తెలంగాణ ఉద్యమ కెరటం దివికేగిండు.. స్వరాష్ట్ర సాధన కోసం గల్లీ నుంచి ఢిల్లీ దాకా రణభేరీ చేసిన రణన్నినాథుడు నేలకొరిగిండు. మన సంస్కృతి, మన కట్టుబొట్టు, భాష, యాస అని నినదించిన తెలంగాణ గొంతుక ఆగిపోయింది.. యువతను ఏకం చేసి ఉద్యమాన్ని ఉర్రూతలూగించిన యువ గళం మూగబోయింది.. ఆపదలో అన్న అనగానే ఆదుకునే పేదోళ్ల వేగుచుక్క నేలరాలింది. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ఆస్తులను తెగనమ్మి.. నమ్మిన సిద్ధాంతం కోసం పోరాడిన గుండె నిట్టూర్చింది.
ఉద్యమకారుడు, బీఆర్ఎస్ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి కన్నుమూశారు. గత కొంత కాలంగా బ్రెయిన్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న ఆయన వెంటిలేటర్‌పై మృత్యువుతో పోరాడి శుక్రవారం ఉదయం 11.47 గంటలకు తుదిశ్వాస విడిచారు. దీంతో భువనగిరితోపాటు ఉమ్మడి నల్లగొండ జిల్లా శోకసంద్రంలో ముగినిపోయింది.
యాదాద్రి భువనగిరి, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ నేత జిట్టా బాలకృష్ణారెడ్డికి అశ్రునయనాల మధ్య అంతిమ వీడ్కోలు పలికారు. శుక్రవారం ఉదయం మరణించిన తర్వాత హైదరాబాద్ నుంచి అంబులెన్స్‌లో భువనగిరి తీసుకొచ్చారు. ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, అభిమానులు, బంధువులు, కుటుంబ సభ్యుల సందర్శనార్థం ఆయన ఫామ్‌హౌస్‌లో పార్థివ దేహాన్ని ఉంచారు.
ఈ సందర్భంగా పలువురు ఆయన పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిట్టా కుటుంబ సభ్యులను ఓదార్చారు. దాంతో జిట్టా ఫామ్‌హౌస్ పెద్ద ఎత్తున తరలివచ్చిన జనంతో నిడిపోయింది. ఎక్కడ చూసినా తండోపతండాలుగా వచ్చిన జనమే కనిపించారు. ఈ క్రమంలో బాలకృష్ణారెడ్డి అంతిమ యాత్రకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేశారు. సాయంత్రం తర్వాత ఆయన పార్థివ దేహాన్ని పూలతో అలంకరించి వైకుంఠ రథంపైకి చేర్చారు.
పుష్పాంజలి ఘటించిన కుటుంబ సభ్యులు, అభిమానులు పార్థివదేహం ఫామ్‌హౌస్ నుంచి కదిలి వెళ్తుండగా ఒక్కసారిగా ఉద్వేగానికి లోనయ్యారు. ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి జిట్టా పాడె మోశారు. అటు నుంచి అంతిమ యాత్ర ప్రారంభమై.. పట్టణం మీదుగా జిట్టా సొంతూరైన భువనగిరి మండలంలోని బొమ్మాయిపల్లి వరకు కొనసాగించారు. ఆయన అభిమానులు, నేతలు వాహనం ముందు నడిచారు. అనంతరం బొమ్మాయిపల్లి వైకుంఠ ధామంలో ఆయన అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా రోడ్లన్నీ జనసంద్రంగా మారాయి. ఆయా మార్గాల్లో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యింది.
ఆవేదనలో అభిమానులు
జిట్టా మరణవార్తతో భువనగిరితోపాటు ఆలేరు నియోజకవర్గాల ప్రజలు శోక సంద్రంలో మునిగిపోయారు. అంతే కాకుండా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆవేదనకు గురయ్యారు. ఎక్కడ చూసినా జిట్టా మరణ వార్త గురించే చర్చించుకున్నారు. అందరినీ ప్రేమ, ఆప్యాయతలతో మాట్లాడే వ్యక్తి, మంచి గుణం ఉన్న ప్రజానేత మరణవార్తతో కంటనీరు పెట్టుకుంటున్నారు. భువనగిరికి ఆయన చేసిన సేవా కార్యక్రమాలను గుర్తు చేసుకున్నారు. భువనగిరితోపాటు తెలంగాణ వ్యాప్తంగా జిట్టా ఉద్యమ ప్రస్తానం, పోరాటాన్ని నెమరువేసుకున్నారు.
కోమటిరెడ్డి, హరీశ్‌రావు, జగదీశ్ రెడ్డి నివాళి
జిట్టా బాలకృష్ణారెడ్డి పార్థివ దేహానికి పలువురు ప్రముఖులు నివాళుల్పరించారు. రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మాజీ మంత్రులు హరీశ్‌రావు, గుంటకండ్ల జగదీశ్ రెడ్డి వేర్వేరుగా జిట్టా పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. నివాళులర్పించిన వారిలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్సీలు కోదండరాం, తీన్మార్ మల్లన్న, జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, మాజీ మంత్రి ఎలిమినేటి ఉమా మాధవరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీతామహేందర్ రెడ్డి, పైళ్ల శేఖర్ రెడ్డి, గాదరి కిశోర్‌కుమార్, కంచర్ల భూపాల్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు క్యామ మల్లేశ్, గొంగిడి మహేందర్ రెడ్డి, చెరుకు సుధాకర్, ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ జిట్టా పార్థివ దేహానికి నివాళులర్పించారు.
జిట్టా అంత్యక్రియలు అధికారికంగా నిర్వహించాలని ఆందోళన
భువనగిరి కలెక్టరేట్ : ఉద్యమ నాయకుడు జిట్టా బాలకృష్ణారెడ్డి అత్యక్రియలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఆయన అభిమానులు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్యను అడ్డుకున్నారు. జిట్టా పార్థివ దేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చేందుకు వచ్చిన మంత్రిని బాలకృష్ణారెడ్డి అభిమానులు అడ్డుకొని నినాదాలు చేశారు. తెలంగాణ ఉద్యమంలో చివరి వరకు పోరాటం చేసిన, ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టిన జిట్టా అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించి సముచిన గౌరవం కల్పించాలని కోరారు. అంతకు ముందు తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద జిట్టా అభిమానులు నిరసన వ్యక్తం చేసి అధికారి లాంఛనాలతో అంత్యక్రియలు చేపట్టాలని డిమాండ్ చేశారు.