలోకి వెళుతుందని అర్థమవుతున్నదన్నారు. ప్రజల ఎజెండాను పక్కన పెట్టి సంపాదనే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుండడంతో ఈ దుస్థతి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు.
‘ఉమ్మడి నల్లగొండ జిల్లాకు ఇద్దరు మంత్రులు ఉన్నా ఏడాది కాలంలో ఒక్కటంటే ఒక్కటైనా, ఏదైనా తెచ్చారా? ఇది తెచ్చామని చెప్పుకొనే దుమ్ము ఒక్కరికైనా ఉందా?’ అని జగదీశ్‌రెడ్డి ప్రశ్నించారు. 2014కు ముందు ఉమ్మడి జిల్లాలోని సూర్యాపేటలో మూసీ మురికి నీరు తాగగా, నల్లగొండ ప్రాంతంలో ఫ్లోరిన్ నీటిని తాపించారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ హయాంలో ఇంటింటికీ స్వచ్ఛమైన భగీరథ నీటిని అందించామని, సాగునీటిని సాధించి పెట్టామా, లేదా అని రైతులను అడిగితే చెబుతారని పేర్కొన్నారు.
సూర్యాపేటకు బీఆర్ఎస్ హయాంలో వచ్చిన వాటిని సైతం రద్దు చేయడం సిగ్గు చేటని మాజీ మంత్ర జగదీశ్‌రెడ్డి మండిపడ్డారు. పాలిటెక్నిక్ కళాశాలకు రూ.10 కోట్లు, స్పోర్ట్ కళాశాలకు రూ.25 కోట్లు, రహదారులకు రూ.50 కోట్లు, జనగాం రోడ్డు నుంచి ఖమ్మం రోడ్డుకు రూ.100 కోట్లు మంజూరు చేయిస్తే వాటిని నిలిపి వేశారన్నారు. సగం జరిగిన పనులను కూడా ఆపేశారని, వేలాది ఉద్యోగాలు ఇచ్చేందుకు ఐటీ పార్కు తెస్తే, నేడు కాంగ్రెస్ ప్రభుత్వం నిరాదారణకు గురి చేసి వెళ్లగొట్టిందన్నారు. బీఆర్ఎస్ హయాంలోనే ఉమ్మడి జిల్లాలో రెండు మెడికల్ కళాశాలలను 100 శాతం పూర్తి చేశామని తెలిపారు. గ్రామాల్లో రహదారులు, అంతర్గత రోడ్లు, మురుగు కాల్వలు, శ్మశాన వాటికలు, డంపింగ్ యార్డులు, చెత్త ఎత్తేందుకు ట్రాక్టర్లు ఇలా అన్ని మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కాలంలో ఒక్కటంటే ఒక్కటీ చేయకపోగా, తమ హయాంలో చేసిన వాటిని నాశనం చేస్తున్నదని దుయ్యబట్టారు.
బీఆర్ఎస్ హయాంలో కనీవినీ ఎరుగని రీతిన 4వేల మెగావాట్లతో యాదాద్రి పవర్‌ప్లాంట్‌ను పూర్తి చేస్తే, దానిని రద్దు చేస్తామని జిల్లాకు చెందిన ఓ మూర్కుడు అన్నాడంటూ జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. నిజంగా దానిని నాశనం చేస్తాడో ఏమో అనుకున్నామన్నారు. అక్కడ ఏదో చేసినట్లు షో చేసి నాలుగైదు సార్లు హెలీకాఫ్టర్లో చెక్కర్లు కొట్టి ఏదో సాధించినట్లు బిల్డప్ చేసి ఇప్పుడు ప్రారంభిస్తున్నారని పేర్కొన్నారు. ఆరు గ్యారంటీల అడ్రస్ లేదు.. 420 హామీలు ఏమైనాయో తెలియదని విమర్శించారు. ప్రజలు ప్రశ్నిస్తారనే భయంతో హైడ్రాతో పేదల ఇండ్లు కూలుస్తూ బ్లాక్మెయిల్ చేసున్నారన్నారు.
మరోపక్క కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకే నియామక పత్రాలు అందించి కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చినట్లు ప్రచారం చేసుకుంటుండడం సిగ్గు చేటని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌కు అధికారం వచ్చిన తరువాత ఇచ్చిన నోటిపికేషన్లు ఎన్నో, ఉద్యోగాలెన్నో నిరుద్యోగులకు తెలుసన్నారు. యావత్ దేశ చరిత్రలోనే సీఎంల్లో కేసీఆర్ హీరో అయితే, రేవంత్ జీరో అని.. ఏ అవకాశం వచ్చినా కాంగ్రెస్‌కు కర్రుకాల్చి వాత పెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు.