నల్లగొండ ప్రతినిధి, ఫిబ్రవరి27(నమస్తే తెలంగాణ) : వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఉపాధ్యాయ శాసనమండలి నియోజకవర్గ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 8నుంచి మొదలైన పోలింగ్ సాయంత్రం 4గంటల వరకు కొనసాగింది. నియోజకవర్గ వ్యాప్తంగా పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రకటించారు. ఈ ఎన్నికల్లో 19మంది అభ్యర్థులు బరిలో నిలువగా 200 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు ఓటు వేశారు.
అందులో 150 పోలింగ్ కేంద్రాలు గ్రామీణ ప్రాంత మండల కేంద్రాల్లోనే ఉండడంతో అక్కడ ఓటింగ్ కోసం ఆడపాదడపా ఓటర్లు వస్తూ కనిపించారు. మున్సిపల్ పట్టణాలతోపాటు 11 జిల్లా కేంద్రాల్లోని పోలింగ్ కేంద్రాల్లో మాత్రమే ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉండడంతో వీటిల్లో ఓటర్లు బారులుదీరారు. కొన్నిచోట్ల పోలింగ్ ముగిసే సమయానికి కూడా ఓటర్లు క్యూలైన్లలో వేచిఉండి తర్వాత ఓటు వేశారు.
కాగా మొత్తం ఓటర్ల సంఖ్య 25,797 కాగా ఇందులో 24,132 మంది ఓటుహక్కును వినియోగించుకున్నారు. అత్యధికంగా యాదాద్రి జిల్లాలో 96.54శాతం, తక్కువగా హన్మకొండలో 91.66శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ ముగిసిన అనంతరం 12 జిల్లాల నుంచి బ్యాలెట్ బాక్స్‌లన్నీ ప్రత్యేక బందోబస్తు నడుమ అర్ధరాత్రి నల్లగొండకు తరలించారు. ఆర్జాలబావిలోని స్టేట్ వేర్ హౌసింగ్ గోదాముల్లోని స్ట్రాంగ్‌రూమ్స్‌లో బ్యాలెట్ బాక్స్‌లను భద్రపరిచారు. వీటి వద్ద ప్రత్యేక భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఈ నెల 3వ తేదీన ఇక్కడే ఓట్ల లెక్కింపు కొనసాగనుంది.
12 జిల్లాల పరిధిలో నియోజకవర్గం విస్తరించి ఉండగా సిద్దిపేటలో 93.98శాతం, జనగామలో 94.31శాతం, హన్మకొండలో 91.66శాతం, వరంగల్‌లో 94.13శాతం, మహబూబాబాద్‌లో 94.47శాతం, భూపాలపల్లిలో 93.62శాతం, ములుగులో 92.83శాతం, భద్రాద్రికొత్తగూడెంలో 91.94శాతం, ఖమ్మంలో 93.03శాతం, యాదాద్రిలో 96.54శాతం, సూర్యాపేటలో 94.97శాతం, నల్లగొండలో 94.66శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా యాదాద్రి జిల్లాలో 984 మంది ఓటర్లు గానూ 950 మంది ఓటు వేయగా 96.54శాతం కావడం విశేషం.
