దామరచర్ల, జనవరి 5: రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న టీఎస్ ఐపాస్ విధానంతో పరిశ్రమలు తెలంగాణ వైపు చూస్తున్నాయి. దామరచర్ల మండలంలో కృష్ణా, మూసీ నదుల పరీవాహకం, భూలభ్యం, విరివిగా లైమ్‌స్టోన్ నిల్వలు ఉండటంతో ఈ ప్రాంతంలో పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామిక వేత్తలు ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో దామరచర్ల మండలం పరిశ్రమల హబ్‌గా మారనుంది. రాష్ట్ర ప్రభుత్వం రూ.30 వేల కోట్లతో యాదాద్రి పవర్‌ప్లాంటు ఏర్పాటు చేస్తుండడంతో మరిన్ని పరిశ్రమలు ఇక్కడికి తరలివస్తున్నాయి. ఇప్పటికే మండలంలో ఇండియా, పెన్నా సిమెంట్ కర్మాగారాలు ఉండగా, వీటితో పాటుగా చిన్నతరహా పరిశ్రమలైన ముగ్గు, పాలిష్ మిల్లులు అధికంగా ఏర్పాటు చేశారు.
1000 మందికి ఉద్యోగావకాశాలు..
ఫెర్రో ఎల్లాయిస్ కర్మాగారం ఏర్పాటు వల్ల 450 మంది శాశ్వత ఉద్యోగాలు, 500 మంది కాంట్రాక్టర్ ఉద్యోగావకాశాలు రానున్నాయి. వీటితోపాటుగా 10 వేల మంది ప్రత్యక్ష, పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. స్థానికులకే అధికంగా అవకాశాలు కల్పిస్తామని కర్మాగారం యాజమాన్యం ప్రకటించింది. దాంతో పాటుగా పరిశ్రమకు 10 కిలోమీటర్ల పరిధిలో గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపింది.
ప్లాంటు ఏర్పాటుకు గ్రామస్తులు వ్యతిరేకం
పవర్ యుటీలిటిస్ ప్లాంటులో తొలుతగా సోడి యం సాచరిన్ ప్లాంటు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అందుకు ప్రజాభిప్రాయ సేకరణ తేదీ ప్రకటించడంతో కాలుష్యపు సాచరిన్ కర్మాగారం గ్రామాల మధ్య ఏర్పాటు చేయవద్దని ఆయా గ్రా మస్తులు వ్యతిరేకించారు. గ్రామ పంచాయతీ తీర్మానాలతో పాటుగా అధికారులకు విన్నవించారు. దాంతో కర్మాగారం ఏర్పాటు విరమించుకొని నూతనంగా ఫెర్రోఎల్లాయిస్ స్టీల్ ప్లాంటు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు..
150 కోట్లతో సెంథి పరిశ్రమ
మండలంలోని వీర్లపాలెం-ముదిమాణిక్యం గ్రామాల మధ్య మరో సీడ్స్ కంపెనీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. సెంథినీ కర్మాగారం ఏర్పాటుకు 56 ఎకరాల భూమిని సేకరిస్తున్నారు. సుమారు రూ.100 నుంచి 150 కోట్లతో ప్లాంటు కు ఏర్పాట్లు చేయగా కాలుష్యం అధికంగా వస్తుందని రైతులు ఇచ్చిన భూములకు సరైన ధర ఇవ్వలేదని గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ప్లాంటు ఏర్పాటులో కొంత నిర్లిప్తత నెలకొంది. త్వరలోనే కర్మాగారం ఏర్పాటుకు సన్నాహాలు ముమ్మరం చేయనుంది.
మరుగున పడ్డ పరిశ్రమకు తిరిగి వెలుగులు
మండలంలోని ఇర్కీగూడెం, వాడపల్లి గ్రామాల మధ్య కృష్ణాతీరంలో కృష్ణాగోదావరి పవర్యుటిలిటిస్ పేరుతో 65 మెగావాట్ల రెండు బొగ్గు ఆధారిత పవర్ప్లాంట్లు నిర్మించేందుకు ఇర్కీగూడెం, వాడపల్లి గ్రామాల పరిధిలో సుమారు 172 ఎకరాల భూమిని సేకరించింది. 2007 ప్లాంటుకు భూమి పూజ చేశారు. 90 శాతం పనులు పూర్తి చేసుకొని ఆర్థిక ఇబ్బందులతోపాటుగా పలు కారణాలతో పనులు నిలిచిపోయాయి. దశాబ్ద కాలంగా పనులు నిలిచిపోవడంతో కర్మాగారం మరుగున పడిపోయింది. ఈ పరిశ్రమలను ఆంధ్రా పారిశ్రామిక వేత్తలు కొనుగోలు చేసి పవర్ప్లాంటుతో పాటుగా మరో ఫెర్రో అల్లాయిస్ స్టీల్‌ప్లాంటు నిర్మిస్తున్నారు.
