నల్లగొండ ప్రతినిధి, మే 2 (నమస్తే తెలంగాణ): ఐదు రాష్ర్టాల ఎన్నికలు అలా ముగిశాయో…లేదో… ఇలా ఒక్కసారిగా కేంద్రంలోని మోదీ సర్కార్ జనం నడ్డి విరిచింది. ఎన్నికల ముందు అమెరికా, ఇజ్రాయిల్- ఇరాన్ యుద్ధ ప్రభావం ఎలా ఉన్నా.. ఎట్టి పరిస్థితుల్లోనూ గ్యాస్, పెట్రో ఉత్పత్తుల ధరల పెంపు ఉండదంటూ కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఢంకా భజాయించి ప్రకటనలు చేశారు. అయితే ఎన్నికల ఫలితాలు వెలువడకుండానే శుక్రవారం నుంచి వాణిజ్య సిలిండర్ల ధరను చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఒక్కసారిగా పెంచేసింది. కేంద్ర ప్రభుత్వ అనుమతితో చమురు సంస్థలు నష్టాల పేరుతో 19 కిలోల కమర్షియల్ సిలిండర్‌పై రూ.993 ధర పెంచుతున్నట్లు ప్రకటించాయి. దీంతో ఒక్కో సిలిండర్ ధర రూ.3315లకు చేరింది.
ఇక 5కేజీల వాణిజ్య సిలిండర్ ధరను రూ.549లకు పెంచింది. దీంతో దాని ధర రూ.993కు చేరింది. పెరిగిన ధరలతో ముఖ్యంగా హోటళ్లు, రెస్టారెంట్లు, రోడ్డు పక్కన ఉండే బడ్డీ కొట్లు, హాస్టళ్లపై ఆధారపడి జీవనం సాగించే సామాన్యులపై తీవ్ర ప్రభావం పడనుంది. ధరా భారాన్ని అనివార్యంగా వినియోగదారులపై మోపుతూ శనివారం నుంచే ఉమ్మడి నల్లగొండ జిల్లాల్లోని హోటళ్లు, రెస్టారెంట్లల్లో సరఫరా చేసే టీ, టిఫిన్ల ధరలు పెంచేశాయి. టిఫిన్ల నుంచి మొదలు బిర్యానీ వరకు రూ.10 నుంచి రూ.50 వరకు అదనంగా పెంచారు. ఇలా ఉమ్మడి జిల్లాలో నెలకు సగటున యాజమాన్యాలపై అదనంగా రూ.కోటికి పైగా భారం పడనుండగా, సా మాన్య జనం జేబుకు సైతం భారీ మొత్తంలో చిల్లు పడనుంది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 71 గ్యాస్ ఏజెన్సీలు ఉండగా వాటి పరిధిలో గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లు 10.56 లక్షల కనెక్షన్లు ఉన్నాయి.
వీటికి తోడు బయట వాణిజ్య అవసరాల కోసం వినియోగించే కమర్షియల్ కనెక్షన్లు సుమారు 14వేల వరకు ఉన్నట్లు అంచనా. గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధర ప్రస్తుతం రూ.984 ఉండగా కమర్షియల్ సిలిండర్ ధర రూ.2331గా ఉంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అనుమతితో వాణిజ్య సిలిండర్ ధర ఒకేసారి భారీగా పెరిగింది. ఒకేసారి 70 శాతం పెంపునకు కేంద్రం అనుమతి ఇవ్వడంతో శనివారం నుంచి ఈ ధర రూ.3315కు చేరింది. దీంతో రోడ్ల వెంట ఉండే బడ్డీ కొట్లు, టిఫిన్ బండ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, ఇతర స్వీట్ షాపులు, హోటళ్లు, రెస్టారెంట్లు, హాస్టళ్ల నిర్వాహకులపై మోయలేని భారం పడింది. ఒకేసారి ఇంతలా ధర పెంపు గతంలో ఎన్నడూ లేదని జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే గత నెల రోజులుగా వాణిజ్య సిలిండర్లు అందుబాటులో లేక 30 శాతం హోటళ్లు, ఇతర దుకాణాలు మూతపడ్డాయి. ఇక తాజాగా పెరిగిన ధరతో ప్రస్తుతం నడుస్తున్న వాటిల్లోనూ మరికొన్ని మూతపడేలా ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో మొత్తం 14వేల వాణిజ్య సిలిండర్ కనెక్షన్లు ఉన్నట్లు అంచనా. నల్లగొండలో 7వేలు, సూర్యాపేటలో 4700, భువనగిరి జిల్లాలో 2400 ఉన్నాయి. వీటిల్లో నెలకు 10,500 సిలిండర్లు రీఫిల్ వస్తున్నట్లు గ్యాస్ ఏజెన్సీల లెక్కలు వెల్లడిస్తున్నాయి.
