చిట్యాల, జనవరి 5 : దేశంలో ఉచిత కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. చిట్యాల మున్సిపాలిటీలో రూ.3కోట్లతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు గురువారం ఆయన ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, జడ్పీ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో కలిసి శంకుస్థాపన చేశారు.
అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌పై అక్కసుతోనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నదని విమర్శించారు. రాష్ర్టాభివృద్ధికి అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. దేశానికి శనిలా దాపురించిన ప్రధాని మోదీ ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కొక్కటిగా అమ్ముతున్న దుర్మార్గుడని పేర్కొన్నారు. మోదీ ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా రైతన్న మోటర్లకు మీటర్లు పెట్టనివ్వని దమ్మున్న నాయకుడు సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు.
అత్యధికంగా ధాన్యం పండించి దేశానికే అన్నం పెట్టిన రాష్ట్రంగా తెలంగాణ విరజిల్లుతుందన్నారు. రాష్ట్ర అభివృద్ధి దేశమంతా జరగాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని తీసుకొచ్చారని తెలిపారు. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సారథ్యంలో మున్సిపాలిటీలకు అత్యధిక నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేస్తున్నారని కొనియాడారు. ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, జడ్పీ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సారథ్యంలో నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు.
చిట్యాల మున్సిపాలిటీ అభివృద్ధికి, అయిటిపాముల లిఫ్టుకు నిధులు మంజూరు చేసిన ఘనత ఎమ్మెల్యే చిరుమర్తిదేనని పేర్కొన్నారు. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి యావత్ దేశమంతా కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటుందన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అందని గడప తెలంగాణలో లేదన్నారు.
సీఎం కేసీఆర్ ఆశీస్సులతో, మంత్రి కేటీఆర్ సహకారంతో చిట్యాల పట్టణంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేశానని తెలిపారు. ఇప్పటికే రూ.20కోట్లతో చిట్యాల పట్టణాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేసినట్లు తెలిపారు. పని చేసే నాయకులకు, ప్రభుత్వానికి ప్రజలు ఎల్లప్పుడు అండగా ఉండాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకట్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సభలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రాందుర్గారెడ్డి, ఎంపీపీ కొలను సునీతావెంకటేశ్, జడ్పీటీసీ సుంకరి ధనమ్మాయాదగిరి, మార్కెట్ కమిటీ చైర్మన్ జడల ఆదిమల్లయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ కూరెళ్ల లింగస్వామి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పొన్నం లక్ష్మయ్య, జిట్ట చంద్రకాంత్, కౌన్సిలర్లు కోనేటి కృష్ణ, సిలువేరు మౌనికాశేఖర్, పందిరి గీతారమేశ్, జిట్ట పద్మాబొందయ్య, బెల్లి సత్తయ్య, బీఆర్ఎస్ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అయిలయ్య, కల్లూరి మల్లారెడ్డి పాల్గొన్నారు.