సూర్యాపేట అర్బన్, ఏప్రిల్ 24: ఆర్టీసీ కార్మికులు సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న సమ్మెకు బీఆర్ఎస్ పార్టీ పూర్తి మద్దతు ప్రకటిస్తోందని, కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. కార్మికుల సమ్మె శుక్రవారం మూడో రోజు ఆర్టీసీ డిపో ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్న ఉద్యోగులకు ఆయన మద్దతు ప్రకటించి మాట్లాడారు. ఆర్టీసీ కార్మికులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందన్నారు. తొందరపాటు నిర్ణయాలతో ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడొద్దన్నారు. మృతి చెందిన ఆర్టీసీ కార్మికుడు శంకర్‌గౌడ్ కుటుంబానికి రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని, ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు.
మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఆదేశాల మేరకు ఆర్టీసీ కార్మికులకు బీఆర్ఎస్ పూర్తి మద్దతు ఉంటుందన్నారు. సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న సమ్మెలో ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త మద్దతు తెలపాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు ప్రజలకు, ఉద్యోగులకు, మహిళలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. ప్రభుత్వానికి సమ్మెను విరమింపజేయాలనే చిత్తశుద్ధి లేదని దాని చర్యలను చూస్తుంటే అర్థమవుతోందన్నారు. ఆర్టీసీ కార్మికుల నాయకులను నామమాత్రంగానే చర్చలకు పిలుస్తున్నారని, చర్చలు ఫలప్రదం అయ్యే విధంగా నిర్ణయాలు తీసుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.
కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా ప్రైవేటు బస్సులు నడపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుని.. అనుభవం లేని డ్రైవర్లతో బస్సులు నడపడంతో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. ఇలాంటి చర్యలు మానుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం డిపో ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్న కార్మికులకు నల్లబ్యాడ్జీలు ధరించి పూర్తి మద్దతు ప్రటించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎంపీపీ నెమ్మాది భిక్షం, బీఆర్ఎస్ నాయకులు ఆకుల లవకుశ, బాణాల విజయ్ కుమార్, బండారు రాజ, కోడి సైదులు పాల్గొన్నారు.

నల్లగొండ సిటీ, ఏప్రిల్ 24: ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం మూడో రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగింది. ఆర్టీసీ బస్సులు బయటికి రాకుండా కార్మికులు డిపోల ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. సమ్మెతో ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా స్థంభించిపోయింది. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వచ్చే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్టాండ్లలో బస్సుల కోసం ప్రయాణికులు గంటలకొద్ది నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. సమ్మె నేపథ్యంలో బస్టాండ్‌లో భారీగా పోలీసులను మోహరించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 7 డిపోల పరిధిలోని అద్దె, ఎలక్ట్రికల్ బస్సులను నడిపించారు.
నల్లగొండ డిపో ఎదుట సమ్మె చేస్తున్న కార్మికులకు మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లు సాధించే వరకు అండగా ఉంటామని భరోసా కల్పించారు. జేఏసీ పిలుపు మేరకు కార్మికులు నల్లగొండ బస్టాండ్ నుంచి గడియారం సెంటర్ వరకు మౌన పదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు జేఏసీ నాయకులు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఆర్టీసీ కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చిందని గుర్తు చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను మాత్రమే తాము అడుగుతున్నామన్నారు. ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చకుండా కావాలనే కాలయాపన చేస్తోందన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన రెండు పీఆర్సీలు తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క పీఆర్సీ కూడా ఇవ్వలేదన్నారు.
ఆర్టీసీ సమ్మెపై 45 రోజుల ముందుగానే కార్మికులు నోటీస్ ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు. కార్మికులు న్యాయ మైన డిమాండ్లతో ముందుకు వస్తున్నా ప్రభుత్వం కఠిన వైఖరి ప్రదర్శించడం విచారకరమన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి 2017 నుంచి రావాల్సిన పీఆర్సీ బకాయిలను వెంటనే చెల్లించి విశ్రాంత ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న అన్ని ప్రయోజనాలను విడుదల చేసే వరకు సమ్మె విరమించేది లేదన్నారు. వారికి పలు సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు బోనగిరి నరేందర్, టీజేరావు, ఎన్ఆర్సీ రాజు, కేఎస్‌రెడ్డి, నరసింహ, సుజాత, లింగమ్మ, చంద్రయ్య, హమ్మద్అలీ, మీలా ప్రభాకర్ తదితరులు ఉన్నారు.