మిర్యాలగూడ, జూలై 14: గ్రామాల్లో పాలన అస్తవ్యస్తంగా మారి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ జిలా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీందర్ అన్నారు. సోమవారం పట్టణంలోని రెడ్డికాలనీలో ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావుతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో సర్పంచ్ల పాలన ముగిసి సంవత్సరం దాటినా కాంగ్రెస్ ప్రభుత్వం నిత్యం ఏదో ఒక నెపంతో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ వస్తోందన్నారు.
ఎమ్మెల్సీ కవిత బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని పోరాటం చేస్తున్నారని, దాన్ని జీర్ణించుకోలేకనే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆమెపై అసభ్య పదజాలంతో దుర్భాషలాడారని అన్నారు. కవితకు వెంటనే తీన్మార్ మల్లన్న క్షమాపణలు చెప్పాలన్నారు. బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద తలపెట్టిన ధర్నాకు బీఆర్ఎస్ పూర్తి మద్దతు ఇస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి సభలో బీసీ డిక్లరేషన్ పేరుతో ఇచ్చిన హామీ మేరకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు.
సీఎం బీసీలకు రిజర్వేషన్లు రాకూడదనే కుట్ర చేస్తున్నారని, హైకోర్టు సెప్టెంబర్‌లోపు స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేయాలని మొట్టికాయలు వేసినప్పటికీ రిజర్వేషన్ల అమలును సాగదీస్తూ ఎన్నికలను వాయిదా వేసేందుకు చూస్తున్నారని అన్నారు. శ్రీశైలం రిజర్వాయర్‌లో పుష్కలంగా నీరు ఉన్నప్పటికీ రాష్ట్రంలో చెరువులు, కుంటలు ఎందుకు నింపలేదన్నారు.
అదేవిధంగా నాగార్జునసాగర్‌కు పెద్ద ఎత్తున వరదనీరు వస్తోందని ఎస్ఎల్బీసీ ద్వారా నీటిని విడుదల చేసి నల్లగొండలోని అనేక చెరువులు, కుంటలు నింపేందుకు అవకాశం ఉన్నప్పటికీ నిర్లక్ష్యం వహిస్తూ నల్లగొండను ఎండబెడుతున్నారని అన్నారు. నల్లగొండ జిల్లాకు నీరందించకుండా ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్‌కు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావులు అక్రమంగా నీటిని తరలించుకెళ్తున్నప్పటికీ రాష్ట్ర ఇరిగేషన్, జిల్లా మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చోద్యం చూస్తున్నారని, దీంతో నల్లగొండ జిల్లా రైతులు సాగునీరు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
డిండి ఎత్తిపోతల పథకానికి నాడే కేసీఆర్ శంకుస్థాపన చేశారని, ఇప్పుడు తిరిగి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేస్తున్నారన్నారు. రిజర్వాయర్ల పనులు 90 శాతం పనులు పూర్తయ్యాయని, తిరిగి ఆ పనులకు శంకుస్థాపన చేయడం విడ్డూరమన్నారు. కార్యక్ర మంలో మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, రైతుబంధు సమితి జిల్లా మాజీ అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు అన్నభీమోజు నాగార్జునచారి, యడవెల్లి శ్రీనివాస్‌రెడ్డి, నారాయణరెడ్డి, చిట్టిబాబునాయక్, బాలాజీనాయక్, హాతీరాం, మోసిన్‌అలీ, చిర్ర మల్లయ్యయాదవ్, యూసుఫ్, కట్టా మల్లేష్‌గౌడ్, దుర్గా ప్రసాద్, ఇలియాస్ తదితరులు ఉన్నారు.