కట్టంగూర్, జూలై 23 : విద్యా, ఉపాధ్యాయ రంగంలో ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డీటీఎఫ్ నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.వెంకులు, టీఎస్ యూటీఎఫ్ జిల్లా ఆడిట్ కమిటీ కన్వీనర్ ఎం.మురళయ్య అన్నారు. ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని యూఎస్పీఎస్ ఆధ్వర్యంలో బుధవారం కట్టంగూర్ డిప్యూటీ తాసీల్దార్ ప్రాంక్లిన్ ఆల్బట్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల షెడ్యూలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
జీఓ నంబర్ 25ను సవరించి ప్రతి పాఠశాలలో కనీసం ఇద్దరు ఉపాధ్యాయులు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ ను పునరుద్దరించడంతో పాటు కేజీబీవీ, సమగ్ర శిక్ష ఉద్యోగులకు బేసిక్ పే అమలు చేయాలన్నారు. అశాస్త్రీయంగా ఉన్న గురుకుల పాఠశాలల టైం టేబుల్ ను సవరించాలని పేర్కొన్నారు. ఈ కార్య క్రమంలో యూఎస్ పీఎస్ నాయకులు, టీఎస్ యూటీఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి డి.కృష్ణ, డీటీఎఫ్ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్.వీరస్వామి, జీఎం.ఫిరోజ్, పి.మాణిక్యం, నాగభూషణం పాల్గొన్నారు.