గ్యాస్ వినియోగదారులారా..! గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తున్నారా..? అయితే ఇదివరకు ధరలో బుక్ చేయడం కుదరదు.. జేబులు ఇంకిన్ని డబ్బులు పెట్టుకోవాల్సిందే.. సామాన్యుడి జేబులకు చిల్లులు పడాల్సిందే.. అట్లయితనే బండ బుక్ అవుతుంది.. ఎందుకంటారా..? కేంద్రం ప్రభుత్వం వంట గ్యాస్ రేట్లను పెంచేసింది. ఏకంగా ఒక్కో బుడ్డిపై రూ. 50 దంచింది. పెరిగిన రేటులో గ్యాస్ బండ రూ. రూ. 925కి ఎగబాకింది. దీంతో పేద, మధ్య తరగతి ప్రజలకు గ్యాస్ సిలిండర్ గుదిబండగా మారింది. ఇప్పటికే అన్ని రకాల ధరలతో సతమతమవుతున్న పేదలకు మరింత ఆర్థిభారం పడనుంది.
– యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ)
కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక గ్యాస్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. మోదీ అధికారంలోకి వచ్చే నాటికి వంట గ్యాస్ సిలిండర్ ధర రూ. 410 ఉంది. ఇప్పుడు రెండు రెట్లు దాటిపోయింది. సోమవారం వరకు వంట గ్యాస్ ధర రూ. 875 ఉంది. తాజాగా ఒక్కో సిలిండర్‌పై రూ. 50 పెంచుతున్నట్లు ప్రకటించడంతో అది కాస్తా.. రూ. 925కి పెరిగింది. ఉజ్వల పథకానికి కూడా వర్తిస్తుందని వెల్లడించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12.94 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ధర పెంపుతో ప్రజలపై దాదాపు 6.5 కోట్ల అదనపు భారం పడనుంది. దాంతో జనం ఆందోళన చెందుతున్నారు.
కేంద్రం ఓ వైపు గ్యాస్ ధరలు పెంచుతూనే.. మరో వైపు గ్యాస్ సబ్సిడీకి మంగళం పాడే ప్రయత్నం చేస్తున్నది. 2014కంటే ముందు గ్యాస్ సబ్సిడీ విధానం లేదు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్యాస్‌పై అధికంగా వసూలు చేస్తూ.. అందులోంచి సబ్సిడీ పేరుతో తిరిగి ఇచ్చే విధానానికి శ్రీకారం చుట్టింది. కానీ అది కూడా సక్కగా అమలు కావడం లేదు. రాను రాను సబ్సిడీని తగ్గిస్తూ పోతున్నది. ఇప్పుడు ఒక్కో సిలిండర్‌పై అతి తక్కువగా రూ. 40 సబ్సిడీ ఇస్తున్నది.
గ్యాస్ సిలిండర్ ధర పెంపుతో అన్ని రంగాలపై ప్రభావం చూపుతున్నది. ముఖ్యంగా సామాన్యులు సిలిండర్ కొనలేని పరిస్థితి ఉంది. ఒకప్పుడు కట్టెల పొయ్యి పొగలతో అనారోగ్యంపాలైన గృహిణులు గ్యాస్ రాకతో ఆ బాధ నుంచి తప్పించుకున్నారు. ఇప్పుడు సిలిండర్ ధర పెంపుతో మళ్లీ కట్టెల పొయ్యి పెట్టాల్సి వస్తుందేమోనని ఆందోళన చెందుతున్నారు. హోటళ్లు, ఇడ్లి బండ్లు, స్ట్రీట్ వెండర్లు తదితర చిరు వ్యాపారులపై తీవ్ర ఎఫెక్ట్ పడనుంది.
కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో పేదలు బతుకలేని పరిస్థితి ఏర్పడింది. ఏ రంగంలో చూసినా రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి. డీజిల్, పెట్రోల్ రేట్లు సైతం నింగి వైపు చూస్తున్నాయి. 2014లో పెట్రోల్ ధర లీటరుకు రూ. 71 ఉంది. ఇప్పుడు అది ఏకంగా రూ.107కు పాకింది. డీజిల్‌ది ఇదే పరిస్థితి. 2014లో డీజిల్ లీటర్ ధర రూ.55 ఉండగా, ఇప్పుడు రూ. 96కు ఎగబాకింది. దీంతో వాహనదారులు బండ్లను నడిపే పరిస్థితి లేకుండా పోయింది. ఇక నిత్యావసర ధరలు సైతం భగ్గుమంటున్నాయి. ఏం కొనలేని పరిస్థితి దాపురించింది. పప్పులు, ఉప్పులు, బియ్యం, కూరగాయలు తదితర అన్నింటి ధరలు పెరిగిపోయాయి. వంట గ్యాస్ ధర పెంపుపై మంగళవారం సీపీఎం ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు.
కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధర పెంచడం వల్ల సామాన్య, పేద మధ్యతరగతి ప్రజలకు భారంగా మారుతున్నది. దీనికి తోడు నిత్యావసర వస్తువుల ధరలు పెరుగడంతో పేదలు బతుకడం కష్టమైతున్నది. ఎన్నికల ముందు కలబొల్లి మాటలు చెప్తారు.. తర్వాత పట్టించుకోరు. కేంద్ర ప్రభుత్వ పాలన సామాన్యుడి నడ్డి విరిచేలా ఉంది . ధరల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి.
-కర్నాటి అంజమ్మ, పద్మా నగర్ కాలనీ, భూదాన్ పోచంపల్లి