రామగిరి, జూన్ 9: 2025-26 విద్యా సంవత్సరం ఈ నెల 12 నుంచి ప్రారంభం అవుతుండగా పాఠశాలల్లో బడి గంట మోగనున్నది. బడులు తెరుచుకుని విద్యార్థులు ప్రవేశించగానే వారికి పాఠ్య, నోట్, వర్క్‌బుక్స్ అందించేలా జిల్లా విద్యాశాఖ చర్యలు తీసుకుంటున్నది. మరో వైపు బడి బయట ఉన్న పిల్లలను బడిలో చేర్పించేందుకు రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాలతో ఈ నెల 6 నుంచి 19 వరకు బడిబాట కార్యక్రమాన్ని చేపట్టారు. నూతన ఒరవడితో ప్రభుత్వ విద్య బలోపేతానికై ఉపాధ్యాయులు ముందుకు సాగుతుండటం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో వివిధ యాజమాన్యాల పరిధిలో 2,065(ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, హైస్కూల్స్) పాఠశాలలు ఉండగా 2,34,502 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. అన్ని మండలాల్లో ఉన్న వివిధ యాజమాన్యాల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా అందించే పాఠ్య, నోట్, వర్క్ పుస్తకాలు జిల్లా బుక్ డిపో నుంచి మండల విద్యాశాఖాధికారి కార్యాలయాలకు అక్కడ నుంచి పాఠశాలలకు చేర్చారు.
జిల్లాలో 1,606(ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ) ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు 5,89,970 పాఠ్యపుస్తకాలు అవసరం ఉండగా 4,90,860 పాఠ్యపుస్తకాలు వచ్చేశాయి. విద్యార్థులకు పుస్తకాలతోపాటు యూనిఫామ్‌లు అందించనున్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు కావాల్సిన మౌళిక వసతులు ఏర్పాటు చేస్తూ పాఠశాలలు స్వాగతం పలుకనున్నాయి. ప్రతి పాఠశాల పరిధిలో ఈ నెల 12, 13న బడిబాట సమన్వయ సమావేశాలు నిర్వహించనున్నారు. 14 నుంచి 5 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.