వేసవి ఇంకా మొదలు కాలేదు.. ఎండలు ముదరనే లేదు. అప్పుడే తాగునీటికి ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. నీటి ఎద్దడి ముంచుకొస్తుండడంతో పల్లెలు, పట్టణాల్లో జనం అవస్థలు మొదలయ్యాయి. రిజర్వాయర్ల నుంచి వచ్చే నీళ్లు సగానికి పడిపోయాయి. మరోవైపు భూగర్భ జలాలు అడుగంటడంతో బోర్లు వేగంగా వట్టిపోతున్నాయి. అనేక గ్రామాలు, పట్టణాల్లో వారానికి రెండు సార్లు మాత్రమే నీటిని సరఫరా చేస్తున్నారు. దాంతో వాటర్ ట్యాంకర్ల కోసం నిరీక్షించక తప్పడం లేదు. ఇప్పుడే ఇలా ఉంటే రానున్న రోజుల్లో పరిస్థితి ఏంటని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రైవేట్ ట్యాంకర్ ద్వారా నీళ్లు పోయించుకున్న ఈ వ్యక్తి పేరు కానుగు శివ. చౌటుప్పల్ మున్సిపాలిటీలోని హనుమాన్‌నగర్. తమ కాలనీలో నీటి సమస్య తీవ్రంగా ఉందని, పది రోజులకోసారి నీళ్లు వస్తున్నాయని తెలిపారు. అది కూడా చాలా సన్నగా వస్తున్నాయని, అధికారులకు చెప్పిచెప్పి యాష్టకొచ్చిందని వాపోయారు. దాంతో ప్రైవేట్ ట్యాంకర్ ద్వారా నీళ్లు పోయించుకుంటున్నట్లు పేర్కొన్నారు. నీటి సమస్య కారణంగా అద్దెకు ఉన్న వాళ్లు కూడా ఖాళీ చేస్తున్నారని, కొత్తగా ఎవరూ రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో నీళ్లకు ఇబ్బంది లేదని, ఇప్పుడు సమస్య తీవ్రంగా ఉందని తెలిపారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆరు మున్సిపాలిటీలు, 719 ఆవాసాలు ఉన్నాయి. మొత్తంగా 1,56,147 నల్లా కనెక్షన్లు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 1,221 ట్యాంకులు, 353 చేతి పంపులు, 33 బావుల ద్వారా మంచి నీటిని సరఫరా చేస్తున్నారు. భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల్లోని 512 ఆవాసాలకు హైదరాబాద్ మెట్రో వాటర్ గ్రిడ్ నుంచి, 131 ఆవాసాలకు అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, 69 ప్రాంతాలకు నల్లగొండలోని ఉదయసముద్రం నుంచి తాగునీరు సరఫరా అవుతున్నది.
హెచ్ఎండబ్ల్యూస్ నుంచి ప్రజల కోసం రోజుకు 80ఎంఎల్డీ (మిలియన్ లీటర్ ఫర్ డే) నీరు అవసరం. గతంలో సుమారుగా ఇదే స్థాయి లో నీరు సరఫరా అయ్యేది. కానీ ప్రస్తుతం 47 ఎంఎల్డీలు మాత్ర మే జిల్లాకు వస్తున్నా యి. చౌటుప్పల్, సంస్థాన్‌నారాయణపురం, భూదాన్‌పోచంపల్లి, వలిగొండ మండలాల్లోని 144 ఆవాసాలకు నల్లగొండ జిల్లాలోని అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి 14 ఎంఎల్డీల జలాలు అందుతున్నా యి. రామన్నపేట, మోత్కూరు, అడ్డగూడూరు మండలాల్లోని ఆవాసాల్లోకి పానగల్ రిజర్వాయర్ నుంచి 10 ఎంఎల్డీల కృష్ణానీటిని అందిస్తున్నారు. ఇవి కూడా అంతంతమాత్రంగా నే వస్తున్నాయి. మొత్తంగా గతంలో పోలిస్తే ప్రస్తుతం సగం నీరు మాత్రమే జిల్లాకు సరఫరా అవుతున్నది.
అప్పుడే నీటి కష్టాలు..
గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి నీటి బాధలు షురూ అయ్యాయి. ముఖ్యంగా మున్సిపాలిటీల్లో ఇబ్బందులు విపరీతంగా ఉన్నాయి. సరిపడా నీళ్లు లేకపోకపోవడంతో మిషన్ భగీరథ నీళ్లలోనే స్థానిక బోరు నీళ్లను కలిపి సరఫరా చేస్తున్నారు. అది కూడా వారానికి రెండు సార్లు మాత్రమే అందిస్తున్నారు. కొన్నిచోట్ల నీటి సరఫరా లేకపోవడంతో వాటర్ ట్యాంకర్లే దిక్కవుతున్నాయి. కాలనీల్లో ట్యాంకర్ల నుంచి పట్టుకొని డ్రమ్ముల్లో నింపుకొంటున్నారు.
