యాదాద్రి భువనగిరి, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ) : అందిన కాడికి ఆదాయం రాబట్టడమే లక్ష్యంగా కాంగ్రెస్ సరార్ చర్యలకు ఉపక్రమించింది. ఎక్సైజ్ శాఖ ద్వారా వైన్స్ టెండర్ల రూపంలో రాబడికి రంగం సిద్ధం చేసింది. కొత్త షాపులకు దరఖాస్తు రుసుమును ఏకంగా రూ.3 లక్షలకు పెంచేసింది. మద్యం దుకాణాల కేటాయింపు, షెడ్యూల్‌కు సంబంధించి గురువారం మార్గదర్శకాలు జారీ చేసింది. శుక్రవారం నుంచి అక్టోబర్ 18 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఇందుకోసం ఆబారీ శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. కలెక్టరేట్లో రిజర్వేషన్ దుకాణాలను కూడా అధికారులు ఖరారు చేశారు.
ప్రస్తుతం ఉన్న మద్యం దుకాణాల లైసెన్సుల గడువు నవంబర్ 30తో ముగియనుంది. డిసెంబర్ 1నుంచి నూతన మద్యం దుకాణాల ఏర్పాటు కానున్నాయి. అయితే గతంలో ఒక నెల ముందుగా మాత్రమే టెండర్ నోటిఫికేషన్ విడుదలయ్యేది. కానీ ఈ సారి ఏకంగా మూడు నెలల ముందే ఆగస్టు 30న నోటిఫికేషన్ రాగా.. షెడ్యూల్ మాత్రం రెండు నెలల ముందే విడుదలైంది. శుక్రవారం నుంచి అక్టోబర్ 18 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అక్టోబర్ 23న కలెక్టరేట్లలో కలెక్టర్లు లాటరీ పద్ధతిలో దుకాణాలు కేటాయించనున్నారు. రెండేళ్ల కాలానికి అనుమతులతో ఎక్సైజ్ శాఖ కొత్త లైసెన్సులు జారీ చేస్తుంది. ఎక్సైజ్ చట్టం 1968 ప్రకారం శిక్ష పడిన వారు, ప్రభుత్వానికి బకాయిలు పడి సక్రమంగా చెల్లింపులు చేయనివారు దుకాణాలు పొందేందుకు అనర్హులు. మరోవైపు వైన్స్ దరఖాస్తులు వేసేందుకు ఆశావహులు సిద్ధమవుతున్నారు.
ప్రభుత్వం దరఖాస్తు రుసుము భారీగా పెంచింది. అప్లికేషన్ ఫీజు రూ. 3 లక్షల నాన్ రిఫండబుల్‌గా నిర్ణయించింది. గతంలో దరఖాస్తు ఫీజు రూ. 2లక్షలు ఉండేది. అంటే ఒకో అప్లికేషన్‌పై 50 శాతం పెంచారు. దరఖాస్తు దాఖలులో ఎలాంటి పరిమితులు లేవు. ఒక వ్యక్తి ఎన్ని దరఖాస్తులైనా సమర్పించుకునే అవకాశం ఉంది. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 336 మద్యం దుకాణాలు ఉండగా, గతంలో(2023) 15,266 దరఖాస్తులు రాగా, మొత్తంగా 305 కోట్ల ఆదాయం సమకూరింది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని 82 మద్యం దుకాణాలకు 3,969 దరఖాస్తులు, సూర్యాపేట జిల్లాలో 99 మద్యం దుకాణాలకు 4,250 అప్లికేషన్లు, నల్లగొండ జిల్లాలో 155 దుకాణాలు ఉండగా 7,047 దరఖాస్తులు అందాయి. ఈ సారి దరఖాస్తులతో పాటు ఆదాయం కూడా భారీగా పెరగనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. సుమారు 500 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా తెలుస్తున్నది.
గతంలో బీఆర్ఎస్ హయాంలో వైన్స్ కేటాయింపుల్లో రిజర్వేషన్లు తీసుకొచ్చారు. దుకాణాల కేటాయింపులో గౌడ సామాజిక వర్గానికి 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5శాతం రిజర్వేషన్లు కల్పించారు. దాని అనుగుణంగానే మళ్లీ రిజర్వేషన్లు అమలు చేయనున్నారు. గురువారం కలెక్టరేట్ లో వైన్ షాపులకు లాటరీ పద్ధతిలో రిజర్వేషన్లను ఖరారు చేశారు. యాదా ద్రి భువనగిరి జిల్లాలో 82 షాపులకు గానూ ఓపెన్ కేటగిరీలో 53, గౌడ లకు 21, ఎస్సీలకు 7, ఎస్టీలకు ఒక షాపు కేటాయించినట్లు యాదాద్రి జిల్లా ఎక్సైజ్ అధికారి విష్ణు మూర్తి తెలిపారు.
ఎంపికైన లైసెన్స్ దారులు 6 స్లాబుల ద్వారా లైసెన్స్ ఫీజు చెల్లించే వీలు కల్పించారు. ఐదు వేల లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో వార్షిక ఎక్సైజ్ పన్ను రూ. 50 లక్షలు, 5,000 నుంచి 50 వేల మధ్య జనాభా ఉన్న చోట రూ. 55 లక్షలు, 50 వేల నుంచి లక్ష వరకు ఉన్న ప్రాంతాల్లో రూ. 60 లక్షలు, లక్ష నుంచి ఐదు లక్షల మధ్య జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ. 65 లక్షలుగా నిర్ణయించారు. ఐదు లక్షల నుంచి 20 లక్షల వరకు జనాభా ఉంటే రూ. 85 లక్షలు, ఇక 20 లక్షల పైబడి జనాభా ఉన్న నగరాల్లో వార్షిక ఫీజు రూ. కోటి పది లక్షలుగా ఖరారు చేశారు. వార్షిక లైసెన్స్ రుసుమును ఆరు సమాన వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుంది. ఇక వైన్స్ టర్నోవర్ వార్షిక లైసెన్స్ రుసుముకు 10 రెట్లు దాటితే విక్రయాలపై 10 శాతం షాపు టర్నోవర్ ట్యాక్సు వసూలు చేస్తారు. స్పెషల్ రిటెయిల్ ఎక్సైజ్ ట్యాక్స్ ఏటా రూ.5 లక్షలుగా నిర్ణయించారు. దుకాణాలను ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకే తెరిచేందుకు అనుమతి ఇచ్చారు. రూ .5 లక్షలను అదనంగా చెల్లించి వాక్ -ఇన్ స్టోర్ తరహాలో మద్యం దుకాణాలు నిర్వహించుకునే వెసులుబాటు కల్పించారు.