పరిశ్రమలు ప్రజలకు ఉపయోగ కరంగా ఉండాలి
దామరచర్ల, జనవరి 5: మండలంలో కొత్తగా నెలకొల్పే పరిశ్రమలు ప్రజలకు ఉపయోగ కరంగా ఉండాలని మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు అన్నారు. మండలంలోని వాడపల్లి-ఇర్కిగూడెం గ్రామాల మధ్య నెలకొల్పుతున్న కృష్ణాగోదావరి పవర్ యుటిలిటీస్, ఫెర్రోఅల్లాయిస్ కర్మాగారం ఏర్పాటు కోసం జిల్లా పర్యావరణ శాఖ ఆధ్వర్యంలో గురువారం ప్రజాభిప్రాయ సేకరణలో జరిగింది. కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడుతూ పరిశ్రల ఏర్పాటును ఎలాంటి అభ్యంతరాలు లేవని, రాష్ట్రం అభివృద్ధ్ది చెందాలంటే పరిశ్రమలు అవరమన్నారు. అయితే పరిశ్రమ యాజమాన్యం ముందుగా ప్రాజెక్టు రిపోర్టులో ప్రకటించిన నిబంధనలను తప్పకుండా పాటించాలని, హామీలను నెరవేర్చాలని వాటిని విస్మరిస్తే ప్రజల తరపున పోరాడుతానన్నారు. పరిశ్రమ సమీపంలో ఉన్న భూములకు నష్టం వాటిల్లితే మార్కెట్ ధర ప్రకారం రైతులకు చెల్లించి కొనుగోలు చేయాలన్నారు. పరిశ్రమ కోసం ఏర్పాటు చేసిన ప్రజాభిప్రాయ సేకరణలో వాడపల్లి, ఇర్కిగూడెం, దామరచర్ల పలు గ్రామాల ప్రజలు పాల్గొని అనుకూలంగా తమ అభిప్రాయాలు వ్యక్తంచేశారు
క్రోమియం లేకుండా చూడాలి
ఫెర్రోస్ అల్లాయిస్ పరిశ్రమ ఏర్పాటులో క్రోమియం, యాష్ నిల్వలు లేకుండా చూ డాలన్నారు. కేవలం అరకిలోమీటర్ల పరిధిలోనే కృష్ణానది ఉండటం వల్ల కాలుష్యం అందులో కలసే అవకాశం ఉందని, పులిచింతల ప్రాజెక్టు నిర్మాణంతో నీరు నిలిచి ఉందనీ కాలుష్యం నదిలో కలిస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందనీ కాలుష్యం లేకుండా చర్యలు తీసుకోవాలనిపలువురు తెలిపారు. కార్యక్రమంలోఅదనపు కలెక్టర్ భాస్కర్‌రావు, ఆర్డీఓ చెన్న య్య, జడ్పీటీసీ లలిత, వాడపల్లి, ఇర్కిగూడెం సర్పంచులు మధవి, లొట్లపల్లి నాగేంద్రం, ఎంపీటీసీలు ఆర్ సైదులు, అనంతలక్ష్మి, లత, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు వీరకోటిరెడ్డి, పలువురు ఎన్జీఓలు, ప్రజలు పాల్గొన్నారు.
రూ.720 కోట్లతో ఫెర్రో అల్లాయిస్ కర్మాగారం
గతంలో ఇక్కడ మరుగున పడిన కృష్ణాగోదావరి పవర్ యుటిలిటిస్ను కొత్తగా ఆంధ్రాకు చెందిన పారిశ్రామిక వేత్తలు కొనుగోలు చేశారు. వీటిలో 90 శాతం పనులు పూర్తి చేసుకొని నిలిచిపోయిన రెండు పవర్ప్లాంట్లను పూర్తి చేసి 130 మెగావాట్ల విద్యుత్తుతో 169.85 ఎకరాల్లో ఎకరాల్లో స్టీల్ తయారీకి అవసరమయ్యే ముడి సరుకును తయారు చేసేందుకు కర్మాగారాన్ని సిద్ధం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో లభించే లైమ్‌స్టోన్‌తో క్యాల్షియం కార్భైడ్ తయారు చేస్తారు. వీటితో పాటుగా సిల్కో మాంగనీస్, హైకార్భన్ ఫెర్రోక్రోమ్, ఫెర్రో సిల్కాన్, పిగ్ ఐరన్ ప్రాసెస్లు జరుపుతారు. ఎంఎస్ ఇంగోట్స్, బిల్లెట్స్, రోలింగ్ మిల్లు, బొగ్గు ఆధారిత పవర్‌ప్లాంటు ఏర్పాటు చేసి వీటి ద్వారా ఫెర్రో ఎల్లాయిస్, స్పెషల్ స్టీల్‌కు అవసరమయ్యే ముడి సరుకును తయారు చేస్తారు. వీరికి కావాల్సిన ముడిసరుకును ఒడిశా, కర్ణాటక రాష్ర్టాల నుంచి దిగుమతి చేసుకుంటారు. ఈ కర్మాగారానికి అవసరమయ్యే నీటిని సమీప కృష్ణానది నుంచి వినియోగించుకుంటారు.