నల్లగొండ విద్యావిభాగం (రామగిరి), మార్చి 24 : యూజీసీ 2025 మార్గదర్శకాలను అనుసరించి ప్రభుత్వం ఎం.ఫిల్, పిహెచ్డీ ఇంక్రిమెంట్ల రద్దుకు వ్యతిరేకంగా నల్లగొండ పట్టణంలోని నాగార్జున ప్రభుత్వ కళాశాల ప్రాంగణంలో అధ్యాపకులు సోమవారం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. అధ్యాపకులకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాలను వెనక్కి తీసుకోకపోతే దేశ వ్యాప్తంగా నిరసనలు చేపడుతామని హెచ్చరించారు. బడ్జెట్లో విద్యారంగానికి కనీసం పది శాతం నిధులు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. పాత పెన్షన్ స్కీమ్ ను పునరుద్ధరించాలని, దేశ వ్యాప్తంగా వివిధ విశ్వవిద్యాలయాల్లో, డిగ్రీ కళాశాలల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు.
అసోసియేట్ ప్రొఫెసర్ ప్రమోషన్ కు పీహెచ్డీని తప్పనిసరి చేయడాన్ని వ్యతిరేకించారు. విదేశీ విశ్వవిద్యాలయాల ప్రవేశాన్ని వెంటనే ఆపాలని, విద్యా వ్యాపారీకరణను మానుకోవాలని సూచించారు. అతిథి అధ్యాపకుల వేతనాలను యూజీసీ స్కేల్ ప్రకారం చెల్లించాలని అన్నారు. నూతన విద్యా విధానం- 2020పై నిష్ణాతులైన ప్రొఫెసర్లను చర్చకు ఆహ్వానించి విధి విధానాలను ఖరారు చేయాలన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ కళాశాల అధ్యాపకుల సంఘం జిల్లా అధ్యక్షుడు డా.అనిల్ అబ్రహం, కార్యదర్శి డా.అనిల్ బొజ్జ, వైస్ ప్రిన్సిపాళ్లు డా.పరంగి రవికుమార్, డా.అంతటి శ్రీనివాస్, పరీక్షల నియంత్రాణాధికారి బత్తిని నాగరాజు, ఐక్యుఎసి కో ఆర్డినేటర్ డా. ప్రసన్నకుమార్, అధ్యాపకులు డా.మునిస్వామి, డా. భట్టు కిరీటం, డా.వెల్దండి శ్రీధర్, సుధాకర్, డా. మల్లేశం, జ్యోత్స్న, డా.భాగ్యలక్ష్మి, శంకర్, అంకుశ్ పాల్గొన్నారు.