నీలగిరి, జూన్ 3 : నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలోని పాతబస్తీ హిందూపూర్ వాటర్ ట్యాంకులో వ్యక్తి మృతదేహం కనిపించడం కలకలం రేపింది. అదివారం సాయంత్రం, సోమవారం ఉదయం ఆ ట్యాం కు పరిధిలోని నాలు గు వార్డుల ప్రజలకు సరఫరా అయిన నీటిలో దుర్వాసన రావడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో మున్సిపల్ సిబ్బంది ట్యాంకులో పరిశీలించగా.. దుర్వాసన వస్తుండడంతో నీటిని ఖాళీ చేశారు. అడుగు భాగంలో మృతదేహం కనిపించగా.. బయటకు తీశారు. 12 రోజుల క్రితం తప్పిపోయిన అదే ప్రాంతానికి చెందిన అవుల వంశీకృష్ణ (27)గా స్థానికులు గుర్తించారు.
వంశీకృష్ణ యాదవ్‌కు అనారోగ్య సమస్యతోపాటు మానసిక స్థితి సరిగా లేదని, గత నెల 24న రాత్రి నుంచి కనిపించడం లేదని కుటుంబ సభ్యులు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వంశీ అదే రోజు రాత్రి హిందూపూర్ వాటర్ ట్యాంకులో దూకి మృతి చెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మున్సిపల్ అధికారులు గుర్తించకపోగా ఆ ట్యాంకు నుంచి నాలుగు వార్డుల పరిధిలోని సుమారు రెండు వేల కుటుంబాలకు నీటిని సరఫరా చేశారు. కాగా, కొద్ది రోజుల నుంచి తాగునీరు తేడాగా ఉండడంతో 11వ వార్డు ప్రజలు వాటర్ సప్లయ్ సిబ్బందిని ప్రశ్నించారు.
దాంతో మున్సిపాలిటీ సిబ్బంది, స్థానికులు వాటర్ ట్యాంకులో చెక్ చేయగా. వంశీకృష్ణ మృతదేహం లభ్యమైంది. మంచినీటి ట్యాంకులను చెక్ చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని మున్సిపల్ అధికారులపై ప్రజలు మండిపడుతున్నారు. అయితే.. మున్సిపాలిటీ అధికారులు మాత్రం మూడ్రోజులకోసారి మంచినీటి ట్యాంకులను శుభ్రం చేస్తున్నామని, అందులో భాగంగా మే 30న వాటర్ ట్యాంకును క్లీన్ చేశామని చెప్తున్నారు. రోజూ నీటిని విడుదల చేసే సమయంలో నీటి లెవల్స్ చూసి వదులుతామని చెప్పుకొచ్చారు. కానీ.. 10లక్షల కెపాసిటీ ఉన్న ట్యాంకు చాలా పెద్దగా ఉండడం, పైకప్పు చిన్నదిగా ఉండడంతో మృతదేహం కనబడటానికి వీలుండదని స్థానికులు పేర్కొంటున్నారు.
వైద్య నిపుణులు మాత్రం మృతదేహం రెండు, మూడు రోజుల తరువాత పైకి లేచి కొంత సమయానికి మళ్లీ అడుగుకు పోతుందని, నీటిని పూర్తిగా తీయకుండా బ్లీచింగ్ చల్లడం వల్లే మృతదేహం వారికి కనబడక పోయి ఉండవచ్చని చెబుతున్నారు. కానీ.. గత నెల 24న ఇంట్లో నుంచి వెళ్లిపోయిన వంశీ రెండు, మూడు రోజుల క్రితం చనిపోతే ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు మాత్రం అదే రోజు ఆత్మహత్య చేసుకుని ఉంటాడని చెబుతున్నారు.
నందికొండ మున్సిపాలిటీ వాటర్ ట్యాంకులో కోతులు పడి మృతి చెందిన ఘటన మరువక ముందే నల్లగొండలోని మంచినీటి ట్యాంకులో వ్యక్తి డెడ్‌బాడీని పది రోజులుగా పరిశీలించకపోవడం దారుణమని పలువురు పేరొంటున్నారు. కాగా, వాటర్ ట్యాంకులో వ్యక్తి మృతదేహం ఘటనపై జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన స్పందించారు. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వెంటనే విచారణ అధికారిగా అదనపు కలెక్టర్ టి.పూర్ణచంద్రను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఆమె ఆదేశించారు.
