రామగిరి/యాదగిరి గుట్ట, మే 13 : పాలిటెక్నిక్ డిప్లొమో కోర్సులో ప్రవేశానికి తెలంగాణ సాంకేతిక విద్యా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన టీజీ పాలిసెట్-2025 ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా సజావుగా జరిగింది. నల్లగొండ, సూర్యాపేట, తిరుమలగిరి, భువనగిరి, యాదగిరిగుట్టలో 25 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా 10,125మంది విద్యార్థులకుగానూ 9,325మంది విద్యార్థులు హాజరయ్యారు. 800 మంది గైర్హాజరయ్యారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు పరీక్ష ఉండగా సమయం సమీపిస్తుండటంతో కొన్ని సెంటర్ల వద్ద విద్యార్థులు పరుగులు తీస్తూ వచ్చారు.
నల్లగొండ జిల్లా కేంద్రంలోని 11 పరీక్ష కేంద్రాల్లో 5,203మందికి విద్యార్థులకుగానూ 4,750 మంది.. సూర్యాపేట జిల్లా కేంద్రంలో 7 పరీక్ష కేంద్రాల్లో 2,798 మందికి 2,590 మంది.. తిరుమలగిరిలోని పరీక్ష కేంద్రంలో 350మందికి 321మంది.. యాద్రాది భువనగిరి జిల్లాలో ఆరు పరీక్షా కేంద్రాల్లో 1,754మందికి 1,664మంది హాజరయ్యారు. నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల కోఆర్డినేటర్లు సీహెచ్.నరసింహారావు, కె.సుజాత, వెంకటేశ్వర్లు పరీక్షల తీరును పర్యవేక్షించారు.