‘ది నంబర్ ఈజ్ ఔట్ ఆఫ్ నెట్వర్క్.. ది నంబర్ ఈజ్ స్విచ్డ్ ఆఫ్.. ది పర్సన్ యూ ఆర్ కాలింగ్ ఈజ్ నాట్ ఆన్సరింగ్’ ఇదీ జిల్లాలో పలు శాఖలకు చెందిన అధికారులకు కాల్ చేస్తే వచ్చే సమాధానం. అట్లని కార్యాలయాల్లోకి వెళ్తే సార్ ఫీల్డ్ మీదికి వెళ్లాడు.. మేడం టూర్లో ఉన్నారు.. అనే జవాబులు ఆయా కార్యాలయాల్లో పనిచేసే సిబ్బంది చెప్పే మాటలు. సాధారణ జనమే కాదు.. ఏకంగా కలెక్టర్ లైన్లోకి వెళ్లినా కొంత మంది నుంచి ఇదే సమాధానం వస్తుందట. దాంతో పలువురిపై ఆగ్రహం, అసహనం వ్యక్తం చేసిన కలెక్టర్.. ఇటీవల ఒక జిల్లా ఆఫీసర్‌ను సరెండర్ చేయడంతోపాటు ఇద్దరికి నోటీసులు ఇవ్వడం గమనార్హం. జిల్లా అధికారులే చేయంది మాకేందిలే అనుకున్నారేమో కింది స్థాయిలో పనిచేస్తున్న వారు కూడా అలాగే వ్యవహరిస్తుండటంతో ఇద్దరిపై సస్పెన్షన్ వేటు వేశారు. పలువురికి నోటీసులు ఇచ్చి అనేక మందిపై అసహనం వ్యక్తం చేసినట్లు కలెక్టరేట్లో చర్చలు వినిపిస్తున్నాయి.
ప్రభుత్వానికి, ప్రజలకు వారుధులుగా ఉండాల్సిన ప్రభుత్వ ఉద్యోగులు తమ విధుల పట్ల అనాసక్తి కనబరుస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఆయా శాఖలకు బాధ్యులుగా ఉండాల్సిన హెచ్ఓడీ (హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్)లు విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యహరిస్తుండటంతో పెండింగ్ పనులు పేరుకుపోతున్నాయి. సర్కార్ పథకాలను కింది స్థాయిలో అమలు చేయాల్సిన వారు వాటిని కూడా పట్టించుకోకుండా ఆయా శాఖల్లో ఏదైనా సమస్య ఉండి వచ్చేవారికి అందుబాటలో ఉండటం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఫోన్ చేస్తే తీయరని.. ఆఫీసుకు వెళ్తే ఉండరనే విమర్శలు బాగా ఉన్నాయి. ప్రధానంగా కలెక్టరేట్లోని ప్రధాన శాఖలతోపాటు పాడి, పండ్ల అనుబంధ శాఖల అధికారులు తమ విధులను మొక్కుబడిగా నిర్వహిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. గ్రీవెన్స్‌కు కూడా హాజరు కాకపోవడం, టూర్, క్ష్రేతస్థాయి పర్యటనల పేరుతో సాకులు చెప్పి ఏకంగా కలెక్టర్‌నే లెక్కచేయట్లేదనే చర్చలు కలెక్టరేట్లో సాగుతున్నాయి. కొందరు కింది స్థాయి ఉద్యోగులను టార్చర్ పెట్టి వారు మాత్రం నిర్లక్ష్యంగా ఉండటంపై విమర్శలు వచ్చాయి. ఇలాంటి ఆరోపణల నేపథ్యంలో కలెక్టర్ ఒక జిల్లా అధికారిని ఇటీవల సరెండర్ చేసిన విషయం తెలిసిందే. ప్రధానంగా సంక్షేమ అధికారుల్లో ఒకరిద్దరు నిత్యం టూర్లు, క్షేత్ర స్థాయి పర్యటనల పేరుతో కాలం గడుపుతున్నారే తప్ప విధులపై ఆసక్తి మాత్రం కనబరుస్తలేరనే విమర్శలు ఉన్నాయి.
పలు శాఖల్లోని హెచ్ఓడీలకు విధులపై ఉన్న అనాసక్తి వల్ల కింది స్థాయి సిబ్బంది టైమ్‌పాస్ ముచ్చట్లతో కాలం గడుపుతున్నారనే విమర్శలు బాహాటంగా వినిపిస్తున్నాయి. ప్రధానంగా వెటర్నరీ, ఉద్యాన, పంచాయతీరాజ్, పౌరసరఫరాల, ఫిషరీస్, ఆయా కార్పొరేషన్లు, వెల్ఫేర్ శాఖల అధికారులు ఫోన్లు కూడా ఎత్తకుండా ఉండటం.. కింది స్థాయి సిబ్బంది సోది మాటలతో కాలం గడుపుతున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. అయితే.. ఆయా శాఖల్లో పెండింగ్ పనులు బాగా పేరుకుపోవడంతో కలెక్టర్ సైతం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇక క్షేత్రస్థాయిలో కూడా పలువురు సిబ్బంది, అధికారులు నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తే అప్పటికప్పుడే ఆగ్రహంతో నోటీసులు ఇవ్వండి.. సస్పెండ్ చేయండి అంటూ సాయంత్రం వరకు జాలి చూపించి వదిలేస్తున్నారట. ఇది కూడా బద్దకపుదారులకు కలిసివచ్చి విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉంటున్నట్లు తెలుస్తుంది. ఇటీవల నిర్వహించిన ఇందిరమ్మ ఇండ్ల సర్వేలో దరఖాస్తుదారులు లేకున్నా, ఫోన్ కలువకపోయినా.. వారు వద్దు అని అన్నట్లు చెప్పి వందకు వంద శాతం చేశామనే అబద్ధాలు చెప్పినట్లు కలెక్టర్ దృష్టికి వచ్చి సీరియస్ అయ్యారట.
గుర్రంపోడ్, జనవరి 15 : మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది విధులకు గైర్హాజరు కావడంపై కలెక్టర్ సీరియస్ అయ్యారు. అందరినీ సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం గుర్రంపోడు పీహెచ్‌సీని ఆకస్మిక తనిఖీ చేశారు. ఆ సమయంలో ఎవరూ విధుల్లో లేరు. పీహెచ్సీ హెల్త్ అధికారి హరిలాల్ మాత్రం డిప్యూటేషన్‌పై ఇతర చోట పనిచేస్తున్నారు. మిగతా అందరూ ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరు కావడాన్ని కలెక్టర్ సీరియస్‌గా తీసుకున్నారు. కాంట్రాక్ట్ పద్ధతిపై పనిచేస్తున్న ఫార్మాసిస్ట్ శ్యామ్, ల్యాబ్ టెక్నీషియన్ సంధ్య, డేటా ఎంట్రీ ఆపరేటర్ మాధవి, అటెండర్లు శ్రీనివాస్, అరుణజ్యోతి, ఎల్లమ్మను ఉద్యోగం నుంచి తొలగించారు. రెగ్యులర్ ఉద్యోగులు అయిన ఫార్మాసిస్ట్ భాగ్యమ్మ, అటెండర్ లక్ష్మీనారాయణను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక నుంచి ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరయ్యే ప్రతి ఉద్యోగిపై ఇలాంటి చర్యలే తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేసి సిబ్బంది మొత్తం గైర్హాజరు కావడం బాధాకరమని, అందువల్లే అందరినీ తొలగించామని కలెక్టర్ తెలిపారు.