నేరేడుచర్ల, డిసెంబర్ 22 : మత సామరస్యానికి ప్రతీకగా రాష్ట్రం నిలుస్తున్నదని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. క్రిస్మస్ వేడుకను పురస్కరించుకుని స్థానిక ఎస్కేఎస్ ఫంక్షన్ హాల్లో గురువారం ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి క్రైస్తవ మైనార్టీ ప్రేమ విందు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. క్రైస్తవులకు బైబిలే భక్తి మార్గం చూపిస్తుందని, ప్రభువు చెప్పిన మాటలను పరిగణలోకి తీసుకుని ఆచరణలో పెట్టాలన్నారు. దేశ ప్రజల సంక్షేమానికే సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చారన్నారు. సీఎం కేసీఆర్ ప్రధాని కావాలని ప్రతి ఒక్కరూ చూస్తున్నారన్నారు. అందుకోసం క్రైస్తవ సోదరులు ప్రార్థనలు చేయాలని సూచించారు. కుల, మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజల ముఖ్యమైన పండుగలను ప్రభుత్వమే అధికారికంగా చేస్తూ కానుకలు అందిస్తున్నదన్నారు. అలాంటి ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌కు ప్రతిఒక్కరూ అండగా నిలవాలని కోరారు. ఏడు మండలాల్లో క్రిస్టియన్ సోదరుల సౌకర్యార్థం ఫ్రీజర్ బాక్సులు మంజూరు చేస్తానన్నారు. గ్రామ పంచాయతీల పరిధిలో చర్చిల నిర్మాణాల అనుమతులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూస్తానన్నారు. క్రిస్టియన్ మైనార్టీల కమ్యూనిటీ హాల్స్ నిర్మాణాలకు ప్రభుత్వ స్థలాలను గుర్తించాలని తాసీల్దార్లను ఆదేశించారు.
దొండపాడులో క్రిస్టియన్ క్రిమేషన్‌కు వెళ్లేందుకు పడుతున్న ఇబ్బందులను గుర్తించి వాగుపై రూ.35లక్షలతో చేపట్టిన వంతెన నిర్మాణం పూర్తయ్యిందని, త్వరలో ప్రారంభిస్తామన్నారు. దళిత బంధులో అర్హులైన 10మందికి ప్రాధాన్యం ఇస్తామని, మరి కొంత మందికి హుజూర్‌నగర్‌లో పంపిణీ చేసే ఇండ్ల మంజూరులో ప్రాధాన్యం కల్పిస్తామన్నారు. అనంతరం క్రిస్మస్ కేక్ కట్ చేశారు. అంతకుముందు మున్సిపాలిటీ పరిధిలోని నర్సయ్యగూడెం సమీపంలో ఉన్న క్రిస్టియన్ సమాధుల తోటకు కావాల్సిన ప్రహరీ పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చందమళ్ల జయబాబు, వైస్ చైర్పర్సన్ చల్లా శ్రీలతారెడ్డి, నేరేడుచర్ల, గరిడేపల్లి ఎంపీపీలు లకుమళ్ల జ్యోతీభిక్షం, పెండెం సుజాత, జడ్పీటీసీలు రాపోలు నర్సయ్య, సైదిరెడ్డి, వైస్ ఎంపీపీ తాళ్లూరి లక్ష్మీనారాయణ, డీసీసీబీ డైరెక్టర్ దొండపాటి అప్పిరెడ్డి, నేరేడుచర్ల, పాలకవీడు, మేళ్లచెర్వు తాసీల్దార్లు సరిత, శ్రీదేవి, దామోదర్, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, ఆర్ఐ ప్రవీణ్, పాస్టర్లు సుధాకర్, ఆంద్రయ్య, పిలిఫ్, నతానియల్, ఉదయ్‌బాబు పాల్గొన్నారు.