సంస్థాన్ నారాయణపురం, ఏప్రిల్14 : సర్వేల్ గురుకుల పాఠశాలలో చదువుకోవడం అదృష్టంగా భావిస్తానని, ఈ గురుకుల పాఠశాల నా జీవితాన్ని పూర్తిగా మార్చేసిందని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్, సర్వేల్ గురుకుల పాఠశాల పూర్వ విద్యార్థి బుర్రా వెంకటేశం అన్నారు. కమిషన్ సభ్యులు అమీర్ ఉల్లాఖాన్, పాల్వాయి రజని, రామ్మోహన్ రావుతో కలిసి సోమవారం ఆయన గురుకుల పాఠశాలను సందర్శించారు.
పాఠశాల మొత్తం కలియ తిరుగుతూ చిన్ననాటి విషయలను గుర్తు చేసుకున్నారు. తరగతి గదులు తిరిగి విద్యార్థులకు ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గురుకుల పాఠశాలలో 1983-1984 సంవత్సరంలో పదో తరగతి పూర్తి చేశానని విద్యార్థులకు తెలిపారు. విద్యార్థులు కష్టపడి చదువుకొని ఉన్నత స్థానాలకు ఎదుగాలని సూచించారు.
అనంతరం బుర్రా వెంకటేశం రచించిన ‘అమ్మ చేసిన బొమ్మ’ అనే పాటపై విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. ఆ తర్వాత ఆయన గురుకుల పాఠశాల నూతన భవనాలను సందర్శించి సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో తెలంగాణ గురుకుల విద్యాలయల కార్యదర్శి రమణకుమార్, డిప్యూటీ సెక్రటరీ ప్రసాద్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సతీశ్ పాల్గొన్నారు.