యాదాద్రి భువనగిరి, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ) : ఆదాయమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. ఆశావాహుల నుంచి అందినకాడికి దోచుకోవడమే పనిగా పెట్టుకున్నది. మద్యం దుకాణాల లైసెన్సులు, దరఖాస్తుల ద్వారా రెవెన్యూ రాబట్టేందుకు పూనుకున్నది. ఏకంగా మూడు నెలల ముందే వైన్సుల టెండర్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అంతేకాకుండా ఆదాయం కోసం దరఖాస్తు ఫీజును రూ. 3 లక్షలకు పెంచేసింది. షెడ్యూల్‌ను రెండు మూడు రోజుల్లో విడుదల చేయనున్నట్లు తెలిసింది.
ప్రస్తుతం ఉన్న మద్యం దుకాణాల లైసెన్సుల గడువు నవంబర్ 30వ తేదీతో ముగియనుంది. డిసెంబర్ 1వ తేదీ నుంచి మద్యం దుకాణాల ఏర్పాటు కానునన్నాయి. అయితే గతంలో ఒక నెల ముందు మాత్రమే టెండర్ నోటిఫికేషన్ విడుదలయ్యేది. ఈ కాలంలో నోటిఫికేషన్ జారీ, దరఖాస్తులు, డ్రా ప్రక్రియ జరిగేది. కానీ ఈ సారి ఏకంగా మూడు నెలల ముందే నోటిఫికేషన్ రావడం విశేషం. వరుసగా ఎన్నికలు జరిగే అవకాశం ఉండటం, ప్రభుత్వం వద్ద డబ్బులు లేకపోవడంతో ముందుగానే టెండర్ నోటిఫికేషన్ జారీ చేసినట్టు తెలుస్తున్నది. కాగా జిల్లాలో గతంలో 82 వైన్సులకు గానూ 3969 దరఖాస్తులు వచ్చాయి.
నిధులను సమాకుర్చుకోవడం కోసం ప్రభు త్వం అబారీ శాఖపైనే ఆధార పడింది. ఇందుకోసం దరఖాస్తు రుసుమును భారీగా పెంచింది. అప్లికేషన్ ఫీజును రూ.3 లక్షల నాన్ రిఫండబుల్‌గా నిర్ణయించింది. గతంలో దరఖాస్తు ఫీజు రూ.2 లక్షలు ఉండేది. అంటే ఒకో అప్లికేషన్‌పై 50శాతం పెంచారు. దరఖాస్తు దాఖలులో ఎలాం టి పరిమితులు లేవు. ఒక వ్యక్తి ఎన్ని దరఖాస్తులైనా చేసుకునే అవకాశం ఉంది.
కొత్త లైసెన్సులను లాటరీ ద్వారా ఎంపిక చేయనున్నారు. ఎం పికైన లైసెన్స్‌దారులు 6 స్లాబుల ద్వారా లైసెన్స్ ఫీజు చెల్లించేందుకు వీలు కల్పించారు. ఐదు వేలలోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో వార్షిక ఎక్సైజ్ పన్ను రూ.50 లక్షలుగా, 5,000 నుంచి 50,000 మధ్య జనాభా ఉన్న చోట రూ.55 లక్షలుగా, 50,000 నుంచి లక్ష జనాభా ఉన్న ప్రాంతాలకు రూ.60 లక్షలుగా, లక్ష నుంచి ఐదు లక్షల మధ్య జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.65 లక్షలుగా నిర్ణయించారు. ఐదు లక్షల నుంచి 20 లక్షల వరకు జనాభా ఉంటే రూ.85 లక్షలు, ఇక 20 లక్షల పైన జనాభా ఉన్న నగరాల్లో వార్షిక ఫీజు రూ. కోటి పది లక్షలుగా ఖరారు చేశారు. వార్షిక లైసెన్స్ రుసుమును ఆరు సమాన వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుంది. 25 నెలల లైసెన్స్ కాలానికి గానూ, పావు వంతు (25శాతానికి) సమానమైన బ్యాంకు గ్యారెంటీని ప్రభుత్వానికి సమర్పించాలి.
గతంలో బీఆర్ఎస్ హయాంలో వైన్స్ కేటాయింపుల్లో రిజర్వేషన్లు తీసుకొచ్చారు. ప్రస్తుతం ఆ విధంగానే మద్యం దుకాణాలు నడుస్తున్నాయి. దాని అనుగుణంగానే మళ్లీ రిజర్వేషన్లు అమలు చేయనున్నారు. గతంలో యాదాద్రిభువనగరి జిల్లాలో జనాభా ప్రాతిపదికన వైన్ షాపులకు రిజర్వేషన్లను నాలుగు విభాగాలుగా విభజించారు. ఎస్సీ ,ఎస్టీ, ఓపెన్ కేటగిరి, గౌడ సామాజిక వర్గం ఇలా నాలుగు కేటగిరీలుగా విభజించారు. మొత్తం 82 షాపుల్లో ఎస్సీ 7,ఎస్టీ 1, ఓపెన్ కేటగిరి 53, గౌడ 21 చొప్పున షాపుల వారీగా రిజర్వేషన్లను ప్రకటించారు. ఈ సారి కూడా ఇవే రిజర్వేషన్లు అమలయ్యే అవకాశం ఉంది.