నకిరేకల్, డిసెంబర్ 1 : స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమంలో హడావిడిగా కూలీలతో పనిచేయించుకుర్రు.. పైసలు ఎగ్గొట్టిర్రు..ఆయా గ్రామ పంచాయతీల్లో డబ్బులు జమ అయినా ఇవ్వకుండా అధికారులు కూలీల కడుపు కొడుతున్న సంఘటనలు లేకపోలేదు. పైగా డబ్బులు రాలేదని అధికారులే కుంటి సాకులు చెబుతుండడం గమనార్హం. నకిరేకల్ మండలంలోని గోరెంకలపల్లి గ్రామంలో స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరం ఆగస్టు 5నుంచి 9వ తేదీ వరకు 14 మంది కూలీలతో పిచ్చి చెట్లు తొలగింపు, కంప చెట్లు కొట్టే కార్యక్రమాలు నిర్వహించారు. పనిచేసి దాదాపు మూడు నెలలు కావస్తున్నా తమకు డబ్బులు ఇవ్వడం లేదని గ్రామ కూలీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తమ కష్టం తమకు రావాలని, కూలీ డబ్బులు ఇవ్వాలని అధికారులను అడిగితే ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ పొంతలేని సమాధానాలు చెబుతున్నారని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ఎంపీడీఓ చంద్రశేఖర్‌ను వివరణ కోరగా ‘స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమంలో భాగంగా నకిరేకల్ మండలంలోని 17 గ్రామ పంచాయతీల్లో రోజువారీ కూలీలను పెట్టి పనిచేయించాం. కొన్ని గ్రామపంచాయతీల్లో కూలీలకు డబ్బులు ఇచ్చాం. కొంతమంది కూలీలకు డబ్బులు ఇవ్వాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంకా రాలేదు. వచ్చిన వెంటనే కూలీలకు అందజేస్తాం’ అని బదులిచ్చారు.
మా కష్టం మాకు ఇప్పించండి సారూ
గోరెంకలపల్లిలో బడిల, గుడి దగ్గర, గ్రామ పంచాయతీ ఆఫీసు కాడ, ఊళ్ల మొత్తం చెట్లన్నీ తొలగించినం. 14 మంది కూలోల్లం ఐదు రోజులు పని చేసినం. మా డబ్బులు మాకియ్యాలని ఎంపీడీఓను అడిగినం. కార్యదర్శిని అడిగినం. ఎవరూ పట్టించుకుంటలేరు. పని చేపించుకుని అవతల పడ్డరు.
– వంగూరి ఏసయ్య, కూలీ
వర్షంలో తడుసుకుంటూ పని చేసినం
ఆగస్టులో వర్షంలో తడుసుకుంటూ పనిచేసినం. కంపచెట్లు కొడుతుంటే చేతులకు కాళ్లకు తగిలి రక్తాలు కారుతున్నా పట్టించుకోలే. సార్లు చెప్పిర్రని పనిచేసుకుంట పోయినం. అసోంటిది గిప్పుడు పైసలు అడిగితే ఒకాయన మీద ఒకానయ చెప్పుకుంటుర్రు. మా పైసలు ఇయ్యకపోతే కలెక్టర్ కాడికిపోతం.
– శెట్టిపల్లి శ్యాంసన్, కూలీ