రామగిరి, మార్చి 30 : టీఎస్పీఎస్సీ ప్రకటించిన గ్రూప్-1 జనరల్ ర్యాంకుల్లో నల్లగొండ జిల్లాకు చెందిన పలువురు సత్తా చాటారు. నల్లగొండకు చెందిన దాది వెంకటరమణ గ్రూప్-1లో రాష్ట్ర స్థాయి ద్వితీయ ర్యాంక్ సాధించారు. వెంకటరమణ ఐదేండ్లుగా సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్నాడు. గ్రూప్-1 పరీక్షలో 535 మార్కులు సాధించాడు. తల్లిదండ్రులు దాది శ్రీనివాసరావు ఐడీసీలో ఏఈగా, తల్లి రాచమల్ల రమాదేవి అనుముల మండలం అలీనగర్ ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నారు. ఈ సంవత్సరం ప్రభుత్వం వెల్లడించిన జేఎల్, డీఏఓ, గ్రూప్-2, గ్రూప్-3 ఉద్యోగాలకు సైతం వెంకటరమణ ఎంపికయ్యాడు.
మిర్యాలగూడ : గ్రూప్-1 మెయిన్స్ ఫలితాల్లో మిర్యాలగూడ పట్టణానికి చెందిన పునాటి హర్షవర్ధన్ 525.5 మార్కులతో రాష్ట్ర స్థాయిలో 6వ ర్యాంక్ సాధించాడు. పట్టణానికి చెందిన రాజ్యలక్ష్మి, తిరుపతిరావు కుమారుడైన హర్షవర్ధన్ బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్‌లో కంప్యూటర్ సైన్స్‌లో ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. అనంతరం సివిల్‌సర్వీస్ ప్రిపరేషన్‌కు ఢిల్లీ వెళ్లి నాలుగేండ్ల పాటు ప్రయత్నించాడు. గతేడాది తిరిగి హైదరాబాద్‌కు వచ్చిన ఆయన గ్రూప్-1 పరీక్షకు సన్నద్ధమై సత్తా చాటాడు.
మిర్యాలగూడ బంగారుగడ్డ కాలనీకి చెందిన జువేరియా గ్రూప్-1 ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 166వ ర్యాంక్, జోన్లో 6వ ర్యాంక్ సాధించింది. పట్టణానికి చెందిన మౌజంఅలీ, అమీనాబీ రెండో కూతురైన జువేరియా కోఠి ఉమెన్స్ కళాశాలలో బీఎస్సీ మ్యాథ్స్ చదివింది. గ్రూప్-1 పరీక్ష రాసి 465.5 మార్కులు సాధించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను గ్రూప్-1కు ఎక్కడా కోచింగ్ తీసుకోలేదని, రోజుకు 10 నుంచి 12 గంటల వరకు సొంతంగానే ప్రిపేర్ అయ్యాయని తెలిపింది.