2019 మార్చిలో జరిగిన ఎన్నికల్లోని పోలింగ్‌తో పోలిస్తే ఈ సారి పోలింగ్ శాతం పెరుగడం విశేషం. గతంలో 20,888 మంది ఓటర్లు ఉండగా అందులో 18,884 మంది ఓట్లేశారు. దీంతో అప్పుడు 90.41శాతంగా తుది పోలింగ్ నమోదైంది. అయితే ఈ సారి గతం కంటే పోలింగ్ శాతం 2.14శాతం పెరిగింది. ఈ సారి ఓటర్ల సంఖ్య కూడా పెరిగినా పోలింగ్ శాతం కూడా పెరగడం గమనార్హం. గతంతో పోలిస్తే ఈ సారి ప్రధాన సంఘాల అభ్యర్థుల సంఖ్య పెరుగడం అందరూ గెలుపు కోసం సర్వశక్తులొడ్డారు. ఈ క్రమంలో ఓటర్లను ఆకర్షించేందుకు డబ్బు, మద్యం, విందువినోదాల లాంటి ప్రలోభాలు పెద్ద ఎత్తున ప్రయోగించారు. దీంతో ఎక్కువ మంది ఓటర్లను కూడా అభ్యర్థులను కలువడం.. అందుకు అనుగుణంగానే ఓటర్లు కూడా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటుహక్కు వినియోగించుకున్నట్లు పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
వరంగల్-ఖమ్మం- నల్లగొండ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోలింగ్ ముగిసిన 4గంటల తర్వాత ఇచ్చిన అప్డేట్ ప్రకారం మొత్తం 93.55శాతం పోలింగ్ నమోదైంది. ఇందులో ఇంకా తుది పోలింగ్ లెక్కలు వెలువడాల్సి ఉందంటూ… ఇందులో స్వల్ప తేడాలు ఉండవచ్చని గురువారం రాత్రి అధికారులు ప్రకటించారు. పోలింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభం కాగా ప్రతి రెండు గంటలకు ఒకసారి ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పోలింగ్ శాతాన్ని విడుదల చేశారు.
తొలి రెండు గంటల్లో అంటే 10 గంటల వరకు 16.78శాతం నమోదైంది. తర్వాత మధ్యాహ్నం 12 గంటల వరకు 48.68శాతం, మధ్యాహ్నం 2 గంటల వరకు 76.33శాతం, సాయంత్రం నాలుగు గంటలకు పోలింగ్ ముగిసే సమయానికి 93.55శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య భారీగా పోలింగ్ నమోదైనట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. నియోజకవర్గ పరిధిలో సిద్దిపేట, జనగాం, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, యాదాద్రిభువనగిరి, సూర్యాపేట, నల్లగొండ జిల్లాలు ఉన్నాయి. వీటి అన్నింటిలోనూ 91శాతానికి పైగానే పోలింగ్ నమోదు కాగా అత్యధిక ఓట్లు ఉన్న హన్మకొండలో 91.66శాతంతో తక్కువ పోలింగ్ జరిగింది.
ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నియోజకవర్గ వ్యాప్తంగా పూర్తి ప్రశాంతంగా కొనసాగింది. ఎక్కడా చిన్న ఘటన కూడా చోటుచేసుకోలేదు. పోలింగ్ సందర్భంగా ఆయా అభ్యర్థుల తరపున సంఘాల నేతలు, అనుచరులు కేంద్రాల వద్ద సందడి చేసినా సజావుగా పోలింగ్ ముగియడంతో అధికారులు సైతం ఊపిరి పీల్చుకున్నారు. ఉదయం 7గంటల నుంచి పోలింగ్ కేంద్రాల వెలుపల ఆయా సంఘాల నేతలు, కార్యకర్తలు తమ అభ్యర్థికి మద్దతుగా టెంట్లు వేసి కూర్చుకున్నారు. సాయంత్రం వరకు ఇది కొనసాగింది. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు పోలింగ్ సందర్భంగా పలుచోట్ల కేంద్రాల వద్ద పరిస్థితిని సమీక్షించారు. రిటర్నింగ్ అధికారి, నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి పోలింగ్ కేంద్రాలను సందర్శిస్తూ సిబ్బందికి తగు సూచనలు చేశారు. ఎస్పీ శరత్చంద్ర పవార్ కూడా బందోబస్తును పర్యవేక్షించారు.
