దేవరకొండ, జూలై 5 :దశాబ్దాల తరబడి గిరిజనులు సాగు చేసుకుని బతుకున్న పోడు భూములకు పట్టాలు పంపిణీ చేయడంలో తెలంగాణ దేశానికే రోల్ మోడల్‌గా నిలుస్తున్నదని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. బుధవారం దేవరకొండ నియోజకవర్గంలోని 1,138 మంది లబ్ధిదారులకు పోడు పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రవీంద్రకుమార్ మాట్లాడుతూ గిరిజనుల అరవయ్యేండ్ల కలను ముఖ్యమంత్రి సాకారం చేశారని కొనియాడారు. తండాలను పంచాయతీలుగా గుర్తించడంతోపాటు అభివృద్ధికి నిధుల కేటాయింపు, గిరిజనులకు రిజర్వేషన్ల పెంపు వంటివి సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమయ్యాయని గుర్తుచేశారు. పోడు పట్టాలు అందుకున్న రైతులకు రైతు బంధు, రైతుబీమా వర్తిస్తాయని తెలుపడంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు.
పోడు భూముల పట్టాల పంపిణీలో తెలంగాణ దేశానికే రోల్ మోడల్ అని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. బుధవారం దేవరకొండ పట్టణంలో నియోజకవర్గంలోని 1138 మంది లబ్ధిదారులకు పోడు భూముల పట్టాలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తీసుకున్న పోడు భూముల పట్టాల పంపిణీ నిర్ణయంతో గిరిజనుల అరవై ఏండ్ల కల నెరవేరిందన్నారు. పట్టాలు పొందిన పోడు రైతులకు రైతుబంధుతోపాటు రైతుబీమా వర్తిస్తుందని తెలిపారు. 500 జనాభా ఉన్న తండాలను గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన గ్రామాపంచాయతీల్లో నూతన భవనాల నిర్మాణానికి రూ.20లక్షల చొప్పున నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. గిరిజల రిజర్వేషన్‌ను 10 శాతానికి పెంచిన మహనీయుడు సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు. అంతకు ముందు పోడు పట్టాలు పొందిన రైతులు, గిరిజనులతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ గోపీరాం, ఎంపీపీలు వంగాల ప్రతాప్‌రెడ్డి, జడ్పీటీసీలు కేతావత్ బాలూనాయక్, బుజ్జి, పీఏసీఎస్ చైర్మన్ వల్లపురెడ్డి, ఏటీడీఓ రాజ్‌కుమార్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు టీవీఎన్ రెడ్డి, రాజినేని వెంకటేశ్వర్రావు, రైతు బంధు సమితి కన్వీనర్ బోయపల్లి శ్రీనివాస్‌గౌడ్, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
చందంపేటలో..
చందంపేట : పోడు భూములకు పట్టాలు ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేస్తూ మండలంలోని బొల్లారం గ్రామంలో బుధవారం సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ పార్వతీమకట్లాల్ మాట్లాడుతూ ఎన్నో ఏండ్లుగా పరిష్కారానికి నోచని పోడు భూముల సమస్యను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించిందన్నారు. పట్టాలతోపాటు రైతుబంధు, రైతుబీమా ఇవ్వడం హర్షణీయమన్నారు. పట్టాలు ఇచ్చిన సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో లాల్‌సింగ్, చంద్రబాబు, మాతృ, పంతు, లక్ష్మి, బుజ్జి పాల్గొన్నారు.
అరవై ఏండ్ల కల నెరవేరింది
పోడు భూములకు పట్టాలు పంపిణీ చేయడంతో అరవై ఏండ్ల కల నెరవేరింది. ఎన్నో ఏండ్లుగా నోచని పోడు భూములకు పట్టాలు అందుకోవడం ఆనందగా ఉంది. పట్టాలు పంపిణీ చేసిన ప్రభుత్వానికి జీవితాంతం రుణపడి ఉంటాం. పట్టాలు ఇచ్చి మమ్మల్ని ఆదుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఎప్పటికీ మరువం.
–కేతావత్ పుటాని, బొల్లారం, చందంపేట మండలం
కేసీఆర్ సార్ మేలు జీవితంలో మర్చిపోం
నాగార్జునసాగర్ ప్రాజెక్టులో మా ఊరు మునిగిపోతే ఓ గట్ట్టుకు వచ్చి బతుకుతున్నం. అటవీ భూములు సాగు చేసుకుని పొట్ట పోసుకుంటుంటే అధికారులు వచ్చి ఇబ్బందులు పెట్టేవాళ్లు. ఇప్పుడు ఆ భూములకు పట్టాలు అందించి హక్కు కల్పించడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ దేవుడిలా మా బాధలు అర్ధం చేసుకున్నడు. ఈ మేలును జీవితంలో మర్చిపోం.
–కేతావత్ గమ్య, చౌటుట్ల, చందంపేట మండలం