నీలగిరి, ఏప్రిల్ 17: జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగతో నిప్పుల కొలిమిలా మారుతోంది. జిల్లా ప్రజలు ఉష్ణ తాపానికి తట్టుకోలేక అల్లాడుతున్నారు. పది రోజులుగా అత్యధికంగా 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలోనే నల్లగొండ జిల్లాలోని అడవిదేవులపల్లిలో 43.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. జిల్లా వ్యాప్తంగా 40 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ఉదయం తొమ్మిది గంటల నుంచే జనం బయటకు రావాలంటే జంకుతున్నారు. రాత్రి పదైనా ఇండ్లు చల్లబడటం లేదు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇండ్లల్లో ఉన్నా ఉక్కపోతను తట్టుకోలేపోతున్నారు. ఈ ఎండలు మే చివరి వరకు తీవ్రమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈసారి వానలు సరిగా లేకపోవడం కూడా ఉష్ణోగ్రత పెరుగుదలకు కారణమైంది.
నిప్పుల కుంపటిగా జిల్లా..
ఉష్ణోగ్రతలు రోజురోజుకూ తీవ్ర స్థాయిలో పెరిగిపోతున్నాయి. భానుడు ఆరు రోజుల నుంచి తన ప్రతాపం చూపుతూన్నాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో నల్లగొండ నిప్పుల కుంపటిగా మారింది. ఈ వేసవిలో మొదటిసారి గరిష్ట ఉష్ణోగ్రత 40.0 డిగ్రీలకు చేరింది. ఇది మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఉదయం 8.30 నుంచే వేడి గాలులు వీస్తున్నాయి. పది గంటల నుంచే రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. సాయంత్రం అయిదు గంటల వరకూ వేడిగాలులు తగ్గడం లేదు.
తప్పని పరిస్థితుల్లోనే జనం బయటకు వస్తున్నారు. చిరు వ్యాపారులు రోడ్ల మీద అమ్ముకోలేని పరిస్థితి. ఎండలతో వ్యాపారం మందగించింది. కేవలం జ్యూస్ బండ్లు, కొబ్బరి బొండాలు, చల్లని పానీయాలకే గిరాకీ పెరిగింది. మరోపక్క విద్యుత్ కోతతో జనం ఉబ్బరింతకు గురై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మార్చి చివరి వారం నుంచి గరిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే జిల్లాలో వడదెబ్బ మృతుల సంఖ్య గత సంవత్సరం కంటే పెరిగే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలతో పాటు వేడి గాలులు వీస్తుండటంతో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. వేసవిలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఉదయం తొమ్మిది దాటితే..
సాధారణంగా ఫిబ్రవరి నుంచి మే వరకు ఎండాకాలం ఉన్నప్పటికీ ఏప్రిల్ చివరిలో లేదా మేలో ఎండల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈసారి వర్షాభావ పరిస్థితుల కారణంగా నెల రోజుల ముందే ఎండల తీవ్రత మొదలైంది. పది రోజులుగా ఎండ ప్రభావం కారణంగా జనం బయటకు వెళ్లలేకపోతున్నారు. విద్యా సంస్థలు మధ్యాహ్నం వరకు ఉంటుండగా, పిల్లలు ఇంటికొచ్చే సమయంలో చాలా ఇబ్బంది పడాల్సి వస్తోంది. వారం రోజులుగా గరిష్ట ఉష్ణోగ్రతలతోపాటు కనిష్ట ఉష్ణోగ్రతల్లో ఎలాంటి మార్చులు లేకుండా నమోదు అవుతున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు 40 నుంచి 43 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రతలు 25 నుంచి 27 డిగ్రీల వరకు నమోదు అవుతున్నాయి. ఇప్పటి వరకు వడగాల్పుల ప్రారంభం కాకపోయినప్పటికీ ఎండలకు తోడు ఉక్కపోత ప్రారంభమైంది.