నల్లగొండ : దేశ సమగ్రతను, ఆర్థిక రంగాన్ని కాపాడాలని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం కోరారు. సోమవారం నల్గొండ జిల్లా కేంద్రంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి తో కలిసి విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. మోదీ ప్రభుత్వం తమకు ఓటు వేయని ముస్లిం, మైనార్టీల పౌరుసత్వాలను రద్దు చేసేందుకు దొడ్డి దారిన ఓట్ల తొలగింపు కార్యక్రమం చేపట్టారని విమర్శించారు. బీహార్లో ఎన్నికలవేళ 65 లక్షల ఓట్లను తొలగించారని తెలిపారు. త్వరలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో ఈ ఓట్ల తొలగింపు పక్రియ చేపట్టనున్నారని చెప్పారు.
ముఖ్యంగా తమకు ఓటు వేయని ముస్లింలు, క్రిస్టియన్లను పౌరసత్వం పేరుతో ఓట్లను తొలగించి రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. పౌర సత్వానికి ఆధార్, ఇతర ధ్రువీకరణ పత్రాలకు అర్హత లేదని కేవలం తాత ముత్తాతల జన ధ్రువీకరణ పత్రాలు ద్వారానే నిరూపించుకోవాలని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. దేశాన్ని మత ప్రాతిపదికన విభజించే కుట్ర మోదీ ప్రభుత్వం చేస్తుందని విమర్శించారు. ఆపరేషన్ సింధూరం విషయంలో మోదీ ప్రభుత్వం అనేక అబద్ధాలు చెప్పిందని, ఆ విషయం ట్రాంప్ నేరుగా చెబుతున్న ప్రధాని మోదీ నోరు ఎందుకు మెదపడం లేదనీ ప్రశ్నించారు.
మన శత్రువైన పాకిస్తాన్ సైనాధికారి మునీర్ ను ట్రంప్ పిలిచి విందు ఇవ్వడం మన దేశాన్నీ అవమానకరించినట్లే నన్నారు. ట్రంప్ ఇతర దేశాలకు సుంకాలు 15 శాతం వేస్తే మన దేశంపై వస్తువుల ఉత్పత్తిపై 25% సుంకాలు విధిస్తున్నాడని విమర్శించారు. ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలను ఖండించాల్సిన ధైర్యం మోదీకి లేదన్నారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలన కాలయాపనతో సాగుతుందని విమర్శించారు. ఎన్నికల సమయంలో రాష్ట్రానికి అప్పులు ఉన్నాయని విషయం రేవంత్ రెడ్డికి తెలుసని ఆయన ఆచరణకు అమలు కాని హామీలు ఇచ్చి కాలయపన చేయడం సరైనది కాదన్నారు. వాగ్దానాల అమలు కోసం క్షేత్రస్థాయిలో ప్రజా ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు.