రామగిరి, మే 12 : పాలిటెక్నిక్ డిప్లొమో కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే టీఎస్ పాలిసెట్-2025కు తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. మంగళవారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1:30 గంట వరకు పరీక్ష జరుగనుంది. ఉమ్మడి నల్లగొండలో జిల్లాలో 29 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా 10,083 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో 11 సెంటర్లు.. 5,203 మంది.. సూర్యాపేట జిల్లా కేంద్రంలో 7 సెంటర్లు.. 2.798, తిరుమలగిరిలో 1 సెంటర్.. 328 మంది.. భువనగిరిలో 4, యాదగిరి గుట్టలో 2 సెంటర్లు ఉండగా 1,754 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు.
నిర్ణీత సమయం కంటే నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతి లేదని అధికారులు తెలిపారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచిస్తున్నారు. పరీక్షకు హాల్ టికెట్, హెచ్బీ పెన్సిల్, బ్లూ, బ్లాక్ బాల్ పాయింట్ పెన్నులు, షార్ప్నర్, ఎరేజర్ విధిగా తెచ్చుకోవాలి. ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. పరీక్షలకు నల్లగొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లా కోఆర్డినేటర్లుగా సీహెచ్ నరసింహా రావు, డి.వెంకటేశ్వర్లు, కె.సుజాత వ్యవహరించనున్నారు.