నల్లగొండ, నవంబర్ 26 : ‘విద్యా సంస్థల్లో కనీస వసతులు లేవు, కూర్చోవడానికి కుర్చీలు లేవు, ల్యాబ్‌ల్లో ప్రయోగాలు ఉండవు, అసలు కెమికల్స్ ఎలా ఉంటాయో కూడా తెల్వదు, కెరీర్‌పై అవగాహన కల్పించరు.. ఇలా ఉంటే ఎలా చదువుకునేది’ అని విద్యార్థులు.. ‘పాఠశాలలు, కళాశాలలకు నిర్వహణ నిధులు రావడం లేదు. విద్యాసంస్థల్లో స్వీపర్, స్కావెంజర్ లేక ఇబ్బంది పడుతున్నాం’ అని ఉపాధ్యాయులు, అధ్యాపకులు.. ‘ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని నూత న విద్యా విధానాన్ని అమలు చేయాలి. పిల్లలకు హై స్కూల్ నుంచే అన్ని రంగాలను పరిచయం చేయాలి. కంప్యూటర్ రంగంపైనా అవగాహన కల్పించాలి’ అని తల్లిదండ్రులు.. ఇవీ మంగళవారం నల్లగొండ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో విద్యా కమిషన్ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణలో ప్రస్తావనకు వచ్చిన అంశాలు.
విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి ఆధ్వర్యంలో నూతన విద్యా విధానం విద్యార్థిని వేదికగా చేసుకొని రూపొందించాలనే ఆలోచనతో నిర్వహించిన అభిప్రాయ సేకరణలో పలు విద్యా సంస్థల అధ్యాపకులు, ఉపాధ్యాయులతోపాటు తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు. పలు విద్యా సంస్థల నుంచి వచ్చిన విద్యార్థులు శాంతి, ప్రసన్న కుమార్, అవినాష్, నస్రత్ అఫియా కమిషన్ ముందు తమ అభిప్రాయాన్ని తెలిపారు. కళాశాలల్లోనే ఇంటర్య్యూలు ఏర్పాటు చేసి విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని పేరెంట్స్ కనకయ్య, ఉజ్వల కమిషన్‌ను కోరారు.విద్యా సంస్థల నిర్వహణకు నిధులు ఇవ్వకపోవడంతో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని, స్వీపర్లు, స్కావెంజర్లు లేక పాఠశాలలు, కలాశాలలు అస్తవ్యస్తంగా తయారవుతున్నాయని డీఐ ఓ దస్రూనాయక్, ఎంజీయూ ప్రొఫెసర్ అంజిరెడ్డితోపాటు పలు కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు, పాఠశాలల ఉపాధ్యాయులు రాజేశ్వర్, వేణుగోపాల్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చారు.
జూనియర్ కళాశాల విద్యార్థులకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం కల్పించడంతో ఇంటర్లో విద్యార్థుల సంఖ్య పడిపోకుండా ఉంటుందని తెలిపారు. అధ్యాపకులకు లేటెస్ట్ అంశాలపై శిక్షణ ఇవ్వాలని, కళాశాలల్లో మల్టీ డిసిప్లేనరీ కోర్సులు ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ సందర్భం గా విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి మాట్లాడుతూ విద్యా వ్యవస్థలో సమగ్ర విధానాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేసిందని. ఇందులో భాగంగా అన్ని జిల్లాల్లో వివిధ స్థాయిల్లో అందరి అభిప్రాయాలు తీసుకొని విద్యా విధానాన్ని రూపొందిస్తామని అన్నారు. కలెక్టర్ ఆలా త్రిపా ఠి, విద్యా కమిషన్ సభ్యులు ప్రొఫెసర్ విశ్వేశ్వర్, వెంకటేశ్, జ్యోత్య్నా రెడ్డి, అదనపు కలెక్టర్ శ్రీనివాస్, డీఆర్వో అమరేందర్, ప్రతీక్ ఫౌండేషన్ చైర్మన్ గోనారెడ్డి, ఎన్జీ కళాశాల ప్రిన్సిపాల్ ఉపేందర్ పాల్గొన్నారు.