– అధ్యయన పర్యటన విజయవంతం
– ఎంజీయూ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్
రామగిరి, జూలై 08 : తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో రాష్ట్రానికి చెందిన 35 మంది ప్రతినిధుల బృందం జర్మనీ, స్విట్జర్లాండ్ దేశాల్లో చేపట్టిన విద్యా అధ్యయన పర్యటన అత్యంత విజయవంతంగా ముగిసిందని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ తెలిపారు. జూన్ 28 నుండి జూలై 6 వరకు సాగిన ఈ విదేశీ పర్యటన తెలంగాణ ఉన్నత విద్యా రంగానికి సరికొత్త దిశను చూపించనుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ అధ్యాపక బృందం వీసీకి అభినందనలు తెలియజేసింది. అనంతరం పర్యటన వివరాలు, సాధించిన అభ్యసనాలను వీసీ మీడియాకు వివరించారు. అంతర్జాతీయ ఖ్యాతి గల విద్యా సంస్థలైన యూనివర్సిటీ ఆఫ్ గోట్టింగెన్, మ్యూనిక్, మెర్సిడెస్–బెంజ్ సెంట్రల్ ఫెసిలిటీ సెంటర్, యూనివర్సిటీ ఆఫ్ ఆఖెన్, ఓస్ట్ఫాలియా విశ్వవిద్యాలయాలను సందర్శించినట్లు తెలిపారు. ఈ సంస్థలలో అనుసరిస్తున్న ఉన్నత విద్య, పరిశోధనలు, వినూత్న బోధన పద్ధతులు, పరిశ్రమ–విద్యా రంగాల భాగస్వామ్యాలను క్షుణ్ణంగా పరిశీలించినట్లు వెల్లడించారు. రాబోయే రోజుల్లో అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలతో కలిసి ఆయా కార్యక్రమాల రూపకల్పనకు పర్యటన దోహద పడుతుందన్నారు.
ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్లు : విద్యార్థులు, బోధనా సిబ్బంది పరస్పర మార్పిడి
ట్విన్నింగ్ ప్రోగ్రామ్స్ : విదేశీ వర్సిటీలతో సంయుక్త విద్యా కోర్సులు
సంయుక్త పరిశోధనలు : అంతర్జాతీయ స్థాయి రీసెర్చ్ ప్రాజెక్టుల నిర్వహణ
డిజిటల్ లెర్నింగ్ : ఆన్లైన్ లెక్చర్ల వ్యవస్థ, నూతన కరికులం అభివృద్ధి
పరిమిత వనరులతోనే నాణ్యమైన విద్యను ఎలా అందించవచ్చో, డిజిటల్ టెక్నాలజీ ఆధారిత బోధన, పరిశోధనాభిముఖ పరిపాలన, కమ్యూనిటీతో అనుసంధానాన్ని ఎలా సమర్థవంతంగా అమలు చేయాలో యూరప్ వర్సిటీలు మార్గదర్శకత్వాన్ని చూపాయని వీసీ కొనియాడారు. ప్రత్యేకంగా తెలంగాణలోని గ్రామీణ, అర్బన్-రూరల్ ప్రాంతాల్లో కొత్తగా ఏర్పాటవుతున్న విశ్వవిద్యాలయాలకు ఈ నమూనాలు (Models) ఎంతో ఉపయుక్తంగా నిలుస్తాయన్నారు. ప్రాంతీయ అభివృద్ధి, సామాజిక న్యాయం, సమగ్ర పురోగతి సాధించడమే విద్యాసంస్థల ప్రధాన సందేశం కావాలని పిలుపునిచ్చారు. ఈ విద్యా పర్యటనకు అవకాశం కల్పించిన ఉన్నత విద్యా మండలికి, నిర్వాహకులకు వర్సిటీ తరఫున వీసీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంజీయూ రిజిస్ట్రార్ ఆచార్య కొప్పుల అంజిరెడ్డి, ఆచార్య ఆకుల రవి, ప్రిన్సిపాల్ ఆచార్య శ్రీదేవి, డాక్టర్ వై. ప్రశాంతి, మారం వెంకట రమణారెడ్డి, ఇతర అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు.

ముగిసిన తెలంగాణ ఉన్నత విద్యా మండలి ప్రతినిధుల బృందం జర్మనీ, స్విట్జర్లాండ్ పర్యటన