నల్లగొండ, అక్టోబర్ 5 : నూరు శాతం సబ్సిడీతో చెరువుల్లో చేప పిల్లలను వదిలే విషయం ఇప్పట్లో తేలేలా లేదు. చెరువుల్లోకి ఇటీవల నీరు వస్తున్నప్పటికీ, మత్స్యకారుల నిరీక్షణ తర్వగా ఫలించేలా కనిపించడం లేదు. జిల్లాలో ఈ ఏడాది పెద్ద చెరువుల్లో సుమారు 3 లక్షల చేప పిల్లలు పోయడానికి గత నెల 19న టెండర్లు స్వీకరించారు. అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు కాంట్రాక్టర్లు బిడ్ వేశారు. వారి ఫిష్ సీడ్ ఫామ్స్‌ను బిడ్స్ ఓపెన్ అనంతరం జిల్లా మత్స్య శాఖ అధికారి పరిశీలించగా.. నలుగురు వద్ద పది లక్షల సీడ్ కూడా లేదని గుర్తించారు.
ఇదే విషయాన్ని జిల్లా మత్స్యశాఖ అధికారి చరిత కలెక్టర్‌తోపాటు ఆ శాఖ ఉన్నతాధికారులకు నివేదించారు. గతంలో రెండు సార్లు ఇలాగే జరుగడంతో టెండర్లు రద్దు చేసిన అదికారులు ఈసారి కూడా రద్దు చేస్తారా, లేదా అధికార పార్టీ ఆదేశాలకు తలొగ్గుతారా అనేది తేలాల్సి ఉంది. గతంలో టెండర్లు వేసిన వారి వద్ద సీడ్ అందుబాటులో ఉన్నప్పటికీ వారిని రానివ్వకుండా కాంగ్రెస్ పార్టీకి చెందిన కాంట్రాక్టర్లు మాత్రమే టెండర్లు వేసి ఆంధ్రా నుంచి చేప పిల్లలు ఎన్నోకొన్ని తెచ్చి చెరువుల్లో పోయాలనే ఆలోచనతో తమకే టెండర్ ఫైనల్ చేయాలని ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.
సీడ్ ఫామ్‌లో కనిపించని చేప పిల్లలు…
మత్స్యకారుల జీవన విధానం మెరుగుపడాలనే ఆలోచనతో బీఆర్ఎస్ ప్రభుత్వం జిల్లాలోని నీటి వనరుల్లో ఏటా రూ.5.50కోట్లు వెచ్చించి 6కోట్ల చేప పిల్లలను వదిలేది. గతంలో ఈ టెండర్లలో తెలంగాణతోపాటు ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారు పాల్గొనేవారు. ఎవరు తక్కువకు కోట్ చేస్తే వారికి టెండర్ ఫైనల్ చేసేవారు. ఈసారి ఇప్పటికే మూడు సార్లు రెండు లక్షల చొప్పున డీడీలు చెల్లించి పలువురు కాంట్రాక్టర్లు టెండర్లు వేయగా ఫామ్ లేకపోవడంతో రద్దు చేశారు.
ఈసారి గుర్రంపోడ్, మిర్యాలగూడ, నల్లగొండ, నకిరేకల్ ప్రాంతాలకు చెందిన నలుగురు కాంగ్రెస్ కాంట్రాక్టర్లు మాత్రమే సెప్టెంబర్19న టెండర్లు వేయగా, వారి బిడ్స్ ఓపెన్ చేసిన అదికారులు ఆయా కాంట్రాక్టర్లకు చెందిన ఫామ్స్ వెరికేషన్‌కు వెళ్లారు. ఏ ఒక్కరి దగ్గరా సీడ్ లేకపోవడంతో ఖంగు తిన్నారు. ఇద్దరు కాంట్రాక్టర్లు మాత్రం అధికారులు వస్తున్నారని పది లక్షల సీడ్ ఆంధ్రా నుంచి తెచ్చి వారి ఫామ్స్‌లో పోసినట్లు సమాచారం. ఫామ్స్‌లో సీడ్ లేకపోయినప్పటికీ ఆ నలుగురికే టెండర్ ఫైనల్ చేయాలని అధికార పార్టీ నేతలు మత్స్య శాఖ అధికారులకు హుకూం జారీ చేసినట్లు తెలిసింది.
అంగీలు చింపుకున్నవాళ్లే ఒక్కటై….
గత మూడు సార్లు టెండర్లు రద్దు చేయడంతో పలువురు కాంట్రాక్టర్లు సైడ్ అయ్యాక కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు కాంట్రాక్టర్లు మాత్రమే గత నెల 19న టెండర్ వేశారు. వారిలో ఒకరికొరికి పడక టెండర్ వేసే ముందే కలెక్టరేట్లోని మత్స్యశాఖ కార్యాలయంలో గల్లాలు పట్టుకుని అంగీలు చింపుకొన్నారు. ప్రధానంగా మత్య్యశాఖ నూతనంగా వేసిన కమిటీలో క్రియాశీలకంగా ఉన్న గుర్రంపోడ్ పాలకవర్గ సభ్యుడితోపాటు నల్లగొండలో ఓడిపోయిన కౌన్సిలర్ తీవ్రంగా గొడవ పడ్డారు.
ప్రస్తుతం ఏ ఒక్కరి దగ్గరా సీడ్ లేకపోవటంతో అందరివి రద్దు చేసే వరకు వచ్చింది. దాంతో ఆ నలుగురు ఒక్కటై తమకే ఆ కాంట్రాక్టు ఇవ్వాలనిమత్స్య శాఖ అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. మొత్తం సీడ్ వేకుండా ఆంధ్రాలోని కైకలూరు నుంచి ఎంతో కొంత తెచ్చి చెరువుల్లో పోసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ విషయమై మత్స్య శాఖ అధికారిని వివరణ కోరేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.