నల్లగొండ ప్రతినిధి, జనవరి 30 (నమస్తే తెలంగాణ) : మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సమక్షంలో యాదాద్రి భువనగిరి జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డిపై జరిగిన దాడి పట్ల సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ఉమ్మడి జిల్లాలోని పలుచోట్ల బీఆర్ఎస్ శ్రేణులు నిరసనలకు దిగారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు. మంత్రి ఆదేశాలతో పోలీసులు వ్యవహరించిన తీరుపై మంగళవారం బీఆర్ఎస్ నేతలు డీజీపీకి ఫిర్యాదు చేశారు. మంత్రి హోదాను మర్చి వ్యవహరించిన కోమటిరెడ్డి తీరు దుర్మార్గమని ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ ఖండించారు. ప్రజాస్వామానికే మచ్చ లాంటి ఘటన అని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రవీంద్రకుమార్ వ్యాఖ్యానించారు.
బీబీనగర్ మండలం గూడూరు గ్రామ పంచాయతీ భవన ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యవహరించిన తీరును బీఆర్ఎస్ సీరియస్‌గా తీసుకుంది. జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధుల ఎదుటే జిల్లాలోనే అత్యున్నత ప్రొటోకాల్ కలిగిన జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డిపై దాడికి పురిగొల్పడాన్ని తీవ్ర చర్యగా భావిస్తూ రంగంలోకి దిగింది. ఘటన జరిగిన వెంటనే సోమవారమే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. గ్యారెంటీల అమలును కోరితే దాడులు చేయిస్తారా అని ప్రశ్నించారు. సందీప్‌రెడ్డితో ఫోన్లో మాట్లాడి జరిగిన విషయాన్ని తెలుసుకున్నారు. మంత్రి కోమటిరెడ్డి అహంకారపూరిత ధోరణిని తీవ్రంగా ఖండించారు. మాజీ మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి సందీప్‌రెడ్డితో మాట్లాడి కోమటిరెడ్డి వ్యవహారశైలిపై తీవ్రంగా స్పందించారు.
మంత్రి స్థాయిని మర్చి దిగజారి ప్రవర్తించడం మంచిదికాదంటూ హితువు పలికారు. ఇక మంగళవారం ఇదే ఘటనపై బీఆర్ఎస్ జిల్లా ముఖ్యులతో కలిసి రాష్ట్ర పార్టీ ప్రతినిధులు, ఎలిమినేటి సందీప్‌రెడ్డి రాష్ట్ర డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు. జరిగిన ఘటనను వివరిస్తూ, మంత్రి వ్యవహార శైలిని, పోలీసుల అత్యుత్సాహాన్ని తీవ్రంగా ఆక్షేపిస్తూ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ ఎల్.రమణతోపాటు ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, జడ్పీ చైర్మన్లు బండా నరేందర్‌రెడ్డి, గుజ్జ దీపికా యుగేంధర్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు భాస్కర్‌రావు, కంచర్ల భూపాల్‌రెడ్డి, శానంపూడి సైదిరెడ్డి డీజీపికి ఫిర్యాదు చేసిన వారిలో ఉన్నారు. ఇక నల్లగొండ పట్టణంలో బీఆర్ఎస్వీ నేత బొమ్మరబోయిన నాగార్జున ఆధ్వర్యంలో, బొమ్మలరామారంలో బీఆర్ఎస్ శ్రేణులు సందీప్‌రెడ్డిపై దాడికి నిరసనగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఉమ్మడి జిల్లా అంతటా కోమటిరెడ్డి వ్యవహారశైలి చర్చనీయాంశంగా మారింది.