– తపస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కట్టేబోయిన శ్రీనివాస్ యాదవ్
రామగిరి, సెప్టెంబర్ 02 : పెద్దఅడిశర్లపల్లి మండలంలోని వివిధ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) పీఏ పల్లి మండల శాఖ ఆధ్వర్యంలో బుధవారం సభ్యత్వ అభియాన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తపస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కట్టేబోయిన శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాలలను సందర్శించి ఉపాధ్యాయులతో మాట్లాడారు. అనంతరం ప్రభుత్వానికి పలు డిమాండ్లను వినిపించారు.
పీఆర్సీ అమలు : రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు వెంటనే 57% ఫిట్మెంట్తో పీఆర్సీని అమలు చేయాలి
డీఏల విడుదల : ఉపాధ్యాయులకు రావాల్సిన పెండింగ్ 6 డీఎలను వెంటనే ప్రకటించి విడుదల చేయాలి
సీపీఎస్ రద్దు : ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)ను రద్దు చేసి, పాత పెన్షన్ విధానం (ఓపీఎస్)ను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో తపస్ రాష్ట్ర నాయకులు ఇరుగు శ్రీరాములు, పీఏ పల్లి మండల అధ్యక్షులు జింకల శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శి పిల్లి ఏడుకొండలు, నల్లగొండ జిల్లా మరియు మండల కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

‘ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి’