పోలియో కారణంగా చచ్చుబడిన కాళ్లను చూసి ఆమె అధైర్యపడలేదు. సమాజం చిన్న చూపు చూస్తున్నా నిరాశ చెందలేదు. ఏదో ఒకటి సాధించాలన్న సంకల్పంతో తనకు ఆసక్తి ఉన్న త్రోబాల్ క్రీడతోపాటు వీల్‌చైర్ డ్యాన్స్, సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ దివ్యాంగుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తుంది నల్లగొండలోని పెద్దబండకు చెందిన యువతి స్వప్న.
-నల్లగొండ రూరల్, డిసెంబర్ 20
నల్లగొండ పట్టణంలోని పెద్దబండకు చెందిన బాగిడి సోమనాథ్, షీలా దంపతుల కూతురు స్వప్న. పుట్టుకతోనే పోలియోతో కాళ్లు చచ్చుబడిపోయాయి. పదో తరగతి వరకు పట్టణంలోని విద్యా గ్రామర్ స్కూల్లో చదివింది. ఇంటర్ స్థానిక జూనియర్ కళాశాలలో చదువుతున్న సమయంలో తన తండ్రి అనారోగ్యంతో మరణించాడు. దాంతో తల్లికి ఆసరాగా, కుటుంబానికి అండగా నిలిచేందుకు రెగ్యులర్ చదువుకు స్వస్థి పలికింది. ఓపెన్‌లో పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఆ తర్వాత ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ కుటుంబానికి ఆసరా అవుతున్నది. అంతేకాకుండా తన చిన్ననాటి నుంచి ఆటలు, డ్యాన్స్‌పై ఉన్న మమకారంతో తనకు ఇష్టమైన వాలీబాల్, త్రోబాల్ క్రీడల్లో ప్రతిరోజూ సాధన చేసేది.
2018లో జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి త్రోబాల్ పోటీలకు ఎంపికైంది. రాష్ట్ర స్థాయిలో ఢిల్లీ, జైపూర్, హర్యానాలో నిర్వహించిన పోటీల్లో రాణించింది. జాతీయ స్థాయిలో కొయంబత్తూర్, ఉడిపిలో నిర్వహించిన త్రోబాల్ పోటీల్లో సత్తా చాటింది. ఇటీవల భూటాన్‌లో జరిగిన ఇంటర్నేషల్ త్రోబాల్ పోటీల్లో పాల్గొని సత్తా చాటింది. అదేవిధంగా దివ్యకళా ఫౌండేషన్ అధ్వర్యంలో హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహించిన వీల్‌చైర్ డ్యాన్స్ పోటీల్లో పాల్గొన్న స్వప్న.. తన ప్రతిభకు అంగవైకల్యం అడ్డుకాదని నిరూపించింది. డ్యాన్స్, క్రీడల్లోనే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ఉత్సాహంగా పాల్గొంటూ దివ్యాంగుల హక్కుల సాధనకు నిరంతరం కృషి చేస్తున్నది.
నాకు చిన్ననాటి నుంచే క్రీడలు, నృత్యంపై ఆసక్తి ఉండేది. కానీ, అంగవైకల్యంతో చిన్నచూపునకు గురయ్యేదాన్ని. ఈ క్రమంలో కుటుంబ బాధ్యత మీద పడడంతో ఏదో ఒకటి సాధించాలనే కసి పెరిగింది. ప్రైవేట్ ఉద్యోగం చేస్తూనే ఓపెన్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాను. త్రోబాల్ క్రీడలో ఉన్న ప్రావీణ్యంతో అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని గోల్డ్ మెడల్ సాధించా. డ్యాన్స్‌పై ఆసక్తితో వీల్‌చైర్ డ్యాన్స్‌లో ప్రతిభ కనబరుస్తున్నా. నిత్యం రెండు గంటలు త్రోబాల్ సాధన చేస్తున్నా. భవిష్యత్‌లో ఒలింపిక్స్ త్రోబాల్ పోటీల్లో పాల్గొనాలన్నదే నా లక్ష్యం. ఆ దిశగా ముందుకు సాగుతున్నా.
-బాగిడి స్వప్న, త్రోబాల్ క్రీడాకారిణి, నల్లగొండ