వంశీకృష్ణ 12 రోజుల క్రితం ట్యాంకులో పడి ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చని వైద్య నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ట్యాంకు సామర్థ్యం 10లక్షల కెపాసిటీ కాగా.. నీరు వస్తుండడం, పోతుండడంతో పెద్దగా ప్రమాదం జరుగలేదు. ట్యాంకు లోపల చీకటిగా ఉండడం, మృతదేహానికి సూర్యరశ్మి తగలకపోవడంతో పాడై పోవడానికి చాలా రోజుల సమయం పడుతుందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. మృతదేహం కుళ్లిపోనందున మలినాలు బయటకు రాకపోయి ఉండవచ్చని చెబుతున్నారు.
నీటిలో దుర్వాసన వస్తుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని గ్రహించిన జిల్లా యంత్రాంగం వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో వైద్యారోగ్య శాఖ అధికారులు నాలుగు వార్డుల పరిధిలోని సుమారు 50 ఇండ్లల్లోని ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. వారి ఆరోగ్యాల్లో ఎలాంటి మార్పులు లేకపోవడం, అన్ని పరీక్షల ఫలితాలు సాధారణంగా రావడంతో ఎలాంటి ప్రమాదం లేదని జిల్లా యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది.
వాటర్ ట్యాంకులో మృతదేహం విషయమై హత్య.. ఆత్మహత్యా? అనే దానిపై వివిధ కోణాల్లో విచారణ చేస్తున్నాంమని జిల్లా ఎస్పీ చందనాదీప్తి తెలిపారు. సోమవారం విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలన చేశారు. మృతదేహం పాతబస్తీ ప్రాంతానికి చెందిన వ్యక్తిదిగా గుర్తించామని, రెండు, మూడు రోజుల క్రితం చనిపోయినట్లుగా ప్రాథమిక విచారణలో తెలిసిందని, మృతదేహంపై అక్కడక్కడ గాయాలున్నట్లు గుర్తించామని చెప్పారు.
నల్లగొండ పాతబస్తీ ప్రాంతంలోని హిందుపూర్ వాటర్ ట్యాంకును సోమవారం శుభ్రం చేసేందుకు మున్సిపల్ ఏఈ, వాటర్ లైన్‌మన్ వెళ్లి ట్యాంకు తెరచి చూడగా మృతదేహం కనిపించింది. వెంటనే నీటిని తొలగించి శవాన్ని బయటకు తీశారు. ట్యాంకును రెండు, మూడు రోజులకు ఒకసారి శుభ్రం చేయడం జరుగుతుంది. ప్రతి మూడు రోజులకు సాధారణ శుభ్రత షెడ్యూల్ చేస్తాం. చివరగా మే 30న తనిఖీ చేసి జూన్ 1న నీటిని విడుదల చేశాం. అప్పుడు ఏమీ కనిపించలేదు. ప్రస్తుతం మృతదేహాన్ని వెలికి తీసి చూడగా రెండు, మూడు రోజుల క్రితం చనిపోయినట్లుగా ప్రాథమిక విచారణలో తేలింది. శరీరంపై కొన్ని గాయాలు కూడా ఉండడంతో ఇది ఆత్మహత్య, హత్య అనే కోణాల్లో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది.
– సయ్యద్ ముసాబ్ అహ్మద్, మున్సిపల్ కమిషనర్
హిందూపూర్ వాటర్ ట్యాంకులో 11 రోజులుగా వ్యక్తి పడి ఆత్మహత్య చేసుకున్నా ప్రభుత్వ పెద్దలు పట్టించుకోకుండా దుర్వాసనతో నీటిని సరఫరా చేసి ప్రాణాలతో చెలగాటమాడారు. కలుషిత మంచినీరు తాగిన ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇది కచ్చితంగా ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. ట్యాంకులను శుభ్రం చేస్తూ.. వేసవిలో ఎప్పటికప్పుడు మంచినీటి సరఫరాపై సమీక్ష నిర్వహించవలసిన స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోకపోవడం, అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ ఘటన జరిగింది. కలుషిత మంచినీరు తాగిన ప్రజలకు వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించాలి. బాధ్యులైన అధికారులపై తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి. లేకుంటే ప్రజల పక్షాన నిరసనలు చేపడుతాం.
– మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి