ఆలేరు మండలం కొలనుపాకలో గల అగరు వనం వెంచర్లో జరిగిన అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. నమస్తే తెలంగాణ ప్రధాన సంచికలో బుధవారం ‘అగరు వనం ఆరగింత’ శీర్షికతో ప్రచురితమైన కథనంతో అక్రమార్కుల గుండెల్లో గుబులు మొదలైంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి వివాదం ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఎక్కడ చూసిన ఆయన భూ అక్రమాలపైనే చర్చ జరుగుతున్నది. బినామీల పేర్లతో భూములు కొల్లగొట్టిన తీరుపై చర్చించుకుంటున్నారు. కొలనుపాక గ్రామ రెవెన్యూ ప్రాంతంలో సర్వేనంబర్ 472, 473లో మొత్తం 7.27 ఎకరాల భూమిలో అక్రమంగా 154 ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసినట్లు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, వెంచర్ యాజమాని జంగయ్యయాదవ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రిజిస్ట్రార్, అండ్ స్టాంప్స్ విభాగం డీఐజీ మధుసూధన్, ఆడిట్ అధికారి అశోక్ ఉమ్మడి నల్లగొండ జిల్లా సబ్ రిజిస్ట్రార్ హరికోట్ల రవి కలిసి యాదగిరిగుట్ట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో బుధవారం తనిఖీ చేశారు. ఆన్లైన్ కంప్యూటర్లను పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసిన్నట్లు తేల్చారు. ఇందులో పాలుపంచుకున్న ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్ గోపి నాయన్ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. సబ్ రిజిస్ట్రార్ తనిఖీ, సబ్ రిజిస్ట్రార్ సస్పెండ్ వ్యవహరంతో ‘నమస్తే తెలంగాణ’ కథనం నిజమేనని రుజువు చేసింది. ఇందులో ప్రధానంగా ఆ ప్రజాప్రతినిధి వెనుక ఉండి తతంగాన్ని నడిపించినట్లు పలువురు చర్చించుకుంటున్నారు.
154 మంది బినామీల పేరిట..
కొలనుపాక గ్రామంలో సర్వే నంబర్ 472, 473లో మొత్తం 7.27 ఎకరాల భూమిని తన సదరు ప్రజాప్రతినిధి తన అనుచరుల పేరిట గతేడాది డిసెంబర్ 17న సేల్ డీడ్ చేశారు. ఆయానో భయానో ఆలేరు తాసీల్దార్‌ను మేనేజ్ చేసుకుని డీటీసీపీ అనుమతులు లేకుండా, ఒకగుంట మాత్రమే నాలా కన్వర్షన్ చేసి మిగతా ప్లాట్లు కన్వర్షన్ లేకుండానే రిజిస్ట్రేషన్ పూర్తి చేశారు. యాదగిరిగుట్ట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏకంగా 154 మంది బినామీల పేరిట ఒక్కొక్కరికి గుంట, రెండు గుంటలు ఓపెన్ ప్లాట్లుతో రిజిస్ట్రేషన్ చేశారు. సర్వే నంబర్ 472లో గతేడాది 20న 35ప్లాట్లు, 21న 22 ప్లాట్లు, 22న 12 ప్లాట్లు, సర్వే నంబర్ 473లో డిసెంబర్ 20న 16 ప్లాట్లు, 21న 30 ప్లాట్లు, 23న 41 ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ వ్యవహారమంతా గుట్టుచప్పుడు కాకుండా జరిగిందని భావించినా నమస్తే తెలంగాణలో కథనం రావడంతో ఆయన భూ అక్రమం దందా బట్టబయలైంది.
ఆ ప్రజా ప్రతినిధి వ్యవహారంపై ఇంటెలిజెన్స్ ఆరా తీస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ వ్యవహార తీరుపై సదరు ప్రజాప్రతినిధి తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. దిద్దుపాటు చర్యలకు పూనుకున్నాడని, భూ యాజమానులతో బేరసారాలకు దిగిన్నట్లు తెలుస్తున్నది. ఈ వ్యవహారాన్ని చక్క పెట్టాలని ఆయన తోటి తిరిగే ముఖ్య నాయకులకు బాధ్యతలకు ఇచ్చినట్టు పార్టీ వర్గాలు గుసుగుసలాడుతున్నాయి. తనపై వచ్చిన ఆరోపణలను తీవ్రంగా ఖండించాలని తన అనుచరగణానికి హుకూం జారీ చేసినట్టు సమాచారం. అయితే నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ చేసిన 154 ప్లాట్లు రద్దు చేస్తారన్న చర్చ సాగుతున్నది. ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్‌ను సస్పెండ్ చేశారంటే కచ్చితంగా డ్యాకుమెంట్లు సైతం రద్దయ్యే అస్కారం ఉందని పలువురు భావిస్తున్నారు.
ఆరోపణలను ఖండించే ప్రయత్నం
సదరు ప్రజాప్రతినిధి పైన వచ్చిన ఆరోపణను ఖండించేందుకు భూ యాజమానులు ఆగమేఘాల మీద యాదగిరిగుట్ట పట్టణంలో ప్రెస్‌మీట్ పెట్టారు. అగరు వనం వెంచన్ యాజమాని జంగయ్య యాదవ్, తన పార్ట్నర్స్ సంతోష్ లోయ, ఏఎస్ రెడ్డిలతో కలిసి ఆరోపణలను ఖండించే ప్రయత్నం చేశారు. తాము తీన్మార్ మల్లన్నలను కలువలేదని, తమను ఎవరూ భయపెట్టలేదని, తమ పార్ట్నర్స్ మధ్యలో గొడవలున్నాయని చెప్పారు. తమపై వచ్చిన కథనంలో నిజం లేదన్నారు. కానీ ఆరోపణలు ఎదుర్కొంటున్న సదరు ప్రజాప్రతినిధి ఎవరు అని విలేకరులు అడుగగా వారు దాటవేశారు. 154 ప్లాట్లను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారని సబ్ రిజిస్ట్రార్‌ను సస్పెండ్ చేశారు కదా అని అడుగగా, తాము కస్టమర్లకు మాత్రమే విక్రయించామని, ప్రజాప్రతినిధి అనుచరుల పేరిట రిజిస్ట్రేషన్ చేయలేదని తెలిపారు. కాగా తీన్మార్ మల్లన్నను కలిసి జంగయ్యయాదవ్ విన్నవించుకోగా సమగ్ర విచారణ చేపట్టి తగు న్యాయం చేయాలని రిజిస్ట్రేషన్, అండ్ స్టాంప్స్ కమిషనర్ జ్యోతి బుద్ధా ప్రకాశ్‌కు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లను రాసిన లెటర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.