రామగిరి, డిసెంబర్ 26 : న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా చేస్తున్న తమ సమ్మెపై ఎమ్మెల్సీ తీన్నార్ మల్లన్న బురదజల్లే ప్రయత్నం చేస్తున్న తీరు విచారకరమని సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మొల్గురి కృష్ణ, నేతలు, ఉద్యోగులు మండిపడ్డారు. క్యూ న్యూస్ చానల్లో న్యూస్ రీడర్గా ఉన్న మల్లన్న సమగ్ర శిక్ష ఉద్యోగులతో పీఏఆర్టీయూ ఉపాధ్యాయ సంఘమే సమ్మె చేయిస్తుందని పేర్కొనడం దురదృష్టకరమన్నారు. గుర్తు తెలియని వ్యక్తి సెల్ఫోన్లో పంపిన సమాచారాన్ని న్యూస్లో చదువడం అత్యంత హేయమైన చర్య అని తెలిపారు.
సమగ్ర శిక్ష ఉద్యోగులకు రెగ్యులరైజ్ చేయాలని చేస్తున్న సమ్మెలో అన్ని ఉపాధ్యాయ సంఘాలు మద్దతు తెలుపుతున్నాయని, అధికార పార్టీ, ప్రభుత్వం మల్లన్నతో ఇలాంటి అసత్య వ్యాఖ్యలు చేయిస్తున్నదని వారు ఆరోపించారు. తక్షణమే తీన్మార్ మల్లన్న చేసిన అనుచిత వాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.సమ్మెలో భాగంగా గురువారం 17వ రోజు ఉద్యోగులు కలెక్టర్ కార్యాలయం ఎదుట పండ్లు అమ్ముతూ నిరసన తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులు పాల్గొన్నారు.