నెలకు రూ.కోటికి పైగానే భారం..
ప్రస్తుతం గ్యాస్ ధర పెంపుతో ఉమ్మడి జిల్లాపై నెలకు సగటున రూ.కోటికి పైగానే అదనపు భారం పడనున్నట్లు స్పష్టమ వుతోంది. ఒక్కో సిలిండర్‌పై కనీసం వెయ్యి రూపాయలకు పైగానే భారం పడనుండగా 10,500 రీఫిల్ సిలిండర్లపై అటు ఇటుగా రూ.1.05 కోటి వరకు అదనంగా చెల్లించాల్సి వస్తుంది. వీటిపై ఆధారపడి జీవించే వారిలో 80 శాతానికి పైగా సామాన్యులే కావడం గమనార్హం. ఎక్కువగా రోడ్డు పక్కన చిన్న చిన్న హోటళ్లు, ఫాస్ట్ పుడ్ సెంటర్లు, మిర్చి బండ్లు, తినుబండారాల దుకాణాలు, స్వీటు షాపులే ఎక్కువ ఉన్నాయి. ఇక హోటళ్లు, రెస్టారెంట్లు, కాలేజీలు, స్కూళ్ల హాస్టళ్లు కూడా వీటినే వినియోగిస్తారు. దీంతో వాటన్నింటిపై ప్రత్యక్ష భారం పడుతుండటంతో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. కాగా ఏడాదిలోనే ఒక్కో వాణిజ్య సిలిండర్ ధర సగటున రూ.1500 వరకు పెరిగింది. జవవరిలో రూ.111, ఫిబ్రవరిలో రూ.49, మార్చిలో రూ.144, ఏప్రిల్‌లో రూ.194, తాజాగా శుక్రవారం రూ.993లు పెరిగింది. ఇక 5కేజీల వాణిజ్య సిలిండర్ ధర కూడా భారీగా పెరిగింది. దీనిని కూడా రూ.549 నుంచి రూ.993 ఒకేసారి పెంచడం గమనార్హం. ఎన్నికల ముందు ధరలు పెరగవని చెప్పి ఇప్పుడు ఒక్కసారిగా భారీగా పెంచి మోడీ సర్కార్ దొంగదెబ్బ తీసిందని జనం మండిపడుతున్నారు.
సామాన్యుడిపై తీవ్ర ప్రభావం..
వాణిజ్య సిలిండర్ల ధరల పెంపు ప్రభావం సామాన్యుడిపై పడుతోంది. ఈ ధరల భారాన్ని హోటళ్లు, ఇతర వ్యాపారస్తులు వెంటనే వినియోగదారులపై మోపుతున్నారు. దీనివల్ల వారు కొంతలో కొంత భారం తగ్గించుకుంటున్నారు. శనివారం ఉదయానికే ఉమ్మడి జిల్లాలోని నల్లగొండ, మిర్యాలగూడ, సూర్యాపేట, కోదాడ, భువనగిరి లాంటి పట్టణాల్లోని పలు హోటళ్ల యాజమాన్యాలు ఆహార పదార్థాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. టిఫిన్ నుంచి బిర్యానీ వరకు రూ.10 నుంచి రూ.50వరకు అదనంగా చార్జీ చేస్తున్నట్లు వెల్లడించాయి. పలుచోట్ల హాటళ్ల యాజమాన్యాలు ధరలు పెంచుతూ బోర్డులు కూడా పెట్టడం గమనార్హం. కస్టమర్లు అర్థం చేసుకుని సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ ప్రకటనలు ఉం డటం విశేషం. గృహ వినియోగ సిలిండర్ల ధరలు సైతం రూ.50 నుంచి వంద వరకు పెరగవచ్చని ప్రచారం జరుగుతోంది. ఇక డీజిల్, పెట్రోల్ ధరల మోత కూడా మోగనుందని వార్తలు వస్తున్నాయి. ఇన్నాళ్లూ ఎన్నికల నేపథ్యంలో మౌ నంగా ఉన్న కేంద్రం తీరా ఎన్నికలు ముగిశాక గ్యాస్ ధర పెంచి సామాన్యుల నడ్డి విరిచే నిర్ణయం తీసుకోవడంపై జనం ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.

