తుంగతుర్తి, మే 22 : తాటి మ్యూజికల్ ఫెస్టివల్ పేరుతో జరుగుతున్న కుట్రను వ్యతిరేకిస్తూ శుక్రవారం తుంగతుర్తి మండల పరిధిలోని అన్నారం గ్రామంలో కల్లుగీత కార్మికుల సంఘం ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ గౌడ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మొల్కపురి శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ.. తాటి మ్యూజికల్ ఫెస్టివల్ పేరుతో గౌడ్ల సాంప్రదాయాలను దెబ్బతీస్తే ఊరుకోం అని హెచ్చరించారు. ఎక్స్పీరియం ఎకో పార్క్ యజమాని రామ్దేవ్రావు ఆధ్వర్యంలో ఈ నెల 24న నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్న తాటి మ్యూజికల్ ఫెస్టివల్ కార్యక్రమం గౌడల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే చర్యగా ఆయన అభివర్ణించారు. తాటి చెట్టు, కల్లుగీత వృత్తి అనేవి గౌడల జీవనాధారం మాత్రమే కాకుండా తెలంగాణ సంస్కృతికి ప్రతీకలన్నారు.
ఒకవైపు కల్లుగీత కార్మికులు వృత్తిని కాపాడుకుంటూ ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతుంటే, మరోవైపు కార్పొరేట్ వ్యవస్థ తాడి పేరుతో ఈవెంట్లు నిర్వహించి కోట్ల రూపాయల వ్యాపారం చేయాలని చూడడం దారుణమన్నారు. కార్పొరేట్ సంస్థలు తాడి పేరుతో కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. రామ్ దేవ్ రావు పార్కులో అక్రమంగా ఏర్పాటు చేసిన తాడి చెట్ల స్థలాన్ని తాడి కార్పొరేషన్ కు అప్పగించి ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేసుకున్న గౌడ ఆత్మగౌరవ నీరాకేఫ్ లో కల్లుగీతా వృత్తిదారులు, గౌడ కల్లుగీత కుల సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. దాని వల్ల గౌడుల జీవనోపాధికి భరోసా కలుగుతుందని తెలిపారు.
హైదరాబాద్లో తాడి మ్యూజికల్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని వెంటనే రద్దు చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర ఆబ్కారీ మంత్రి జూపల్లి కృష్ణారావు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ను కలిసి సమస్యపై చర్చిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గౌడ సంక్షేమ కల్లుగీత సంఘం నాయకులు గుండగాని నాగరాజ్ గౌడ్, వెలిశాల మల్లేష్ గౌడ్, ముత్తయ్య గౌడ్, సుధాకర్ గౌడ్, సాగర్ గౌడ్, వెంకటయ్య గౌడ్, లింగన్న గౌడ్, నరేష్ గౌడ్ పాల్గొన్నారు.