12 జిల్లాల పరిధిలో పోలింగ్ ముగిసిన అనంతరం ఆ బ్యాలెట్ బాక్స్లన్నింటినీ నల్లగొండ జిల్లా కేంద్రానికి తరలించారు. పోలింగ్ ముగిసిన వెంటనే పోలింగ్ కేంద్రాల నుంచి బాక్స్‌లను ఆయా జిల్లా కేంద్రాలకు అక్కడి నుంచి ప్రత్యేక బందోబస్తు నడుమ నల్లగొండకు తీసుకువచ్చారు. వీటిని నల్లగొండలోని ఆర్జాలబావి స్టేట్ వేర్ హౌసింగ్ గోదాముల్లో ముందే సిద్ధం చేసిన స్ట్రాంగ్ రూమ్స్‌లో భద్రపరిచారు. ఈ స్ట్రాంగ్‌రూమ్స్‌కు బాక్స్‌లన్నీ చేరాక అభ్యర్థుల లేదా వారి ఏజెంట్ల సమక్షంలో రూమ్స్‌కు సీల్ వేశారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో స్ట్రాంగ్‌రూమ్స్ వద్ద 24/7 నిరంతరం నిఘాను ఏర్పాటు చేశారు. ఈ నెల 3వ తేదీన ఇక్కడే ఓట్ల లెక్కింపు జరుగనుంది. పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఇక కౌంటింగ్ ఏర్పాట్లపై దృష్టి సారించారు.
వరంగల్ -ఖమ్మం- నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిలక పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని, ఇక కౌంటింగ్ ఏర్పాట్లపై దృష్టి సారించనున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. గురువారం పోలింగ్ ప్రారంభమైన తర్వాత జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాల, సెయింట్ అల్పాన్సస్ పాఠశాలలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఆమె పోలింగ్‌సరళిని పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి వెబ్ కాస్టింగ్ ద్వారా 12 జిల్లాల పోలింగ్ సరళిని పర్యవేక్షించారు.
తనతోపాటు, ఆయా జిల్లాల కలెక్టర్లు, ఏఆర్ఓలు, ఇతర బృందాల సమన్వయంతో పోలింగ్ సజావుగా ముగిసిందన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా సాయంత్రం 4 గంటల వరకు 93.55 శాతం ఓట్లు పోలైనట్లు చెప్పారు. ఇక ఓట్ల లెక్కింపునకు సంబంధించి వచ్చే నెల 3వ తేదీన నల్లగొండలోని ఆర్జాలబావిలో ఉన్న గోదాములో ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. సాయంత్రం ఎస్పీ పవార్‌తో కలిసి కలెక్టర్ త్రిపాఠి స్ట్రాంగ్ రూమ్స్‌ను పరిశీలించారు. అక్కడ తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. బ్యాలెట్ బాక్స్‌లను అక్కడే స్ట్రాంగ్‌రూమ్స్‌లో భద్రపరుస్తున్నట్లు, వీటి వద్ద నిరంతర నిఘా ఏర్పాటు చేసినట్లు ఈ సందర్భంగా త్రిపాఠి తెలిపారు.
ఉపాధ్యాయ ఎన్నికలు కట్టుదిట్టమైన భద్రత నడుమ ప్రశాంతంగా ముగిసినట్లు నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు. పలు పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తును పర్యవేక్షించారు. సాయంత్రం స్ట్రాంగ్ రూమ్స్ వద్ద కూడా బందోబస్తు చర్యలను పరిశీలించారు. ఆర్జాలబాయి స్టేట్ వేర్ హౌసింగ్ గోదాముల్లోని స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర దాదాపు 100 మంది సిబ్బందితో మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. స్థానిక పోలీసులతో పాటు ఆర్మ్డ్ రిజర్వ్, టిజీఎస్పీ సిబ్బంది స్ట్రాంగ్ రూంల వద్ద 24 గంటల పాటు సాయుధ రక్షణ ఏర్పాటు చేసి, CCTV కెమెరాల ద్వారా పర్యవేక్షణ కొనసాగుతుందని వెల్లడించారు. వీరందరూ ఎన్నికల కౌంటింగ్ పూర్తయ్యే వరకు విధులో ఉంటారని ఎస్పీ పవార్ తెలిపారు.