మళ్లీ కట్టెలపొయ్యే గతి..
మిర్యాలగూడ టౌన్, మే 2 : పెరిగిన గ్యాస్ ధరతో సా మాన్యుడి నడ్డి విరిచే ప్రయత్నం చేస్తోంది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం. కట్టెల పొయ్యే లేని దేశంగా మారుస్తామని చెప్పి, మళ్లీ ఇప్పుడు వాటిపైనే ఆధారపడి బతికేలా చేస్తోంది. గతంలో సబ్సిడీ ఇచ్చినట్టే ఇచ్చి ఎగనా మం పెట్టారు. ఒకవైపు పెట్రోల్ డీజిల్, మరోవైపు గ్యాస్ సిలిండర్ ధర పెం పుతో సామాన్యులు అరిగోస పడుతున్నారు. బీజేపీ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి గరీబోళ్లు రోడ్డున పడ్డారు. ఒకసారి నోట్ల రద్దుతో బ్యాంకుల చుట్టూ తిరిగేలా చేశారు. ఇప్పుడు పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరతతో మళ్లీ రోడ్డెక్కెలా చేశారు. కేంద్ర విధానాలతో పేద, మధ్య తరగతి ప్రజల జీవితాలు చిన్నాభిన్నమవుతున్నాయి.
-తౌడోజు కవిత,గృహిణి, రెడ్డి కాలనీ, మిర్యాలగూడ
చాయ్ దుకాణం బంద్ పెట్టే పరిస్థితి వచ్చింది
సూర్యాపేట, మే 2 : 20 ఏళ్లుగా సూర్యాపేటలో చాయ్ దుకాణం నడుపుతున్నా. గత కొన్ని రోజులుగా పెరుగుతున్న ధరలు వ్యాపారాన్ని దెబ్బ తీస్తున్నాయి. ఇటీవల పాల ధర పెరిగింది. దీంతో పాటు ప్రస్తుతం గ్యాస్ దొరకడం లేదు. అధిక ధరకు సిలిండర్ కొని హోటల్ నడిపే పరిస్థితి లేదు. కమర్షియల్ సిలిండర్ డెలివరీతో రూ. 3375 పడుతుంది. మాకు రెండు రోజులకో సిలిండర్ కావాలి. రూ. 10లు ఉన్న చాయ్‌ని ఇటీవల పాల ధర పెరగడం, గ్యాస్ షార్టేజీ కారణంగా రూ. 15 చేశాం. అంతకు మించి ధర పెంచితే చాయ్ తాగే వారి సంఖ్య తగ్గుతుంది. అట్లని రూ. 15కే చాయ్ అమ్మితే మాకు కిరాయి, వర్కర్ల వేతనాలు వెళ్లే పరిస్థితి లేదు.
– గోరుగంటి వెంకటేశ్వరరావు, రాజధాని టీ స్టాల్, సూర్యాపేట
పెరిగిన గ్యాస్ ధరను తగ్గించాలి..
తుంగతుర్తి, మే 2 : కేంద్ర ప్రభుత్వం ఇటీవల పెంచిన కమర్షియల్ గ్యాస్ ధరను వెంటనే తగ్గించాలి. హోట ళ్లు, రెస్టారెంట్లు, చిన్న చిన్న టిఫిన్ సెంటర్లు, ఉపయోగించే వాణిజ్య సిలిండర్లపై ఒకేసారి రూ.933 పెంచ డం సరికాదు. పెరిగిన గ్యాస్ ధరతో ఒక సిలిండర్ 3,071. 50కి చేరింది. దీంతో వ్యాపారం చేయాలంటూ భయమేస్తోంది.
–కొండ సతీశ్, హోటల్ యజమాని, తుంగతుర్తి