రామగిరి, జూన్ 24: బడులు ప్రారంభమై పక్షం రోజులు గడవక ముందే నల్లగొండ జిల్లా విద్యాశాఖలో టీచర్ల డిప్యుటేషన్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఇప్పటికే పలు విషయాల్లో ఆభాసుపాలవుతున్న విద్యాశాఖ అధికారులు ‘నవ్విపోదురుగాక..నాకేటి..’ అన్న చందంలా వ్యవహరిస్తూ నిబంధనలకు విరుద్ధంగా డిప్యుటేషన్స్కు శ్రీకారం చుట్టడంతో పైరవీల జోరు కొనసాగుతోంది. జీవో 317తో మ్యూచ్‌వల్‌గా రూ.లక్షలు పుచ్చుకొని జీరో సర్వీసుతో జిల్లాలో అడుగుపెట్టిన ఇద్దరు ఉపాధ్యాయులు మళ్లీ రాజకీయ అండతో తమ సొంత ప్రాంతానికి డిప్యుటేషన్‌పై వెళ్లారు. మరికొందరు అదే రాజకీయ నాయకుల సిఫార్సు.. మౌఖిక ఆదేశాలతో డిప్యుటేషన్స్పై వెళ్ల్లడంపై విద్యాశాఖపై విమర్శలు వస్తున్నాయి. అక్రమ డిప్యుటేషన్స్ను తక్షణమే ఆపాలని, ఇచ్చిన డిప్యుటేషన్స్ను రద్దు చేసి వారు
పనిచేసే ప్రాంతాలకు పంపించాలని పలు ఉపాధ్యాయ సంఘాలు, టీచర్లు డిమాండ్ చేస్తుండటం గమనార్హం.
వెనుకబడి ప్రాంతాల నుంచే..
వాస్తవానికి జిల్లాలో వెనుకబడిన మారుమూల మండలాల్లోని గ్రామాల్లో ఉపాధ్యాయుల అవసరం అధికంగా ఉంటుంది. ఆ ప్రాంతాల్లో ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన పిల్లలే అధికం. అక్కడి పిల్లలకు విద్యనందించి తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. వాటిని పట్టించుకోకుండా ఏకంగా డిప్యుటేషన్‌పై వెళ్లడం.. ఇందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు అండంగా ఉంటూ వాస్తవిక పరిస్థితులను పరిగణలోకి తీసుకోకుండా డిప్యుటేషన్‌పై పంపడం పట్ల ఉపాధ్యాయ సంఘాల నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
డిప్యుటేషన్ ఇలా ..
గుడిపల్లి మండలంలోని మాదాపురం పాఠశాలకు జీవో 317లో జీరో సర్వీసుపై మ్యూచువల్తో వచ్చిన ఉపాధ్యాయుడు ఏకంగా నేషనల్ హైవే (అద్దంకి-నార్కట్‌పల్లి) ఉన్న కేతేపల్లి మండలంలోని చెర్కుపల్లి పాఠశాల ( తమ స్వస్థలం సమీపంలోకి), పీఏపల్లి మండలంలోని దుగ్యాల నుంచి ఇదే కేతేపల్లి మండలానికి ఈ ఇద్దరు టీచర్స్ డిప్యుటేషన్‌పై వెళ్లారు. వీరు ఇద్దరు మ్యూచువల్ బదిలీపై సూర్యాపేట జిల్లా నుంచి నల్లగొండ జిల్లాకు వచ్చిన వారే. వీరు కలెక్టర్ ఉత్తర్వులతో సూర్యాపేటకు సమీపంలోకి తమ పలుకుబడి ఉపయోగించి డిప్యుటేషన్‌తో వెళ్లారనే విమర్శలు వస్తున్నాయి.
గుర్రంపోడు మండలంలోని ఊట్లపల్లి యూపీఎస్‌లో ఉపాధ్యాయుల అవసరం ఉంది. అయినప్పటికీ ఇక్కడ పని చేస్తున్న ఓ ఉపాధ్యాయుడు చిట్యాల ప్రాథమిక పాఠశాలకు డిప్యుటేషన్‌పై వచ్చారు. చిట్యాల పాఠశాలలో ఇప్పటికే ఆరుగురు ఉపాధ్యాయులు పని చేస్తున్నప్పకీ అవసరం లేకున్నా ఆ ఉపాధ్యాయుడిని డిప్యుటేషన్ వేయించుకున్నారు.
తక్షణమే రద్దు చేయాలి
వాస్తవానికి ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జూలై 16 తర్వాత టీచర్ల సద్దుబాటు చేయాలని ఆదేశాలున్నాయి. నల్లగొండ జిల్లాలో మాత్రం అందుకు విరుద్ధంగా అక్రమ డిప్యుటేషన్స్ పర్వం కొనసాగుతున్నది. నిబంధనల మేరకు అదే మండలంలోగానీ, కాంప్లెక్స్ పరిధిలోగానీ డిప్యుటేషన్ ఇవ్వొచ్చు. గతేడాది జరిగిన పరిణామాలను దృష్టిలో ఉంచుకొని మా సంఘం నుంచి వేసవిలోనే డీఈవోకు అక్రమడిప్యుటేషన్ ఇవ్వొద్దని లేటర్ ఇచ్చాం. ప్రజాప్రతినిధులు, అధికారుల ఆదేశాలతో డిప్యుటేషన్ చేయడం సరైందికాదు. తక్షణమే అక్రమ డిప్యుటేషన్స్ రద్దు చేయాలి.
-బక్కా శ్రీనివాసాచారి, టీఎస్యూటిఎఫ్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు