– సీతారామతో జిల్లా రైతులకు జరుగుతున్న అన్యాయంపై మంత్రులు సమాధానం చెప్పాల్సిందే
బూర్గంపహాడ్, జూలై 16 : అక్రమ అరెస్టులతో పోరాటం ఆపలేరని, సీతారామ ప్రాజెక్టుతో ఈ జిల్లా రైతులకు జరుగుతున్న అన్యాయంపై మంత్రులు సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. బీఆర్ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు పిలుపు నేపథ్యంలో అశ్వాపురంలో సీతారామ ప్రాజెక్టును సందర్శించేందుకు వస్తున్న మంత్రులను రైతులకు జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నించేందుకు సిద్ధమైన బీఆర్ఎస్ నేతలను పోలీసులు ఇళ్లకు వెళ్లి మరీ అదుపులోకి తీసుకోవడం దారుణమని నాయకులు ఆరోపించారు. రైతు సమస్యలపై ప్రశ్నించేందుకే నిర్బంధ చర్యలకు పాల్పడటం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. సీతారామ ప్రాజెక్టును ఇప్పటికే పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేకపోవడంతో ఈ జిల్లా రైతులు తమ భూములకు సాగునీటి కోసం ఎంతో ఎదురుచూస్తున్నారని…ఇదే సమయంలో ఈ ప్రాంత రైతులకు అన్యాయం చేస్తూ పక్క జిల్లా రైతులకు సాగునీరు అందించేలా ముగ్గురు మంత్రులు వ్యవహరించడం సిగ్గుచేటన్నారు.
సీతారామ ద్వారా అశ్వాపురం, బూర్గంపహాడ్ మండలాలతో పాటు ఈ ప్రాంత రైతాంగానికి సాగునీరు అందించేంతవరకు రైతుల తరఫున | బీఆర్ఎస్ పోరాటం ఆగదని హెచ్చరించారు. సీతారామను పూర్తిచేసి ఆయకట్టు రైతాంగానికి సాగునీరు ఇచ్చాకే ఇక్కడి నీటిని మరో జిల్లాకు తరలించాలని లేనిపక్షంలో రైతులతో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ముందస్తు అరెస్టు అయిన వారిలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కొనకంచి శ్రీను, యూత్ నాయకులు గోనెల నాని, చల్లకోటి పూర్ణ, సోము లక్ష్మిచైతన్యరెడ్డి, మండల నాయకులు దారం కృష్ణారెడ్డి, బెజ్జంకి కనకాచారి, కర్రి నాగేశ్వరరావు, గుల్ మహ్మద్, బానోతు శ్రీను, పంగి సురేష్, మోహన్, ఈశ్వర్, పాటి అశోక్, భూక్యా కృష్ణ, సతీష్, కుర్సం వెంకన్న ఉన్నారు.

‘అక్రమ అరెస్టులతో పోరాటం ఆగదు’