– ఎంజీయూ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహణ
– హాజరుకానున్న 56,223 అభ్యర్థులు
– 69 పరీక్ష కేంద్రాల ఏర్పాటు
రామగిరి, మే 11 : తెలంగాణ వ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సులో ప్రవేశానికి నిర్వహించే టీజీ ఐసెట్-2026 ప్రవేశ పరీక్ష నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఈ నెల 13, 14వ తేదీల్లో జరుగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 16 రీజియన్స్ పరిధిలో 69 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా 58,223 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. వీరిలో పురుషులు 25,915, స్త్రీలు 30,308 మంది ఉన్నారు. మూడు షిఫ్ట్‌ల్లో కంప్యూటర్ బెస్డ్ టెస్ట్(సీబీటీ) విధానంలో జరిగే పరీక్షలకు ఎంజీయూతో పాటు పలు యూనివర్సిటీలకు చెందిన 100 మంది సీనియర్ ప్రొఫెసర్స్ ను ప్రత్యేక పరిశీలకులుగా నియమించారు. ప్రతి రోజు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు, మధ్యాహ్నం 2:30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష నిర్వహణ జరుగనుంది. నిమిషం ఆలస్యమైన పరీక్ష కేంద్రంలోని అభ్యర్థులను అనుమతించరు. ఉర్దూ మీడియం, దివ్యాంగ అభ్యర్థులకు తొలి రోజు మధ్యాహ్నం రెండవ షిఫ్ట్ లో పరీక్ష ఏర్పాటు చేశారు.
– హాల్ టికెట్, ఏదైనా ఓరిజినల్ ఐడీ కార్డు (ఆధార్, పాన్, ఇతర ప్రభుత్వ గుర్తింపు కార్డులు)లతో రావాలి
– పరీక్ష కేంద్రంలోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించరు (వాచీ, సెల్‌ఫోన్స్, ఎలక్ట్రానిక్ గడియారం మొ..)
– అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు గంట ముందుగానే చేరుకోవాలి
– నిర్ణీత సమయం కంటే నిమిషం ఆలస్యమైన అనుమతి ఉండదు
– అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది
తెలంగాణ వ్యాప్తంగా ఎంజీయూ ఆధ్వర్యంలో నిర్వహించే టీజీ ఐసెట్-2026కు సీబీటీ విధానంలో జరిగే పరీక్షకు పటిష్టమైన ఏర్పాట్లు చేశాం. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు సులభంగా చేరుకునేలా వారి హాల్ టికెట్స్‌పై పరీక్ష కేంద్రం లోకేషన్‌తో బార్‌కోడ్స్ ముద్రించాం. పటిష్ట నిర్వహణకై 100 మంది సీనియర్ ప్రొఫెసర్స్ ను పరిశీలకులుగా నియమించాం. అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు గంట ముందుగానే చేరుకోవాలి. నిర్ణీత సమయం కంటే నిమిషం ఆలస్యమైన పరీక్ష కేంద్రాల్లోకి అనుమతి ఉండదు. ఉర్దూ, వికలాంగుల అభ్యర్థులు తొలి రోజు మధ్యాహ్నం జరిగే పరీక్షకు హాజరుకావాలి.

ఈ 13, 14న టీజీ ఐసెట్