చౌటుప్పల్, సెప్టెంబర్ 14 : ట్రిపుల్ ఆర్ భూ సేకరణపై బాధిత రైతులు భగ్గుమంటున్నారు. అలైన్మెంట్ మార్చాలని, లేదంటే భూమికి బదులు భూమినైనా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు శనివారం మున్సిపాలిటీ పరిధిలోని లింగారెడ్డిగూడెం శుభం గార్డెన్లో అఖిలపక్షం ఆధ్వర్యంలో ట్రిపుల్ ఆర్ భూ నిర్వాసితుల ఐక్యవేదిక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వివిధ గ్రామాల రైతులు, భూమి కోల్పోతున్న వారు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఏండ్ల తరబడి వ్యవసాయమే అధారంగా జీవిస్తున్నామని, రీజినల్ రింగ్ రోడ్డుకు తమ భూమి తీసుకుంటే రోడ్డున పడుతామని ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్డు అలైన్మెంట్ మార్చాలని లేదా బహిరంగ మార్కెట్లో పలుకుతున్న ధర అనుసరించి నష్టపరిహారం ఇవ్వాలని, లేకుంటే భూమికి బదులు భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనిపై తక్షణమే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలన్నారు.
ఇందుకోసం తమ కుటుంబాలతో కలిసి పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈ విషయాన్ని ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లామని, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని కలుస్తామని అన్నారు. అనంతరం పట్టణంలోని 65వ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ట్రిపుల్ ఆర్ వద్దు అని నినాదాలు చేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని నిరసనను విరమింపజేశారు.
ఉన్న కొద్దిపాటి భూమి పోతే ఎలా బతుకాలి
బ్యాంకు రుణాలు, అప్పులు చేసి కొన్న భూమిని భవిష్యత్ తరాల కోసం రైతులు కాపాడుకుంటూ వస్తున్నరు. తమ పిల్లలకు అక్కరకు వస్తదని ఎంత ఇబ్బంది ఎదురైనా అమ్మలేదు. ఇలాంటి పరిస్థితుల్లో రోడ్డు కోసం ఉన్న కొద్దిపాటి భూమి పోతే ఎలా బతుకాలి. భూమికి బదులు భూమి లేదా బహిరంగ మార్కెట్ ధర చెల్లించాలి. లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం. అధికారులు కనీసం సమయం కూడా ఇవ్వడం లేదు. త్వరలోనే రైతులందరితో కలిసి మంత్రి దృష్టికి తీసుకెళ్తాం. రైతుల పక్షాన అలోచించాలి.
– చింతల దామోదర్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్, చౌటుప్పల్
అలైన్మెంట్ మార్చాలి
నా చిన్నతనం నుంచి వ్యవసాయమే జీవనాధారం. 20 ఏండ్ల కింద పైసాపైసా కూడబెట్టి భూమి కొన్నం. నాకున్న 5 ఎకరాల్లో నాలుగున్నర ఎకరాల భూమి జంక్షన్‌కు పోతుంది. అరెకరమే మిగులుతుంది. అది కూడా వంకలు టింకలు ఉంటుంది. దాంతో మేము బతుకేది ఎట్లా. సర్కార్ తక్షణమే అలైన్మెంట్ మార్చాలి.
– బలికే సత్యనారాయణ, తంగడపల్లి, చౌటుప్పల్
భూమికి భూమి ఇవ్వాలి
నాకున్న 4.20 గుంటల భూమిలో ట్రిబుల్ ఆర్కు పోగా నాలుగు గుంటలే మిగులుతుంది. ప్రభుత్వం ఇచ్చే పరిహారం దేనికీ సరిపోదు. బహిరంగ మార్కెట్ ధరను ఇవ్వాలి. లేదంటే ప్రభుత్వ లేదా గోల్డెన్ ఫారెస్ట్‌లో భూమి కేటాయించాలి. అలైన్మెంట్నైనా మార్చాలి. ప్రభుత్వం ఇలానే చేస్తే మా బతుకులు ఆగమే.
– జాల శ్రీశైలంయాదవ్, తంగడపల్లి, చౌటుప్పల్
రోడ్డు నిర్మాణంలో సర్వం కోల్పోతున్నా..
మాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా మంచీలిపట్నం మండలం కొత్తవూడి గ్రామం. నాలుగేండ్ల కింద సొంత ఊరిలో 3ఎకరాల భూమి అమ్మితే రూ.20 లక్షలు వచ్చినయి. వాటికితోడు పైసాసైసా కూడబెట్టి కొంత అప్పు చేసి మూడు ప్లాట్లు తీసుకొని షెట్టర్లు వేశా. ఇప్పుడు రోడ్డు నిర్మాణంలో పూర్తిగా కోల్పోతున్న. ఉన్న ఊరిలో ప్రస్తుతం మార్కెట్ ధర కోట్లలో పలుకుతుంది. అక్కడ భూమి విక్రయించి ఇక్కడ తీసుకుంటే ఇప్పుడిలా జరిగింది.
– మాదిరెడ్డి పాండు, చౌటుప్పల్