సూర్యాపేట, మే 22 (నమస్తే తెలంగాణ) : అవినీతి, అక్రమాలకు అడ్డాగా మారిన సూర్యాపేట జిల్లా వైద్య ఆరోగ్యశాఖపై నలువైపులా విచారణలు జరుగుతున్నాయి. ఇప్పటికే పలు మార్లు హైదరాబాద్ నుంచి బృందాలుగా వచ్చి తనిఖీలు చేసి రికార్డులు తీసుకుపోగా, మరో పక్క కొద్ది సంవత్సరాలుగా జరిగిన ఆర్థిక లావాదేవీలపై పూర్తి స్థాయిలో లిఖిత పూర్వక రిపోర్టు, బిల్లులతో ఇవ్వాలని జిల్లా కలెక్టర్ మెమో ఇచ్చినట్లు సమాచారం. దీంతో దిగమింగిన నిధులకు సంబంధించి పాత బిల్లుల కోసం తంటాలు పడుతూ వాటి కోసం కొత్తగా అక్రమాలకు తెరలేపినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమ అక్రమ సంపాదన నుంచి ఎంతైనా పెడుతామని, ఏదో ఒక మార్గాన్ని కనిపెట్టి తమను కాపాడండి మహాప్రభో అంటూ తెలిసిన వారి చుట్టూ అక్రమార్కులు తిరుగుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
సూర్యాపేట జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ అవినీతి, అక్రమాలపై నమస్తే తెలంగాణ పత్రికలో పలు మార్లు వార్తలు ప్రచురితం కావడంతో వాటిపై అన్ని స్థాయిల్లో విచారణలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. తొలుత వైద్య ఆరోగ్యశాఖ అదనపు డైరెక్టర్ పుష్ప హైదరాబాద్ నుంచి రికార్డులు తెప్పించుకొని విచారణ చేయగా అక్రమాలు జరిగినట్లు తేలినట్లు విశ్వసనీయంగా తెలిసింది. దీనిపై లోతుగా విచారణ చేసేందుకు ఐదుగురితో కూడిన వైద్యారోగ్యశాఖ డైరెక్టర్, అదనపు డైరెక్టర్ల బృందం వచ్చి విచారణ చేసి రికార్డులను తమ వెంట తీసుకువెళ్లాయి.
కొద్ది సంవత్సరాలుగా జిల్లాలోని అర్హత లేని డాక్టర్లు అందిస్తున్న వైద్యంతో తరుచూ మరణాలు సంభవించగా బాధితులు ఆందోళనలు చేయగా ఏదో ఒకటి సెటిల్ చేసుకోవడం.. మరి కొన్ని సార్లు గుట్టుచప్పుడు కాకుండా డబ్బులు ముట్టజెప్పి వదిలించుకోవడం పరిపాటిగా మారుతున్నది. తాజాగా సాయిగణేశ్ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలికాగా, ఇలాంటివి జిల్లాలో ఎక్కడో ఒకచోట వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. జిల్లాలో నకిలీ డాక్టర్లు వైద్యం అందిస్తున్నారని, అనుమతులు లేకుండా స్కానింగ్ సెంటర్లు నడుపుతున్నారని ఇటీవల తెలంగాణ మెడికల్ కౌన్సిల్ విచారణలో బయటపడ్డాయి. అప్పుడే అనుమతులు లేని ఆసుపత్రులు సీజ్ చేసి ఉంటే సాయిగణేశ్ ఆసుపత్రిలో నిండు ప్రాణం బలయ్యేది కాదు. ఈ చావు పాపం సీజ్ చేయని వైద్య ఆరోగ్యశాఖదే అనేది నగ్నసత్యం. దీంతోపాటు నాలుగు రోజుల క్రితం సూర్యాపేట పట్టణంలోని మరో ఆసుపత్రిలో 25 ఏండ్ల గర్భిణి మృతి చెందగా ఆలస్యంగా విషయం బయటపడింది. మృతురాలికి ఇప్పటికే ఇద్దరు కుమార్తెలు ఉండగా కుమారుడి కోసం మూడో సంతానం కోసం ఎదురు చూడడం, తెలిసిన వారి ద్వారా స్కానింగ్ చేయించుకొని కడుపులో ఉన్నది మళ్లీ ఆడశిశువేనని తేలింది. దీంతో డాక్టర్ అబార్షన్ చేస్తుండగా వికటించడంతో ఖమ్మం తీసుకువెళ్లారని అక్కడే సదరు మహిళ మృతి చెందిందని సమాచారం. ప్రైవేట్ ఆసుపత్రులు చేసే పాపాలలో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పాలు పంచుకుంటుండడంతోనే ఇష్టారాజ్యంగా టెస్టులు, అబార్షన్లు జరుగుతున్నాయి. ఇక అక్రమాలకు కేంద్రంగా ఉన్న వైద్య ఆరోగ్యశాఖపై ముప్పేట విచారణ జరుగుతుండగా అధికారులు ఇచ్చిన బిల్లులకే ఓకే చెబుతారా..? లేక లోతుగా విచారణ చేస్తారా..? అక్రమార్కులను ఎవరైనా కాపాడుతారా..? అనేది వేచి చూడాల్సిందే.
కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగిణుల వేతనాలు మింగేసిన విషయంలో తమకు అనుకూలంగా లెటర్ ఇవ్వాలంటూ బెదిరింపులకు దిగుతున్నట్లు తెలుస్తున్నది. దాదాపు 25 మంది వేతనాలు కాజేయగా ఒకరిద్దరి నుంచి తామే విధులు నిర్వహించి వేతనాలు తీసుకున్నామని చెప్పాలని ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. దీనిపై హైదరాబాద్, సూర్యాపేట ఇంటెలిజెన్స్ రంగంలోకి దిగి అక్రమాలకు సంబంధించి ఆ శాఖ బాధితులతోపాటు ఖర్చు చేసిన నిధులకు సంబంధించిన బిల్లులు ఇచ్చిన వారిని ఆరా తీస్తుండగా, ఒత్తిడి చేసి కావాల్సిన బిల్లులు తీసుకుంటున్నట్లు తేలినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ క్రమంలో గర్భం దాల్చి విధులకు ఎలా వెళ్లారని ఓ మహిళను ఆరా తీయడం, విషయం వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు తెలిసి ప్రకంపనలు రేపుతున్నట్లు కింది స్థాయి ఉద్యోగుల ద్వారా తెలిసింది. అంతే కాకుండా ఎన్హెచ్ఎం నిధులు రూ.30,50,000, ఫ్లెక్సీల ప్రింటింగ్ పేరిట రూ.4,71,420 స్వాహాతోపాటు కొవిడ్ నిధులు కూడా వదలలేదనే ఆరోపణలు రాగా వీటన్నింటి బిల్లుల కోసం నానా తంటాలు పడుతున్నారట.