ఇవి కనీస అవసరాలకు కూడా చాలకపోవడంతో ఎప్పుడో వచ్చే వాటర్ ట్యాంకర్ల కోసం పడిగాపులు గాయాల్సి వస్తుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకొందరు డబ్బులు వెచ్చించి ప్రైవేట్ ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేస్తున్నారు. భువనగిరి పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో నివసిస్తున్న ప్రజలకు ట్రాక్లర్ల ద్వారా అందించే ట్యాంకర్ నీళ్లే ఆధారం అయ్యాయి. ఇక్కడ రెండు వాటర్ ట్యాంకులు ఉన్నప్పటికీ నిరుపయోగంగా మారాయి.
వట్టిపోయిన బోర్లు
జిల్లాలో భూగర్భ జలాలు పాతాళానికి పడిపోయాయి. ఫిబ్రవరిలో సగటున 10.95 మీటర్ల కిందకు వెళ్లాయి. గతంలో సగటున ఐదు మీటర్ల లోతులోనే నీళ్లు ఉండగా, ఇప్పుడు వేగంగా అడుగంటుతున్నాయి. గతేడాది కంటే ఈసారి 2.36 మీటర్ల మేర అధికంగా పడిపోయాయి. జిల్లాలోని 17 మండలాల్లో భూగర్భ జలమట్టం తగ్గిపోయింది. సంస్థాన్ నారాయణపురంలో అత్యధికంగా 23.09 మీటర్ల లోతులో నీళ్లు ఉన్నాయి. ఆత్మకూరు(ఎం)లో 18.18 మీటర్లు, బొమ్మలరామారంలో 14.06, భువనగిరిలో 12.61, రామన్నపేటలో 12.36, బీబీనగర్‌లో 12.31, ఆలేరులో 11.96, తుర్కపల్లిలో 11.76, మోటకొండూరులో 11.36 మీటర్ల దూరాన నీళ్లు ఉన్నాయి. దాంతో బోర్లు, బావులు ఎండిపోయి తాగునీటి ఎద్దడి జఠిలంగా మారుతున్నది.
167 ఆవాసాల్లో..
జిల్లాల 167 ఆవాసాలకు నీటి ఎద్దడి ఉందని అధికారులు అంచనా వేశారు. చాలా గ్రామాల్లో నీళ్ల కోసం ప్రజలు వ్యవసాయ బోర్లను ఆశ్రయిస్తున్నారు. అక్కడికే వెళ్లి బట్టలను ఉతుక్కుంటున్నారు. గ్రామాలు, తండాల్లో కిలోమీటర్ల దూరం వెళ్లి నీళ్లు తెచ్చుకుంటున్నారు. మళ్లీ ఉమ్మడి రాష్ట్ర పరిస్థితులు కనిపిస్తున్నాయని పలువురు వాపోతున్నారు. మిషన్ భగీరథ నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దాంతో జనం వాటర్ ప్లాంట్లలో నీటిని కొనుగోలు చేస్తూ కాలం వెల్లదీస్తున్నారు.
మూడు రోజులకోసారి నీళ్లు.. అవీ మూడు బిందెలే…
మోత్కూరు : నల్లగొండలోని పానగల్ ఉదయసముద్రం మిషన్ భగీరథ పంప్‌హౌస్ నుంచి మోత్కూరు మున్సిపాలిటీ పరిధి బుజిలాపురంలోని సంపునకు మిషన్ భగీరథ నీటిని సరఫరా చేస్తున్నారు. ఇక్కడి నుంచి మోత్కూరు మున్సిపాలిటీతోపాటు మండలంలోని 10 గ్రామాలకు, అడ్డగూడూరు మండలంలోని 17 గ్రామాలకు మంచినీటి సరఫరా అవుతుంది.
కాగా వేసవి నేపథ్యంలో నీటి నిర్వహణలో అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా నీటి సరఫరా అంతంతమాత్రంగానే అవుతున్నది. దాంతో మున్సిపాలిటీతోపాటు ఆయా గ్రామాల ప్రజలు నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. మోత్కూరుకు చెందిన గౌళికర్ స్వరూప అనే మహిళ మాట్లాడుతూ.. మూడు రోజుల కోసారి నీటిని సరఫరా చేస్తున్నారని, అవి కూడా మూడు బిందెలు నిండదం లేదని తెలిపారు. నీళ్ల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు.